చంద్రం చిక్కాడు..!


Thu,January 12, 2017 01:28 AM

-తవ్వినకొద్దీ వెలుగుచూస్తున్న ఆస్తుల చిట్టా
-ఏసీబీ సోదాల్లో కళ్లుబైర్లు కమ్మే నిజాలు
-ఏకకాలంలో నాలుగుచోట్ల దాడులు
- సీసీ కెమెరాల నిఘాలో సస్పెండ్ అయిన ఎంపీడీవో చంద్రమౌళి ఇళ్లు


వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ: ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలపై ఎట్టకేలకు సస్పెండ్ అయిన ఎంపీడీవో చంద్రమౌళిని పట్టుకున్నారు. ఏకకాలంలో నాలుగుచోట్ల దాడులకు దిగిన ఏసీబీ అధికారుల కళ్లుబైర్లు కమ్మే నిజాలు వెలుగు చూశాయి. ఆది నుంచి వివాదాస్పదుడిగా ముద్రపడిన సదరు ఎంపీడీవో, ఆయన అత్తామామల, ఖమ్మం జిల్లాలోని ఆయన స్నేహితుడి, తొర్రూరుమండలం హరిపిరాల ఇంట్లోనూ ఏసీబీ మెరుపు దాడులు జరిపింది. ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు ఏసీబీ గుర్తించి ఆయనపై కేసు నమోదు చేసింది.

మిట్టకోల చంద్రమౌళి ఖానాపూర్ ఎంపీడీవోగా పనిచేస్తున్న సమయంలో ఉన్నతాధికారులపై దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలపై ఆయన సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆయనకు కోపం వస్తే ఏకంగా జిల్లా కలెక్టర్‌ను సైతం టూర్ డైరీ ఇవ్వాలని బెదిరింపులకు గురిచేస్తారని కలెక్టరేట్ గోడలు చెబుతున్నాయి. పోలీసుల్లో కొందరు, మీడియాలో, రాజకీయాల్లో కొందరిని అడ్డంపెట్టుకొని తన కార్యాచరణ కొనసాగించడంలో దిట్ట అని ఆయనపై గతంలో అనేక సందర్భాల్లో ఆరోపణలొచ్చాయి. హమ్మయ్య..ఇంతకాలానికి ఏసీబీ ఓ మంచిపనిచేశారనే అభిప్రాయాలు జిల్లా ప్రజాపరిషత్‌లో వ్యక్తం కావడం విశేషం.


ఏసీబీకి ముచ్చెమటలు


ఖానాపూర్ ఎంపీడీవోగా పనిచేస్తున్న సమయంలో ఉన్నతాధికారులతో అభ్యంకర రీతిలో ప్రవర్తించాడన్న ఆరోపణలపై ఆయన గత జులైలో సస్పెన్షన్‌కు గురయ్యాడు. బుధవారం ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలపై అవినీతి నిరోధకశాఖ ఉదయం 5గంటలకు హన్మకొండలోని రామారావు నగర్‌లో ఉన్న ఆయన ఇంటికి వెళ్లారు. అదే సమయంలో ఖమ్మం జిల్లాలోని ఆయన స్నేహితుడి ఇంట్లో, ఆయన సొంతూరు తొర్రూరు మండలం హరిపిరాలతోపాటు హైదరాబాద్‌లోని బండ్లగూడలో ఏకకాలంలో దాడులకు దిగారు. వరంగల్, కరీంనగర్ రేంజ్ ఏసీబీలు సాయిబాబా, సుదర్శన్‌గౌడ్, సీఐలు వీరభద్రం, రమణమూర్తి, రాఘవేందర్, వెంకటేశ్వర్లు, ప్రతాప్ సహా ఇతర సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు. మిగతా చోట్లకంటే చంద్రమౌళి నివాసముండే దుర్బేద్యమైన ఇంట్లోకి ఏసీబీ అధికారులు వెళ్లేందుకు గంటన్నర సమయం పట్టింది. ఒక రకంగా ఏసీబీ అధికారులకు చుక్కలు చూపించాడని స్వయంగా ఆ శాఖాధికారులే పేర్కొంటున్నారు. తమ అనుభవంలో ఇంత సతాయించిన తీరు ఎప్పుడూ లేదని ఏసీబీ అధికారులు నివ్వెర పోతున్నారు. ఉదయం 5గంటల నుంచి 6-30గంటల దాక గంటన్నరపాటు ఆ ఇంట్లోకి వెళ్లలేని పరిస్థితి ఉత్పన్నమైంది. సీసీ కెమెరాల ఫుటేజీని గమనిస్తూ భార్యాభర్తలిద్దరు తలుపులు తీయకుండా సతాయించారట. ముందుగా ఎవరని గదమాయించి ఆ తరువాత పడుకున్నట్లు నటించి ఎంతకూ తలుపు తీయక పోవడంతో ఏసీబీ అధికారులు ఇంటి ప్రహరీ దూకి లోపలికి వెళ్లి ఒక దశలో పోలీస్ తరహాలో హెచ్చరికలు జారీ చేయడంతో చివరికి తలుపులు తెరుచుకోవడం విశేషం.

కళ్లు బైర్లు కమ్మేలా ఆస్తుల చిట్టా..


ఏసీబీ అధికారులు వెలికితీసిన ఆస్తులు చూసి ఒక్కసారిగా నివ్వెరపోయారు. ప్రాథమికంగా దొరికిన ఆస్తులే రూ.మూడు కోట్లు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో ఆయనను అరెస్ట్ చేశామని ఏసీబీ డీఎస్పీ సాయిబాబా పేర్కొన్నారు.
-నగరంలో వెయ్యి గజాల స్థలం..
-రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ 300చ.గ. స్థలం.
-బీబీనగర్ నెమరుగొళ్లలో 500 చ.గ. స్థలం..
-హన్మకొండ మండలం కొండపర్తిలో 33గుంటల వ్యవసాయ స్థలం.
-అక్కడే ఎకరం 20గుంటల వ్యవసాయ స్థలం.
-ఘట్కేసర్‌లో రెండుచోట్ల 267, 275 చ.గ. స్థలం.
-అత్తమామల దగ్గర హైదర్‌గూడలో 2000 చ.గ. స్థలం..
-హంటర్‌రోడ్ శాయంపేటలో రెండు చోట్ల 420, 410 చ.గ. స్థలం (830గజాలు)
-గీసుగొండ మండలం వసంతాపూర్‌లో మూడు చోట్ల ఒక దగ్గర ఎకరం 10 గుంటలు, ఒక దగ్గర 10గుంటలు, మరొకచోట 24గుంటల స్థలం. వీటితో పాటు 5లక్షల విలువ చేసే బంగారం, ఒక కారు, ఒక మోటర్ సైకిల్, 8బ్యాంక్ ఖాతాలను ఏసీబీ గుర్తించింది.

75
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS