రెవెన్యూ లీలలు..!


Wed,January 11, 2017 02:11 AM


(జయశంకర్ జిల్లాప్రతినిధి-నమస్తేతెలంగాణ): భూపాలపల్లిలో పనిచేసిన రెవెన్యూ అధికారుల్లో కొం దరు తమ స్వప్రయోజనాల కోసం సమస్యలు సృష్టించారు. ముడుపులు పుచ్చుకుని రికార్డుల్లో ట్యాంపరింగ్ చేశారు. కొత్తగా భూకబ్జాదార్ల పేర్లను నమోదు చేశారు. అన్యాక్రాంతమైన భూములను తప్పుడు రికార్డులు తయారు చేసి ఆక్రమణదార్లకు కట్టబెట్టారు. అం తేకాదు, ఆక్రమిత భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేశారు. చివరకు రికార్డులేవి అందుబాటు లో లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో భూవివాదాలు ఇపుడు అధికార యంత్రాంగానికి చిక్కుముడిగా తయారయ్యాయి. భూపాలపల్లి కేంద్రంగా జిల్లా ఆవిర్భవించినప్పటి నుంచి భూ వివాదాలు క్రమేణా వెలుగులోకి వస్తున్నాయి. తమ భూమి వివాదంలో పడిందని తెలియగానే యజమానులు లబోదిబో మంటున్నారు. రెవెన్యూ అధికారులను కలిసి తమకు జరిగిన అన్యాయంపై మొరపెట్టుకుంటున్నారు. అధికారులేమో రికార్డులు కనిపించడం లేదని సమాధానం ఇస్తున్నారు. తాజాగా ఇలాంటి భూవివాదం మరొకటి తెరపైకి వచ్చింది. ఆ భూమి విలువ మార్కెట్‌లో ప్రస్తు తం అక్షరాల రూ.కోటికిపైమాటే. భూపాలపల్లిలోని ఓ వస్త్ర వ్యాపారి ఈ భూవివాదానికి కారణం కావడం విశేషం. కొద్ది రోజుల నుంచి ఇక్కడ ఈ వ్యాపారి తీరు పై హాట్ టాపిక్ నడుస్తోంది.

మెయిన్‌రోడ్డులో షోరూం నిర్వహిస్తున్న ఈయన వ్యవహారం స్థానికంగా ఆసక్తికర చర్చకు తెరలేపింది. భూపాలపల్లి-పరకాల ప్రధా న రహదారిని ఆనుకుని మంజూర్‌నగర్ సమీపంలో స్థానిక నగరపంచాయతీ పరిధిలోని పుల్లూరురామయ్యపల్లెకు చెందిన ఓ వ్యక్తికి మూడు సర్వే నెంబర్లలో కొన్ని ఎకరాల భూమి ఉంది. ఇదే మండలంలోని కొంపెల్లి రెవెన్యూ శివారులో గల ఈ భూమి పట్టాదారుగా రెవెన్యూ రికార్డుల్లో సదరు వ్యక్తి పేరే ఉంది. మూడింటిలో ఒక సర్వే నెంబర్‌లో ఉన్న భూమిపై కబ్జాదార్ల కన్ను పడింది. ఇంకేముంది ఈ భూమికి కొందరి పేర్లపై పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీ అయ్యాయి. ఈ పాస్‌పుస్తకాల ఆధారంగా ఆక్రమణదార్లు సదరు భూమిని ఇతరులకు విక్రయించారు. కొనుగోలుదార్లు భవనాల నిర్మాణం కోసం ముందుకొస్తుండడంతో రెవెన్యూ అధికారుల లీలలు బయట పడ్డాయి. ఆక్రమిత భూముల యజమానులు నెత్తినో రు బాదుకుంటూ రెవెన్యూ కార్యాలయాలకు పరుగు తీశారు. తర్వాత అక్రమ కట్టడాలు ఆపాలని పోలీసులను ఆశ్రయించారు.

నకిలీ పాసుపుస్తకాలు..


భూపాలపల్లి-పరకాల ప్రధాన రహదారిని ఆనుకు ని మంజూర్‌నగర్ సమీపంలో ఉన్న తన భూమిలో కొద్ది రోజుల క్రితం అక్రమ కట్టడాలు ప్రారంభించడంతో పుల్లూరురామయ్యపల్లెకు చెందిన ఆ భూమి యజమాని ఆశ్చర్యపోయాడు. ఆరంభంలోనే పనులు అడ్డుకున్నాడు. దీంతో భూపాలపల్లి పట్టణానికి చెంది న వస్త్ర వ్యాపారి తెరపైకి వచ్చాడు. ఇక్కడ ఎకరం భూమిని తాను గత జూలైలో ఇద్దరు వ్యక్తుల నుంచి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు డాక్యుమెంటు చూపాడు. రిజిస్ట్రేషన్ చేసిన ఇద్దరు వ్యక్తులు తనకు పట్టాదారు పాస్‌పుస్తకాలు చూపారని ప్రతులను బయటపెట్టాడు. 1999లో అప్పటి రెవెన్యూ అధికారులు జారీ చేసినట్లు ప్రతులను పరిశీలిస్తే తెలుస్తుంది. ఒకరి పేర 20 గుంటలు, మరొకరి పేర 20 గుంటలకు పట్టాదారు పాసుపుస్తకాలు జారీ అయినట్లు వెలుగులోకి వచ్చింది.

ఈ పాస్‌పుస్తకాల ముద్రణ 2011-12లో జరిగినట్లు పుస్తకంపై ఉంటే, వీటిని 1999లో రెవెన్యూ అధికారులు జారీ చేసినట్లు ప్రతులు వెల్లడిస్తుండడం గమనార్హం. దీంతో ఆ భూమి తనదేనని, ఎవరికీ విక్రయించలేదని పుల్లూరురామయ్యపల్లె వ్యక్తి భూపాలపల్లిలోని తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఫిర్యా దు చేశాడు. రెవెన్యూ అధికారులు రికార్డులు పరిశీలిస్తే పాస్‌పుస్తకాలు జారీ అయిన ఎకరం భూమి ఫిర్యాదుదారు పేరుతోనే ఉంది. 1999లో జారీ అయినట్లు పేర్కొంటున్న పాస్‌పుస్తకాలకు సంబంధించి తామేమి చేయలేమని చెప్పారు. ఈ నేపథ్యంలో తమ వద్ద ఉన్న రికార్డులతో భూపాలపల్లి పోలీసులను ఆశ్రయించి అక్రమ కట్టడం పనులు ఆపాలని పుల్లూరురామయ్యపల్లె వ్యక్తి కోరాడు. చివరకు అక్రమ కట్టడం పనులకు బ్రేక్‌పడిందేగాని వివాదానికి తెరపడలేదు.

రికార్డులు లేవని వెల్లడి..


జిల్లా ఆవిర్భావంతో భూపాలపల్లి పరిసరాల్లోని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రధానంగా కలెక్టరేట్ పనిచేస్తున్న మంజూర్‌నగర్ చుట్టుపక్కల, భూపాలపల్లి-పరకాల ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న భూముల ధరలు మండిపోతున్నాయి. ప్రస్తుతం ఇక్క డ ఎకరం భూమికి ధర రూ.కోటి నుంచి రూ.1.50 కోట్ల వరకు పలుకుతోంది. పుల్లూరురామయ్యపల్లెకు చెందిన వ్యక్తి భూమి కూడా మంజూర్‌నగర్ సమీపం లో ప్రధాన రహదారిని ఆనుకుని ఉండడం గమనా ర్హం. ఇక్కడ సదరు వ్యక్తి భూమిలో రెవెన్యూ అధికారులు ఇద్దరి పేర పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీ చేసిన ఎకరం విలువ మార్కెట్ రేటు ప్రకారం రూ.కోటిపైనే. ఈ వ్యక్తి కొద్దిరోజుల క్రితం సమాచార హక్కు చట్టం కింద భూపాలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు అందజేశాడు. తన భూమిలో ఎకరానికి ఇద్దరి పేర జారీ చేసిన పట్టాదారు పాస్‌పుస్తకాల ప్రొసీడింగ్, 13బీ, 13సీకి సంబంధించిన ఫైల్ నిజప్రతులు అందజేయాలని దరఖాస్తులో కోరాడు. ఈ మేరకు తమ కార్యాలయంలో వెతకగా సంబంధిత రికార్డులు, ఫైల్ గాని లభ్యం కాలేదని పేర్కొంటూ భూపాలపల్లి తహసీల్దార్ ఈ నెల 5వ తేదీన లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

దీంతో పుల్లూరురామయ్యపల్లె వ్యక్తి 1999లో ఇద్దరి పేర తన ఎకరం భూమికి జారీ చేసిన పట్టాదారు పాస్‌పుస్తకాలు రద్దు చేయాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్‌ను కలిశాడు. ఇదంతా తెలిసినప్పటికీ భూపాలపల్లి పట్టణంలోని వస్త్ర వ్యాపారి జిల్లా కేంద్రం కానుందనే వార్తలతో జూలైలో తనను సంప్రదించిన ఇద్దరు వ్యక్తులతో ఎకరం భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని తెలిపాడు. లింకు డాక్యుమెంట్లు లేకపోయినప్పటికీ వ్యాపారి తన పేర రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అతను పథకం ప్రకారం భూ బాగోతానికి పాల్పడ్డాడనడానికి నిదర్శనమని వివరించాడు. రూ.కోటి భూమిని ఎంచక్కా కొట్టేయటానికి పక్కాగా స్కెచ్‌వేసి అమల్లోకి తెచ్చింది వస్త్ర వ్యాపారి అనేది వెలుగులోకి రావడం స్థానికంగా చర్చనీయమైంది. గతంలో ఇక్కడ పనిచేసిన రెవెన్యూ అధికారులు కొందరు నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేసి ఇక్కడ భూవివాదాలు సృష్టించారనడానికి ఇది మచ్చుతునక మాత్రమే.

93
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS