అక్రమ దందాలపై పోలీసుల ఆరా..


Wed,January 11, 2017 02:03 AM


మొగుళ్లపల్లి, జనవరి 10 : మండలంలోని ఇస్సీపేట గ్రామంలో సాగుతున్న అక్రమ దందాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సోమవారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చిట్యాల సీఐ ఆధ్వర్యంలో మొగుళ్లపల్లి, చిట్యాల, టేకుమట్ల, రేగొండ ఎస్సైలు, సిబ్బంది నాకాబందీ నిర్వహించగా ఎండు గంజాయి, జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు లభించిన విషయం తెలిసిందే. కాగా, పోలీసులు గంజాయి, పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి? కొనుగోలుదారులు, అమ్మకందారులు ఎవరు? అనే విషయాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. దీంతో సదరు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

ఇంటి వద్దే గంజాయి అమ్మకాలు


రైతులు పండించిన గంజాయిని మహారాష్ట్రకు చెందిన కొందరు స్మగ్లర్లు నేరుగా సదరు రైతుల ఇంటికి వచ్చే కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. కిలో ఎండు గంజాయిని రూ.3వేల నుంచి రూ.5వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో పలువురు రైతులు అంతర పంటగా సాగు చేస్తున్న గంజాయికి ఒక్క సీజన్‌లోనే రూ.లక్ష నుంచి రూ.3లక్షల వరకు ఆదాయం వస్తోంది. అంతేకాకుండా ఈ పంటకు చీడ, పీడల ఇబ్బంది కూడా ఉండదు. అందుకే గుట్టు చప్పుడు కాకుండా ఈ పంటను పండించడానికి రైతులు మొగ్గు చూపుతున్నారు. అలాగే, కొనుగోలుదారులు కూడా ఇంటి వద్దకే వచ్చి కొనుగోలు చేస్తుండడంతో రైతులకు శ్రమ తప్పుతోంది. వ్యాపారులు ద్విచక్ర వాహనాలపై గ్రామాల్లో తిరుగుతూ గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. వీరిపై పోలీసులు దృష్టి సారిస్తే గంజాయి సాగును నివారించవచ్చు.

అనుమతులు లేకుండా పేలుళ్లు


మండలంలో సుమారు 14 కంప్రెషర్ వాహనాలున్నాయి. వీటిని కేవలం గుట్టలను మాత్రమే పేల్చడానికి ఉపయోగించాలి. కానీ, వ్యవసాయ బావులు, ప్రైవేట్ పనులకు కూడా వీటితో పేలుళ్లు జరుపుతున్నారు. ఇందుకు ఎలాంటి అనుమతులు కూడా ఉండవు. అయినా యథేచ్ఛగా పేలుళ్లు కొనసాగిస్తున్నారు. వేసవి కాలంలో వీరి దందా జోరుగా సాగుతోంది. వీరి నుంచి పోలీసులకు కూడా ముడుపులు ముడుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఇస్సీపేటలో దొరికిన జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే, పేలుడు పదార్థాల బాక్స్‌లకు ఎలాంటి బ్యాచ్ నంబర్లు ఉండవు. దీంతో వాటిని సరఫరా చేసే డీలర్లు సులువుగా కేసుల పాలు కాకుండా తప్పించుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇస్సీపేటలో లభించిన పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయో గుర్తించే విషయంలో పోలీసులు సఫలమవుతారో లేదో వేచి చూడాల్సి ఉంది.

57
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS