ధైర్యం చేశారు.. ప్రాణం పోశారు..!


Thu,January 12, 2017 01:31 AM

-సర్కార్ వైద్యశాలలో గర్భిణికి అరుదైన అత్యవసర శస్త్ర చికిత్స
-తల్లీ బిడ్డ క్షేమం, తప్పిన ప్రాణాపాయం
-4.5 కేజీల బరువుతో పుట్టిన బిడ్డ

ఏటూరునాగారం, జనవరి 11 : మండల కేంద్రంలోని సామాజిక వైద్యశాలలో బుధవారం వైద్యులు ఓ ప్రసవ సర్జరీ విషయంలో ధైర్యం చేసి విజయం సాధించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ గర్భిణిని కాపాడేందుకు తమ వద్ద అన్ని రకాల సౌకర్యాలు లేకున్నా ధైర్యంతో అత్యవసర శస్త్ర చికిత్స చేసి, తల్లీ బిడ్డను కాపాడారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన వెట్టి శేఖర్ భార్య రాధ పురిటి నొప్పులతో మండలకేంద్రంలోని సామాజిక వైద్యశాలకు వచ్చింది. వైద్యులు పరీక్షలు నిర్వహించారు. భారీ కాయంతో ఉన్న రాధకు బీపీ అసాధారణ రీతిలో పెరగడం, కడుపులో ఉన్న పాప నాలుగున్నర కేజీలు ఉండడం, హార్ట్ రేట్ కూడా పడిపోతుండడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు గుర్తించారు. వరంగల్‌లోని ప్రసూతి వైద్యశాలకు పంపించే ప్రయత్నం చేశారు.

అయితే, ప్రసూతి వైద్యశాలకు పంపితే మార్గ మధ్యలోనే ఫిట్స్ వచ్చి తల్లీ, బిడ్డలకు ప్రాణ ముప్పు ఉన్నట్లు గుర్తించిన గైనకాలజిస్టు మానసరెడ్డి, అనస్తీషియన్ శ్రీకాంత్ ధైర్యం చేసి ఇక్కడే సర్జరీ చేసేందుకు సాహసించారు. ఇరువురు వైద్యులు సమయస్ఫూర్తితో శస్త్ర చికిత్స చేయగా అది విజయవంతమైంది. తల్లీ బిడ్డ క్షేమంగా ఉండడంతో వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి అరుదైన శస్త్రచికిత్స చేయడం ఇక్కడ ఇదే మొదటిసారి అని వైద్యులు పేర్కొన్నారు. రాధ తొలిసారి కాన్పులో మగశిశువును జన్మించి చనిపోగా, రెండో కాన్పులో పాప పుట్టింది. మూడో కాన్పు క్రిటికల్‌గా ఉన్నప్పటికీ వైద్యులు చేసిన ధైర్యం ఫలించింది. బాబు పుట్టాడు. ఈ సందర్భంగా వైద్యులు మానసరెడ్డి, శ్రీకాంత్ మాట్లాడుతూ వరంగల్ పంపేందుకు సమయం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తల్లీబిడ్డలను కాపాడేందుకు ఈ శస్త్రచికిత్స చేసినట్లు చెప్పారు. కాగా, ఆపరేషన్ జరుగుతున్న క్రమంలో సిబ్బందితోపాటు రాధ బంధువులు ఉత్కంఠకు లోనయ్యారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉండడంతో భర్త శేఖర్‌తో పాటు బంధువులు ఆనందం వ్యక్తం చేశారు. శిశువు కూడా నాలున్నర కేజీలు ఉండడం గమనార్హం. శస్త్ర చికిత్సలో నర్సులు స్వరూప, సుమతి, సుమలత, థియేటర్ సిబ్బంది బిక్షపతి, శ్రీకాంత్, రాధ తదితరులు పాల్గొన్నారు. కాగా, వైద్యశాల సూపరిండెంటెంట్ అపర్ణ వైద్యులను అభినందించారు.

54
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS