ఫలిస్తున్న భగీరథయత్నం..!

Tue,September 4, 2018 02:28 AM

-రూ.290 కోట్లతో రామప్పలో శరవేగంగా పనులు
-ప్రధాన పైపులైన్ 730 కిలోమీటర్లు
-171 గ్రామాల్లోని 39,391 నివాసాలకు శుద్ధజలం
-త్వరలోనే అన్ని గ్రామాలకు తాగునీరు ..

మిషన్ భగీరథ పథకం తుది దశకు చేరింది. వెంకటాపూర్ మండలంలోని రామప్ప రిజర్వాయర్ పనులు పూర్తి కావొచ్చాయి. రూ.290 కోట్లతో చేపడుతున్న ఈ పనులతో ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట మండలాల్లోని 171 గ్రామాల్లో 39, 391 ఇండ్లకు శుద్ధి చేసిన తాగునీరు సరఫరా కానుంది. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయి, కొన్ని గ్రామాలకు తాగునీరు అందుతోంది. -వెంకటాపూర్ విలేకరి

వెంకటాపూర్ సెప్టెంబర్ 3: గోదావరి నీళ్లు గడపగడపకూ చేరుతున్నాయి. ప్రతి ఇంటికీ తాగునీరిచ్చే లక్ష్యంతో సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ భగీరథ పనులు జయశంకర్ జిల్లా వెంకటాపూర్ మండలంలో జోరుగా సాగుతున్నాయి. రూ. 290 కోట్లతో చేపట్టిన రామప్ప రిజర్వాయర్ పనులు పూర్తి కావచ్చాయి. దీంతో ములుగు, వెంకటాపూర్, గోవిందారావుపేట మండలాల్లోని 171 గ్రామాల్లో 39,391 వేల ఇండ్లకు తాగునీరు సరఫరా కానుంది. పనుల పురోగతిపై మంత్రి చందూలాల్, అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
సమైక్య రాష్ట్రంలో నీటి కోసం పడరాని పాట్లు పడేవారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంటింటికీ శుద్ధిచేసిన గోదావరి జలాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకం ప్రారంభించారు. రూ. 290 కోట్లతో రామప్ప రిజర్వాయర్ నిర్మించి మూడు మండలాల్లోని 171 గ్రామాల్లోని ప్రజలకు నీటిని అందించే పనులు ఇప్పటికే 90 శాతం పూర్తి అయ్యాయి. కొన్ని గ్రామాలకు తాగునీరు అందుతోంది. వెంకటాపూర్ మండలంలో 59 గ్రామాలకు, ములుగు మండలంలో 77 గ్రామాలకు, గోవిందరావుపేట మండలంలో 35 గ్రామాలకు నీరు చేరింది. రోజుకు 21.6 (ఎంఎల్‌డీ) మిలియన్ లీటర్స్ ఫర్ డే తాగునీరు సరఫరా అవుతోంది. రామప్పలోని పాత సంపు ద్వారా పాలంపేట, వెంకటాపూర్, జోహర్‌నగర్, లింగాపూర్ గ్రామాల ద్వారా గోవిందరావుపేట మండలానికి తాగునీరు చేరుతోంది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న సంపు ద్వారా ములుగు మండలంలోని జంగాలపల్లి, బరిగెలపల్లి, ఇంచెర్ల, వయా అంకన్నగూడెం వరకు, తిరిగి జంగన్నపేట, నుంచి పులిగుండ, ప్రేంనగర్, జాకారం, ఎండీ గౌస్‌పల్లి నుంచి మాన్‌సింగ్ తండా వరకు రామప్ప సంపు నీరు అందనుంది. వెంకటాపూర్ మండలంలోని కేశవాపూర్, నర్సాపురం, రామాంజాపూర్, పాలంపేట, వెంకటాపూర్, లక్ష్మీదేవిపేట, భూర్గుపేట, అడవిరంగాపూర్, గుర్రంపేట, పెద్దాపూర్ నుంచి గోపయ్యపల్లి వరకు శుద్ధ జలం ఇంటింటికీ అందించేందుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

730 కిలోమీటర్ల పైప్‌లైన్ పూర్తి


మూడు మండలాల్లో 730 కిలోమీటర్ల మేర ప్రధాన పైపులైన్ వేశారు. గ్రామాల్లో ట్యాంకుల నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయి. అతి త్వరలో అన్ని ప్రాంతాలకు నీళ్లు సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మిషన్ భగీరథ ఏఈ కల్పగూరి సర్సయ్య నమస్తే తెలంగాణకు తెలిపారు.

మండలాల వారీగా ఇలా..


గోవిందరావుపేట మండలంలోని 35 గ్రామాలకు 10,360 ఇండ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు 3869 ఇళ్లలో నల్లాలు ఏర్పాటు చేశారు. ములుగు మండలంలో 77 గ్రామాల్లో 17,905 ఇండ్లకు గానూ 6477 ఇండ్లలో నల్లాలు పెట్టారు. వెంకటాపూర్ మండలంలో 59 గ్రామాల్లో 11,126 ఇండ్లకు గానూ 176 మాత్రమే నల్లాలు ఏర్పాటు చేసినట్లు ఆర్‌డబ్లూఎస్ ఏఈ రాజు వివరించారు. మిగితావి అక్టోబర్ వరకు ఏర్పాటు చేస్తామన్నారు.

171 గ్రామాలకుశుద్ధజలం..


రామప్ప చెరువు నుంచి పంపుల ద్వారా నీటిని రామప్ప చెరువు దగ్గర గుట్టపై నిర్మించిన ట్యాంకుకు తరలిస్తున్నారు. అక్కడ నుంచి ప్రధాన పైపులైను ద్వారా గ్రామాలకు సురక్షితమైన నీటిని తరలిస్తున్నారు. రామప్ప చెరువు నుంచి 171 గ్రామాలకు రోజుకు 21.6 (ఎంఎల్‌డీ) మిలియన్ లీటర్స్ ఫర్ డే అందిస్తున్నారు. గ్రామాలకు నీటిని అందించేందుకు ఇప్పటికే పైపులైను నిర్మించారు. రామప్ప చెరువు వద్ద ఓవర్‌హెడ్‌ట్యాంకులు, సంపులు, 730 కిలోమీటర్ల పైపులైను పనులు పూర్తయ్యాయి.

121
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles