ప్రగతి వీచికలు..!


Thu,January 12, 2017 01:35 AM

-వంతెనల నిర్మాణ పనులకు
స్పీకర్ సిరికొండ శంకుస్థాపన
-ఉపాధి హామీ పనులను
పరిశీలించిన మంత్రి జూపల్లి
-విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన ముగ్గురి తొలగింపు
-కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలోనూ అధికారులపై గరం
-ములుగులో మంత్రులు జగదీశ్‌రెడ్డి, చందూలాల్ పర్యటన
-మూడు విద్యుత్ సబ్‌స్టేషన్ల మంజూరుకు జగదీశ్‌రెడ్డి హామీ

జయశంకర్ జిల్లాప్రతినిధి-నమస్తేతెలంగాణ: రాష్ట్ర శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారితో పాటు ముగ్గురు మంత్రులు బుధవారం జిల్లాలో సుడిగాలి పర్యటన జరిపారు. భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల పరిధిలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ప్రధానంగా వంతెనలు, పాఠశాల భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పథకాల అమలు తీరును స్వయంగా పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనులపై అధికారులకు లక్ష్యాలు నిర్దేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆవిర్భవించిన తర్వాత జిల్లాలో ఒకే రోజు స్పీకర్, ముగ్గురు మంత్రులు పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. అంతేకాదు ఒక మంత్రి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించడం కూడా ప్రథమం. స్పీకర్ మధుసూదనాచారి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటించారు.

స్పీకర్ మొగుళ్లపల్లి మండల కేంద్రం, చిట్యాల మండలం జడల్‌పేట, భూపాలపల్లి మండలం కొత్తపల్లి, భూపాలపల్లి, గణపురం మండలం ధర్మరావుపేట, గణపురం గ్రామాలను సందర్శించారు. మొగుళ్లపల్లిలో బీసీ రెసిడెన్షియల్ స్కూల్ భవనం, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇక్కడ మోడల్ స్కూల్‌లో హాస్టల్‌ను ప్రారంభించారు. గర్మిళ్లపల్లి-మోరంచపల్లి రోడ్డులో రూ.8 కోట్లతో ఐదు వంతెనల నిర్మాణ పనులకు జడల్‌పేట వద్ద శంకుస్థాపన చేశారు. అనంతరం కొత్తపల్లి వద్ద రూ.4కోట్ల అంచనా వ్యయంతో హైలెవల్ వంతెన, గణపురం-చెల్పూరు రోడ్డులో ధర్మరావుపేట వద్ద రూ.2.49 కోట్లతో వంతెన, గణపురంలో గణపసముద్రం మత్తడి వద్ద రూ.1.60 కోట్లతో వంతెన నిర్మాణ పనులకూ మధుసూదనాచారి శంకుస్థాపన చేశారు. భూపాలపల్లిలో జరుగుతున్న జయశంకర్ పార్కు నిర్మాణ పనులు పరిశీలించారు. ఇక్కడి గడ్డిగానిపల్లిలో క్రీడలను ప్రారంభించారు. తన క్యాంపు కార్యాలయం వద్ద కొందరికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. ధర్మరావుపేట వద్ద వంతెన శంకుస్థాపన, భూపాలపల్లిలో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో స్పీకర్ సిరికొండతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్, జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి, ఎంపీపీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.

నిర్లక్ష్యంపై జూపల్లి గరం..


తొలిసారి జిల్లాకు వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావు రేగొండ మండలంలోని రామన్నగూడెం, బాగిర్థిపేట గ్రామాలను సందర్శించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి ఈ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించారు. ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు, ఆయా గ్రామంలోని గ్రామైక్య సంఘాలు, స్వయం సహాయక బృందాలు, గ్రామ జ్యోతి కమిటీల సభ్యులతో మాట్లాడారు. ఇక్కడ ఉపాధి హామీ పథకం అమలు తీరు, పనుల పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బాగిర్థిపేట గ్రామంలో ఉపాధి హామీ పథకం అమలు, కూలీలకు పని కల్పించడంలో విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించిన ఫీల్ట్ అసిస్టెంటు సుదర్శన్, టెక్నికల్ అసిస్టెంటు మహేందర్, ఏపీవో డి.కుమార్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. రేగొండ ఎంపీడీవోకు మెమో జారీ చేయాలని కలెక్టర్ ఆకునూరి మురళిని ఆదేశించారు. నిర్లక్ష్యంపై అనూహ్యరీతిలో మంత్రి మండిపడడం గ్రామీణాభివృద్ధి శాఖలో కలకలం రేపిం ది. సాయంత్రం భూపాలపల్లిలో జిల్లా కలెక్టర్ మురళి అధ్యక్షతన ఉపాధి హామీ పథకం అమలుపై జరిగిన సమీక్ష సమావేశంలో జూపల్లి పాల్గొన్నారు. జిల్లాలో మండలం, గ్రామం వారీగా ఉపాధి హామీ పథకం అమలు తీరు, ఈ పథకం నుంచి కూలీలకు పని కల్పించడంపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో రేగొండతో పాటు మహదేవ్‌పూర్, మహాముత్తారం తదితర మండలాల్లో ఉపాధి హామీ పథకం నుంచి కూలీలకు తక్కువ శాతం పని కల్పించడం, నిధులు తక్కువగా ఖర్చు చేయడం పట్ల అసహనం వెలిబుచ్చారు. సిబ్బందితో పని చేయించండి లేదా వారిపై చర్యలు తీసుకోండి అని ఎంపీడీవోలను ఆదేశించారు. స్వచ్ఛత కోసం ఆరు నెలల్లోగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో వందశాతం మరుగుదొడ్లు నిర్మించాలని కూడ టార్గెట్ పెట్టారు. ఈ సమావేశంలో ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యే పుట్ట మధు పాల్గొన్నారు.

జగదీశ్‌రెడ్డి వెలుగులు


విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి, గిరిజన సంక్షేమం, సాంస్కృతికశాఖ మంత్రి ఎ.చందూలాల్ గోవిందరావుపేట మండలం లక్నవరం, ములుగు మండలంలోని పందికుంట, నవ్షతండా, శివతండా, వెంకటేశ్వర్లపల్లిని సందర్శించారు. తొలుత లక్నవరంలో సందడి చేశారు. ఇక్కడి నుంచి ములుగు మండలం చేరుకుని తండాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పందికుంట గ్రామంలో నిర్మాణం పూర్తి చేసుకున్న 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి చందూలాల్ వినతి మేరకు ములుగు మండలం పత్తిపల్లి, వెంకటాపురం మండలం కేశవపురం, గోవిందరావుపేట మండలం కర్లపల్లి గ్రామాల్లో మూడు విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరు చేయనున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. జిల్లాల పునర్విభజన తర్వాత ఈయన కూడా జిల్లాలో పర్యటించడం ఇదే తొలిసారి. జిల్లా కలెక్టర్ మురళి, జాయింట్ కలెక్టర్ అమయ్‌కుమార్‌తో పాటు వివిధ శాఖల అధికారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు.

56
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS