32వ రోజూ రోడ్డెక్కిన బస్సులు


Wed,November 6, 2019 02:29 AM

భూపాలపల్లి టౌన్‌, అక్టోబర్‌ 22 : ఆర్టీసీ కార్మికులు 32రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఆ ప్రభావం కనిపించడం లేదు. అసలు ఆర్టీసీలో సమ్మె జరుగుతుందా..? అనే భావన కలుగుతుంది. బస్సులు యథావిధిగా నడుస్తుండడమే ఇందుకు కారణం. సమ్మెకు ముందు ఆర్టీసీ బస్సులు ఎలా కొనసాగాయో ప్రస్తుతం అదేవిధంగా కొనసాగుతున్నాయి. కాకపోతే అప్పుడు ఆర్టీసీ పర్మినెంట్‌ కార్మికులు విధులు నిర్వహించేవారు. ఇప్పుడు ప్రైవేట్‌ డ్రైవర్లు, కండక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులు సాఫీగా ప్రయాణం చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు ప్రైవేట్‌ డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులు నడిపిస్తున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చర్యలు తీసుకుంటున్నారు. పల్లెవెలుగు బస్సులు మొదలుకొని సూపర్‌లగ్జరీ, ఏసీ బస్సులు సైతం రోడ్డెక్కి గ్రామీణ, దూర ప్రాంతాలకు ప్రయాణికులను చేరవేస్తున్నాయి. దీంతో జిల్లాలో సమ్మె జరిగిన ఆనవాళ్లు కనిపించడం లేదు. భూపాలపల్లి ఆర్టీసీ డీఎం లక్ష్మీధర్మ డిపోలోనే ఉండి బస్సులను రూట్లకు పంపిస్తున్నారు. మంగళవారం భూపాలపల్లి ఆర్టీసీ డిపో నుంచి 56బస్సులు రోడ్డెక్కాయి. ఇందులో 50ఆర్టీసీ, 6 అద్దె బస్సులు ఉన్నాయి.


పోలీసుల బందోబస్తు..
ఆర్టీసీ సమ్మె సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అడిషనల్‌ ఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీ సంపత్‌రావుల ఆధ్వర్యంలో సీఐ వాసుదేవరావు, ఎస్సైలు సాంబమూర్తి, రాకేశ్‌, మహిళా ప్రొబేషనరీ ఎస్సై నిహారికలతోపాటు సబ్‌ డివిజన్‌ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ డిపో, బస్టాండ్‌, అంబేద్కర్‌ చౌక్‌లలో ప్రత్యేక పోలీసు టీంలు బందోబస్తు నిర్వహిస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన డెడ్‌ లైన్‌ మంగళవారంతో ముగియగా ఎలాంటి సంఘటనలు జరుగకుండా సీఐ వాసుదేవరావు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ డిపో వద్ద బందోబస్తును ఏర్పాటు చేశారు.
57

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles