రెవెన్యూ లీలపై విచారణ!


Thu,January 12, 2017 01:26 AM

-ఎంక్వైరీ అధికారిగా ఆర్డీవో
-భూమి రికార్డులు సీజ్ చేస్తాం
-బాధ్యులపై చర్యలు తీసుకుంటాం
-జిల్లా రెవెన్యూ అధికారి మోహన్‌లాల్
-నమస్తేతెలంగాణ ఎఫెక్ట్


(జయశంకర్ జిల్లాప్రతినిధి-నమస్తేతెలంగాణ)
భూపాలపల్లిలో పనిచేసిన రెవెన్యూ అధికారులు కొందరు అక్రమాలకు పాల్పడి పట్టా భూమి ఆక్రమించిన వ్యక్తులకు పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయటంపై స్థానిక ఆర్డీవో వీరబ్రహ్మచారితో విచారణ జరిపిస్తామని జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్‌వో) మోహన్‌లాల్ వెల్లడించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన భూమి రికార్డులు కూడా సీజ్ చేస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. భూపాలపల్లి-పరకాల ప్రధాన రహదారిని ఆనుకుని మంజూర్‌నగర్ వద్ద ఉన్న స్థానిక నగర పంచాయతీ పరిధిలోని పుల్లూరురామయ్యపల్లెకు చెందిన ఒక వ్యక్తి భూమిలోని ఎకరం స్థలానికి ఇద్దరు వ్యక్తులు రెవెన్యూ అధికారుల సహకారంతో అక్రమంగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందటం, వీరిద్దరి నుంచి భూపాలపల్లి పట్టణంలోని వస్త్ర వ్యాపారి ఒకరు రిజిస్ట్రేషన్ చేయించుకుని పనులు ప్రారంభించడం, బాధితుడు సమాచార హక్కు చట్టం కింద తన భూమి రికార్డు, పట్టాదారు పాసుపుస్తకాలకు సంబంధించిన దస్త్రం నిజప్రతులు అందజేయాలని దరఖాస్తు చేయగా రికార్డు, దస్త్రం గాని తమ కార్యాలయంలో లభ్యం కాలేదని రెవెన్యూ అధికారులు సమాధానం ఇవ్వటంపై బుధవారం నమస్తేతెలంగాణలో రెవెన్యూ లీలలు..! శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.

ఈ కథనం రెవెన్యూశాఖ, భూఆక్రమణదార్లలో కలకలం సృష్టించింది. అక్రమార్కుల్లో గుబులు రేపింది. స్థానికంగా దీనిపై తీవ్ర చర్చ జరిగింది. జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి, జాయింట్ కలెక్టర్ అమయ్‌కుమార్ ఈ వ్యవహారంపై ఆరా తీశారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడారు. డీఆర్‌వో మోహన్‌లాల్ ఫోన్‌లో నమస్తేతెలంగాణతో మాట్లాడుతూ మంజూర్‌నగర్ వద్ద పుల్లూరురామయ్యపల్లెకు చెందిన వ్యక్తి భూమిలో నుంచి ఎకరం స్థలానికి ఇద్దరు వ్యక్తులకు అక్రమంగా పట్టాదారు పాసుపుస్తకాలు జారీ కావటం, రికార్డులు, దస్త్రం తహసీల్దార్ కార్యాలయంలో లభ్యం కాకపోవటంపై భూపాలపల్లి ఆర్డీవో ద్వారా విచారణ జరిపిస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్, జాయింటు కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డులు, దస్త్రం కూడ సీజ్ చేస్తామని, అక్రమంగా పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేసిన వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని మరికొన్ని భూముల ఆక్రమణ, కబ్జాదారుల దూకుడుపైనా ఉన్నతస్థాయిలో చర్చ జరిగినట్లు తెలిసింది.

45
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS