సారే గెలవాలె..మేమూ బతకాలె..!


Tue,November 5, 2019 04:00 AM

-విలీనం నుంచి మెట్టుదిగుతున్న కార్మికులు..?
- పట్టించుకునేవారే కరువయ్యారని ఆవేదన


వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ: నెలరోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు తమ ప్రధాన డిమాండ్ అయిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే అంశంపై మెట్టుదిగారని స్పష్టం అవుతుంది. ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత సమ్మె చేస్తున్న కార్మికులు సారే గెలువాలె. మేమూ బతకాలి అనే నిర్ణయానికి వచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తేలేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన పరిణామాలపై కార్మికులకు అసలు విషయం బోధపడింది. ఇంకా తెగేదాకా లాగితే అసలుకే మోసం వస్తుందని వారు గ్రహించారా అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. విలీనం అంశాన్ని పక్కన పడితే మిగతా డిమాండ్లపై స్పందిస్తే తాము భేషరతుగా విధుల్లో చేరుతామని కార్మికుల మనోగతంగా స్పష్టం అవుతున్నది. తమ జీవితాలకు పూచికత్తు ఇస్తే భేషరతుగా విధుల్లో చేరి తమను తద్వారా తమ సంస్థను బతికించుకోవడానికి సిద్ధమనే సంకేతాలిస్తున్నారు. మిగతా కార్పొరేషన్ల కంటే సీఎం తమకు ఎంతో మేలు చేశారు. ఒప్పుకుంటాం. తమ న్యాయమైన డిమాండ్లను మానవీయ కోణంలో పరిష్కరిస్తే యూనియన్లుగా కాకపోయినా కనీసం కార్మికులుగా అయినా విధుల్లో చేరతాం. కానీ చేరే వాతావరణాన్ని ఆర్టీసీ యాజమాన్యం కల్పించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసాధ్యమనుకున్న రాష్ర్టాన్ని సుసాధ్యం చేసిన గొప్ప ఉద్యమ నాయకుడు సీఎం కేసీఆర్. మా ఉద్దేశంలో సారే అన్నీ పట్టించుకోవాలని మేము కూడా అనుకోవడం లేదు. సంస్థ బాగుంటేనే మేమూ బాగుంటాం.

కానీ సంస్థగా ఆర్టీసీ స్పందించడంలేదని ఆర్టీసీ జాక్ నాయకుడు బాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి మా సమస్యలు వెళ్లనీయడం లేదు. అసలు నిజాన్ని ఆయనకు తెలియకుండా కొంతమంది పైస్థాయి వాళ్లు తొక్కిపడుతున్నారు. నిజంగా ఆయన దృష్టికి వెళితే మా సమస్య ఇంత దూరం వచ్చేది కాదు అని ఆయన అభిప్రాయపడ్డారు. విలీనం అనే అంశాన్ని పక్కనపెడతాం. స్వయంగా సీఎం అంత స్పష్టంగా చెప్పిన తర్వాత దాన్నే పట్టుకొని మేము ఉండం. మా సంస్థ బాగుపడాలి. తద్వారా మా బతుకులు బాగుపడాలి అన్నదే మా లక్ష్యం. సీఎం సారే తలచుకోవాలి. ఆయనే గెలువాలే. మేమూ బతకాలే. మా బతుకుల్ని రోడ్డుపాలు ఎందుకు చేసుకుంటం అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో ఇక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ముచ్చటేలేదని తేలిపోయిన తర్వాత కార్మికులు తమ ప్రధాన డిమాండ్ నుంచి తప్పుకున్నారా? అంటే అవుననే అంటున్నారు కార్మికులు. ముఖ్యమంత్రి స్పందనలో కనీసం వీసమెత్తు అయినా ఆర్టీసీ యాజమాన్యం పట్టించుకుంటే తమకీ దుస్థితి వచ్చేది కాదని కార్మికులు, కార్మికుల కుటుంబాలు ఆవేదన చెందుతున్నారు.

విలీనం చేయడం ద్వారా జరిగే నష్టాలను ఊహించి, అంచనా వేసి ప్రభుత్వం విస్పష్టమైన ప్రకటన చేసింది. ప్రభుత్వం అంత కరాఖండిగా తేల్చివేసిన తర్వాత కార్మికులు చేస్తున్న సమ్మెకు చరమగీతం పాడాలనే ఆలోచన అసలు ఆర్టీసీ యాజమాన్యానికి లేకుండాపోయిందని కార్మికులు వేదన చెందుతున్నారు. ముఖ్యమంత్రి ప్రకటనతో సమ్మె నుంచి వచ్చి డిపోల్లో రిపోర్ట్ చేస్తున్న వారికి డ్యూటీలు కేటాయించకపోవడమే కాదు మీరే వెళ్లారు...మీరే వచ్చారు. మాకేం సంబంధం. పోతేపోండి. ఉంటే ఉండండీ అన్న రీతిలో డిపోల్లో వ్యవహరిస్తున్నారని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. విలీనం అనేది లేనేలేదని తెలిసి కూడా తామెందుకు తమ జీవితాలను ఇబ్బందుల పాలు చేసుకుంటాం అని కార్మికులు సడలింపు ధోరణితో ఉన్నారు. విలీనం అనే అంశాన్ని పక్కనపెట్టినా తాము విధుల్లో చేరడానికి ఆర్టీసీ యాజమాన్యం, రీజియన్ స్థాయిలో ఆర్‌ఎం, డిపో స్థాయిలో మేనేజర్లు సంస్థ ఎలా పోతే తమకేంటి అన్న ధోరణితో ఉన్నారని, స్వయంగా ముఖ్యమంత్రి ఇప్పటికి నాలుగైదు సార్లు సమ్మె విరమించండీ అంటూ పిలుపునిచ్చారు.. కానీ ఆర్టీసీ సంస్థగా యాజమాన్యం కార్మికుల కష్టాలను పట్టించుకోకపోతే తమ బతుకులకు పూచీ ఏదని ఆవేదన చెందుతున్నారు. ఉద్యోగులుగా తాము తమ జీతాల్లో పొదుపు చేసుకున్న సొమ్మును కూడా ఆర్టీసీ సంస్థ వాడుకున్నదని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి తెలియకుండా చూస్తున్నారని, ఒకవేళ సీఎంకు ఈ విషయం తెలిస్తే కచ్చితంగా ఆయన దీనిపై స్పందించేవారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

నేడే డెడ్‌లైన్...
కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన గడువు మంగళవారం అర్ధరాత్రితో ముగియనున్నది. ఈ డెడ్‌లైన్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. ఎంత మంది చేరుతారు? ఎంత మంది ఈ అవకాశాన్ని చేజార్చుకుంటారు? అన్నది ఉత్కంఠ గా మారుతున్న నేపథ్యంలో తాము యూనియన్లుగా కాకపోయినా కార్మికులుగా ఒక్కమాట ఆర్టీసీ యాజమాన్యంగా మేమున్నాం. ఈ సంస్థ మనది. ఇది బాగుంటేనే మనం బాగుపడతాం అన్న భరోసా ఇస్తే బాగుండునని మెజార్టీ కార్మికులు అభిప్రాయపడుతున్నారు. ఒక్కమాట..ఒకే ఒక పూచీ ఇస్తే రెక్కలు కట్టుకొని వాలిపోతామనే ధోరణితో కార్మికులున్నారు. ఇం తకీ ఏమవుతుంది? అన్నది ఉత్కంఠగా మారింది. డిపోల వారీగా కార్మికులతో మాట్లాడితే విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టంగా నెలకొన్న వాతావరణం.

69

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles