రైతు సంక్షేమమే కేసీఆర్ ధ్యేయం


Sun,November 10, 2019 02:13 AM

-దళారుల నుంచి కాపాడేందుకే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
-జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి
-అన్నదాతలు మోసాలకు గురికావద్దు
-తేమ శాతం తక్కువున్న ధాన్యానికే గిట్టుబాటు ధర
-ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
-పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం


చిలుపూర్ : రాష్ట్రంలోని రైతులందరి సంక్షేమ మే సీఎం కేసీఆర్ ధ్యేయమని జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. చిలుపూర్ మండల పరిధిలోని మల్కాపూర్, చిలుపూర్, పల్లగుట్ట గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ సంపత్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు దళారులబారిన పడకుండా ఉండేందుకు కేసీఆర్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా చూడాలనే తపనతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి రైతు ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని ఆయన సూచించారు.

దళారులకు విక్రయించొద్దు : ఎమ్మెల్యే
ఆరుగాలం రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. నియోజకవర్గంలో 16 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలంటే తేమశాతాన్ని తగ్గించి తీసుకురావాలని ఆయన కోరారు. 17 శాతానికి లోపు తేమశాతం ఉన్నట్లయితే ఏ గ్రేడ్ ధాన్యంగా కొనుగోలు చేసి ప్రతి క్వింటాల్‌కు రూ.1,835 అందజేస్తారని అన్నారు. బీ గ్రేడ్ ధాన్యానికి రూ.1,815 అందిస్తారన్నారు. మహిళా సంఘాల ద్వారా ఐకేపీ కొనుగోలు కేంద్రాలను నిర్వహించడం అభినందనీయమన్నారు.

పైప్‌లైన్ ఏర్పాటుకు ఆర్థికసాయం
మండలంలోని పల్లగుట్ట గ్రామంలో ఉన్న వెంకటాద్రిచెరువులోకి నీటిని తరలించేందుకు పైప్‌లైన్ ఏర్పాటు కోసం పల్లగుట్టకు చెందిన పొట్లపల్లి శ్రీధర్‌రావు అనే వ్యక్తి రూ.20 వేల నగదును ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య చేతులమీదుగా ఆ గ్రామ సర్పంచ్ బొట్టు మమత, ఎంపీటీసీ ఝాన్సీరాణికి అందజేశారు. పల్లగుట్టలో వెంకటాద్రిచెరువు ఎగువ ప్రాంతంలో ఉండగా నీటి వనరులు లేకపోవడంతో చెరువు నిండేది కాదు. కాగా మలన్నగండి రిజర్వాయర్‌కు వెళ్లే పంపింగ్ లైన్ అరకిలో మీటర్ దూరం ఉండటంతో చెరువులోకి గోదావరి జలాలను తరలించేందుకు దాత శ్రీధర్‌రావు నగదు అందజేశారు. దీంతో పలువురు ఆయనను అభినందించారు.

ఇప్పగూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
స్టేషన్‌ఘన్‌ఫూర్, నమస్తే తెలంగాణ : మండలంలోని ఇప్పగూడెం గ్రామంలో వరలక్ష్మి సంఘం(సెర్ప్) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రాజయ్య ముఖ్య అతిథిగా హాజరై శనివారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతులు పండించిన పంటలకు సరైన మద్దతు ధర లేకపోవడంతో పెట్టుబడి రాక అప్పులపాలైన పరిస్ధితులుండేవని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పంటలకు మద్దతు ధర అందిస్తూ రైతులకు అండగా ఉంటున్నదని పేర్కొన్నారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో డీఆర్డీవో రాంరెడ్డి, ఆర్డీవో రమేశ్, ఎంపీపీ బొమ్మిశెట్టి సరిత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏడవెల్లి కృష్ణారెడ్డి, రైస్‌మిల్లర్ల సంఘం నాయకుడు ఏడవెల్లి మాధవరెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్ జెడ్పీటీసీ మారపాక రవి, ఏపీవో రమేష్, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు మామిడాల లింగారెడ్డి, కుడా డైరెక్టర్ ఆకుల కుమార్, నియోజకవర్గ సలహాదారు పోలెపల్లి రంజిత్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మనోజ్‌రెడ్డి, నాయకుడు బొమ్మిశెట్టి బాలరాజు, మల్కాపూర్ సర్పంచ్ రవి, ఎంపీటీసీ సుధాకర్, మండల రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ జనగామ యాదగిరి, చిలుపూర్ దేవస్థాన మాజీ డైరెక్టర్ గజ్జెల దామోదర్, వెంకటస్వామి, చిలుపూర్ సర్పంచ్ రాజ్‌కుమార్, పల్లగుట్ట సర్పంచ్ మమత, ఎంపీటీసీ ఝాన్సీరాణి, నియోజకవర్గ నాయకులు శ్రీధర్‌రావు, ఇసురం వెంకటయ్య, బొట్టు చేరాలు, బత్తిని శ్రీను, రఘు, గట్టయ్య, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు తోట వెంకన్న, ఇప్పగూడెం సర్పంచ్ అజయ్‌రెడ్డి, ఎంపీటీసీ శైలజ, గ్రామ అధ్యక్షుడు రాంనర్సయ్య, ఏపీఎం కవిత, సీసీ రజని, ఏఈవో దీపక్, మాజీ సర్పంచ్ పద్మావతి, మహిళా సంఘం సభ్యులు యాదలక్ష్మి, హేమలత, శ్రీదేవి, వాణి, స్వరూప, వీవోఏలు శ్రీలక్ష్మి, జయశ్రీ, కృష్ణలీల తదితరులు పాల్గొన్నారు.

71

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles