మోసం చేశారు..


Tue,November 12, 2019 02:28 AM

-కబ్జాలో ఉన్నా పట్టా ఇవ్వలేదు..
-అమ్మినోళ్లకే పాసు పుస్తకం కట్టబెట్టారు
-కలెక్టరేట్ ఎదుట గుమ్మడవెల్లి రైతు ఆత్మహత్యాయత్నం
-అడ్డుకున్న రెవెన్యూ ఉద్యోగులు
-విచారణ జరిపి న్యాయం చేస్తానన్న కలెక్టర్


జనగామ, నమస్తే తెలంగాణ : భూమి అమ్మినోళ్లు, తహసీల్ ఉద్యోగులు మోసం చేశారు. కబ్జాలో ఉన్నప్పటికీ పట్టా ఇవ్వలేదు. భూమి అమ్మినోళ్లకే పాసు పుస్తకం కట్టబెట్టారు అని ఆరోపిస్తూ జనగామ కలెక్టరేట్ ఎదుట లింగాల ఘనపురం మండలం గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన శెనిగర్ల వెంకటేశ్వర్లు అనే రైతు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నాకి పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లాలో తహసీల్దార్ హత్యోదంతంపై రెవెన్యూ అధికారులు, సిబ్బంది చేపడుతున్న దీక్షా శిబిరం వద్ద సోమవారం జరిగిన ఈ సంఘటన కలకలం సృష్టించింది. ఒక్కసారిగా రైతు తనపై పెట్రోల్ చల్లుకోవడంతో కలెక్టరేట్ వద్ద దీక్షలో ఉన్న రెవెన్యూ అధికారులు అడ్డుకొని రైతును కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి వద్దకు తీసుకువెళ్లారు. కాగా కబ్జాలో ఎవరు ఉన్నారో విచారణ జరిపి న్యాయం చేస్తానని రైతుకు కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ సంఘటనపై బాధిత రైతు వెంకటేశ్వర్లు విలేకరులతో తెలిపిన ప్రకారం.. గుమ్మడవెల్లి గ్రామస్తుడైన మాజీ జెడ్పీటీసీ సభ్యుడు గోసంగి కిష్టయ్యకు చెందిన సర్వేనంబర్ 196/23(ప్రభుత్వభూమి)లో గల ఎకరం భూమిని వెంకటేశ్వర్లు సుమారు 18 ఏళ్ల క్రితం కొనుగోలు చేశాడు. సాదాబైనామా కాగితం ద్వారా రూ.21 వేలు చెల్లించి భూమిపై కబ్జాలో కొనసాగుతున్నాడు. మొట్టమొదటగా ఆ భూమిని ప్రభుత్వం ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్ యాక్ట్(పీవోటీ) కింద మరో రైతుకు కేటాయించగా, ఆయన నుంచి గోసంగి కిష్టయ్య కొనుగోలు చేశారు.

కిష్టయ్య నుంచి బాధిత రైతు వెంకటేశ్వర్లు భూమిని కొనుగోలు చేసినా ఆయన పేరిట పట్టా మార్పిడి జరగలేదు. సాదాబైనామా ద్వారా కొనుగోలు చేసిన భూమిని తన పేరిట పట్టా చేయాలని వెంకటేశ్వర్లు రెవెన్యూ అధికారులకు పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోలేదు. పీవోటీ ద్వారా ఇచ్చిన భూమి రెగ్యులరైజ్ చేయాలనే నిబంధన లేకున్నా ఇటీవల ప్రభుత్వం పేద రైతు అని నిర్ధారిస్తే ఎల్‌ఆర్‌యూపీలో పట్టా చేయాలని ఆదేశించింది. దీంతో పట్టాదారు పాసు పుస్తకం ఉన్న గోసంగి కిష్టయ్య భార్య పోషమ్మ పేరిట రెవెన్యూ అధికారులు పట్టాచేశారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, మొర పెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించగా ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారు. ఈనెల 15న కోర్టులో కేసు వాయిదా ఉండగా భూమి కోసం అధికారులు తిప్పుకుంటున్నారని, తీవ్ర మనస్థాపానికి గురైన వెంకటేశ్వర్లు పెట్రోలు డబ్బాతో కలెక్టరేట్‌కు చేరుకొని రెవెన్యూ అధికారుల దీక్షా శిబిరం సమీపంలోనే ఆత్మహత్య యత్నం చేయడం సంచలనం కలిగించింది.

తృటిలో రైతుకు ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సాదాబైనామా కింద కొనుగోలు చేసిన భూమికి పట్టా ఇప్పించాలని, మోసం చేసిన గోసంగి కిష్టయ్యతోపాటు తనవద్ద డబ్బులు తీసుకున్న రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతు డిమాండ్ చేశారు. దీనిపై కలెక్టరేట్ ఏవో విశ్వప్రసాద్ మాట్లాడుతూ కోర్టు పరిధిలో ఉన్న భూ వివాదాన్ని తాము ఎలా పరిష్కరిస్తామని, పీవోటీ ల్యాండ్‌ను పేద రైతులకు ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని కోరిన సమయంలో గోసంగి కిష్టయ్య పేరున పట్టా ఉండటంతో రెగ్యులర్ చేసినట్లు వివరించారు. కోర్టు వివాదం జరుగుతుండగా కలెక్టరేట్‌కు వచ్చి ఆత్మహత్యాయత్నం చేయడం బాధాకరమన్నారు.

95

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles