ప్లాస్టిక్ పెను భూతాన్ని తరిమేద్దాం..


Thu,November 7, 2019 02:15 AM

-ప్లాస్టిక్ రహిత జనగామకు కృషిచేద్దాం
-ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
-పట్టణంలో భారీ అవగాహన ర్యాలీ
-హాజరైన ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, మహిళలు


జనగామ, నమస్తే తెలంగాణ: ప్లాస్టిక్ పెను భూతాన్ని పట్టణం నుంచి తరిమేద్దాం.. జ్యూట్ బ్యాగులను వినియోగించి ప్లాస్టిక్ రహిత జనగామగా మారుద్దాం అని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పిలుపునిచ్చారు. ముత్తిరెడ్డి సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు నీల రామ్మోహన్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన ప్లాస్టిక్ నివారణ అవగాహన ర్యాలీలో అన్ని వర్గాల ప్రజలు వేలాదిగా చేయిచేయి కలిపి కదంతొక్కారు. ముందుగా రైల్వేస్టేషన్ చౌరస్తా వద్ద ర్యాలీని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను వివరించే ప్లకార్డులు, బ్యానర్లు, ఫ్లెక్సీలతో వివిధ సంఘాలు, సంస్థలు, పాఠశాలలు, కళాశాలల యజమాన్యాలు నెహ్రూపార్కు మీదుగా ఆర్టీసీ జంక్షన్ వరకు ర్యాలీగా తరలివచ్చి మానవహారంగా ఏర్పడి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డీసీపీ శ్రీనివాసరెడ్డి, ఏసీపీ వినోద్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ నోముల రవీందర్‌యాదవ్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష, గౌరవ అధ్యక్షుడు పోకల లింగయ్య, పజ్జూరి గోపయ్యతో కలిసి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడారు.

మానవ మనుగడకు సవాల్‌గా..
మానవాళి మనుగడను సవాల్ చేస్తూ ప్రమాదకరంగా మారుతున్న ప్లాస్టిక్‌ను పట్టణ పొలిమేరల్లో తరిమేసేందుకు అన్నివర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తే.. వందశాతం నిర్మూలించడం ద్వారా జనగామ రాష్ర్టానికే ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అన్నారు. ప్లాస్టిక్ రసిత తెలంగాణగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షను ప్రతి పౌరుడు తన ఆశయంగా.. సామాజిక బాధ్యతగా గుర్తించాలని పిలుపునిచ్చారు. సరుకులు కొనుగోలు చేసే సమయంలో ఇంటి నుంచే జనప నార సంచులు, జూట్ బ్యాగులు, ప్రమాదకరం కాని మందం ఎక్కువగా ఉండే కవర్లను వెంట తీసుకువెళ్లాలని సూచించారు. ప్లాస్టిక్ కవర్లను అమ్మడం.. వినియోగదారులకు ఇవ్వడం జరగదని వ్యాపార వర్గాలు ప్రతినబూనడం అభినందనీయమని కొనియాడిన ఎమ్మెల్యే.. పట్టణ సుందరీకరణలో రోడ్డు విస్తరణకు త్యాగం చేసి సమాజ హితం కోసం మరో శపథం చేసిన వ్యాపార వర్గాలకు పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు.

వ్యాపారులు నిర్ణయం తీసుకున్నట్లుగానే ప్రజలు, వినియోగదారులు కూడా ప్రమాదకరమైన ప్లాస్టిక్ కవర్లను వినియోగించమనే సంకల్పంతో స్వచ్ఛందంగా ముందుకు రావాలని ముత్తిరెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలో ప్లాస్టిక్ కవర్లు విక్రయించే దుకాణదారులకు మున్సిపల్ అధికారులు ముందుగానే అవగాహన కల్పించాలని సూచించారు. తనకు వర్ధన్నపేట నియోజకవర్గం జన్మనిచ్చినా రాజకీయంగా ఊపిరిపోసిన జనగామను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేశారు. జనగామ పట్టణంలోని దుకాణాలు, పాన్‌షాపులు, కూరగాయల మార్కెట్, మాంసం, చేపల విక్రయాలు, హోటళ్లు, బార్లు, వైన్‌షాపులు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుట్ సెంటర్లు.. ఇలా ఎక్కడ చూసినా ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకం ఎక్కువగా జరుగుతున్నదని వివరించారు. దుకాణాల్లో ఇచ్చిన పాలిథిన్ కవర్లను ప్రజలు ఇంటి వద్ద బయట పడేస్తున్నారని అన్నారు.

ప్లాస్టిక్ కవర్లతో అపార నష్టం
ప్లాస్టిక్ కవర్లు మట్టిలో కరగడానికి వందల ఏళ్లు పడుతుందని, దీంతో వర్షపు నీరు భూమి పొరల్లోకి చేరకుండా అడ్డుపడుతున్నాయని, తద్వారా భూగర్భ జలాల నిల్వపై ప్రభావం చూపుతుందని ముత్తిరెడ్డి వివరించారు. కవర్లతో చెత్తను నింపి బయట పడేయడంతో వాటిని తిన్న పశువులు మరణిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తక్కువ మందం గల ప్లాస్టిక్ కవర్లు వాడకుండా ఎక్కువ మందం గలవి వాడాలని, ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులకు బదులుగా గుడ్డ సంచులు, పేపర్ కవ ర్లు, జనప నార సంచులు వాడేలా ప్రజలు అలవాటు చేసుకోవాలని యాదగిరిరెడ్డి కోరారు. డీసీ పీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ డిస్పోజల్ గ్లాసుల్లో వేడి టీ, కాఫీ, పాలు తాగడం, ప్లాస్టిక్ ప్లేట్లలో ఆహార పదార్థాలు ఆరగించడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్నారు. డ్రైయినేజీల్లో ప్లాస్టిక్ పేపర్లు, కవర్లు, వస్తువులు పేరుకుపోయి దుర్గంధానికి కారణమవుతుందని వివరించారు.

ప్రజలను చైతన్యం చేస్తున్న ప్రభుత్వం
ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వల్ల పర్యావరణానికి కలిగే ముప్పుపై ప్రభుత్వం మున్సిపాలిటీల్లో కరపత్రాలు పంచుతూ ఆటోలకు మైకులు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యం చేస్తుందని మున్సిపల్ కమిషనర్ రవీందర్ అన్నారు. ప్లాస్టిక్ వినియోగించే వారికి రూ. 250 నుంచి రూ. 500 వరకు జరిమానా విధిస్తామని, అమ్మితే రూ. 2500 నుంచి రూ. 5 వేల వరకు జరిమానా సహా దుకాణాలను సీజ్ చేసే అధికారం కూడా ఉందన్నారు. కార్యక్రమంలో కొమురవెల్లి ఆలయ మాజీ చైర్మన్ సేవెల్లి సంపత్, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు బండ యాదగిరిరెడ్డి, మాజీ మార్కెట్ చైర్‌పర్సన్ బండ పద్మ, డాక్టర్ సుధా సుగుణాకర్‌రాజు, మాజీ కౌన్సిలర్లు గజ్జెల నర్సిరెడ్డి, ఎజాజ్, జనార్దన్‌రెడ్డి, ఉపేందర్, నవ్యశ్రీ నర్సింగ్, వెన్నం శ్రీలత, పన్నీరు రాధిక, టీఆర్‌ఎస్ నాయకులు ఉల్లెంగుల కృష్ణ, మిద్దెపాక లెనిన్, మాశెట్టి వెంకన్న, కూరగాయల శ్రీనివాస్, సేవెల్లి మధు, గంగాభవాని, బక్క లక్ష్మణ్, దామెర రాజు, ఉల్లెంగుల సందీప్, తన్వీర్, సమద్, వడ్యాలపు రాజేందర్, నారోజు రామేశ్వరచారి, మామిడాల రాజు, వెన్నం సత్య నిరంజన్‌రెడ్డి, వ్యాపారులు పజ్జూరి జయహరి, రేణికుంట్ల కృష్ణ, పోతుగంటి సిద్ధయ్య, శర్విరాల ఉపేందర్, మంద రాములు, అఫ్జ్, బుద్దా రమేశ్, మాశెట్టి అశోక్, కందుకూరి శ్రీనివాస్, కైలాసం, మారం ప్రవీణ్, లక్ష్మణ్, బిజ్జాల శ్రీకాంత్, ఏకశిల విద్యాసంస్థల అధిపతి చిర్ర ఉపేందర్‌రెడ్డి, ముత్తిరెడ్డి సేవా సంస్థ అధ్యక్షుడు ఎండీ అన్వర్, ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్, కోశాధికారి పండుగ నరేశ్, ప్రతినిధులు ఎక్కలదేవి సింహాద్రి, సలీం, హమీద్, రంజిత్, కోయల్‌కార్ కిరణ్, బాశెట్టి శేఖర్, నిడిగొండ మహేందర్, భాషిపాక ఎల్లేశ్, సయ్యద్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.

57

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles