నల్లగొండ బాలబాలికల హవా


Fri,November 8, 2019 04:14 AM

-ద్వితీయ స్థానంతో సరిపెట్టుకున్న వరంగల్
-ముగిసిన రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్‌ఐ కబడ్డీ క్రీడోత్సవాలు


పాలకుర్తి, నవంబర్ 06: తెలంగాణ 65వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఇండియా (ఎస్‌జీఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి అండర్-14 బాలబాలికల కబడ్డీ పోటీలు గురువారం ముగిశాయి. పాలకుర్తి మండల కేంద్రంలోని జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో మూడు రోజులపాటు నిర్వహించిన జరిగిన ఈ పోటీల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా బాల, బాలికల జట్లు ప్రథమస్థానంలో విజేతగా నిలిచాయి. రెండో స్థానంలో ఉమ్మడి వరంగల్ జట్లు నిలవగా, రంగారెడ్డికి మూడోస్థానం దక్కింది. బాలికల ఫైనల్లో నల్లగొండ, వరంగల్ జట్లు తలపడగా, నల్లగొండ క్రీడాకారిణి ఆయేషా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి 25కు పైగా పాయింట్లు సాధించింది. చివరకు ఆతిథ్య జట్లపై ఏడుపాయింట్ల ఆధిక్యంతో నల్లగొండ బాలికలు విజయం సాధించారు. బాలుర విభాగంలోనూ అవే ఇరు జట్లు తలపడడంతో పోరు ఉత్కంఠగా కొనసాగింది. చివరకు నల్లగొండ జట్టు వరంగల్‌పై 25 పాయింట్ల అధిక్యంలో గెలుపొంది ట్రోఫీని సాధించింది.

భరత్, అజిత్ పూర్తి అధిక్యం ప్రదర్శించారు. బాల బాలికల్లో నల్లగొండే విజయం సాధించడంతో క్రీడాకారులు ఎల్లేశ్, విజయ్‌కుమార్ కోచ్‌లను భుజాలపై ఎత్తుకొని కేరింతలు కొట్టారు. విజేతలకు ప్రజాప్రతినిథులు, అధికారులు, నిర్వాహకులు బహుమతులతోపాటు ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి సిగసారపు యాదయ్య మాట్లాడుతూ గెలిచిన ఓడిన అదే స్ఫూర్తిగా తీసుకొని పోటీల్లో ముందుకు సాగాలన్నారు. విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. అనంతరం ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, జెడ్పీఫ్లోర్‌లీడర్ పుస్కూరి శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ క్రీడారంగాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచనల మేరకు రాష్ట్ర స్థాయి క్రీడలు పాలకుర్తి లో నిర్వహించి విజజయవంతంగా పూర్తి చేసిన నిర్వాహకులను అభినందించారు. క్రీడా రంగంలో పాలకుర్తికి ప్రత్యేకత ఉందన్నారు.

కార్యక్రమంలో సర్పంచ్ వీరమనేని యాకాంతరావు, ఎంఈవో బుస్సారి రఘూజీ, మండల కో ఆప్షన్ సభ్యుడు ఎండీ సర్వర్‌ఖాన్ ఎస్‌ఎంసీ చైర్మన్ యాకయ్య, రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎండీ అజీజ్‌ఖాన్, పీడీ దస్రూనాయక్ , పాలకుర్తి, చెన్నూరు కాంప్ల్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పోతుగంటి నర్సయ్య, విధుమౌళి పీఈటీలు పాల్గొన్నారు. కాగా జిల్లా ఫ్లోర్‌లీడర్ పుస్కూరి శ్రీనివాస్‌రావు విజేత జట్టుకు రూ.1500, రన్నరప్ విజేత జట్టు రూ.1000, మూడో స్థానం జట్టుకు రూ.500 నగదు అందజేశారు. అదేవిధంగా నల్గొండ క్రీడాకారిణికి కూడా నగదు బహుమతిని అందజేశారు.

72

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles