మున్సిపోల్స్‌కు రంగం సిద్ధం


Wed,October 23, 2019 01:32 AM

జనగామ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జనగామలో ఎన్నికల వేడి మొదలైంది. పురపాలక సంఘం ఎన్నికలు నిర్వహించుకోవడానికి హైకోర్టు మంగళవారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో నేతల్లో ఉత్కంఠ నెలకొంది. జనగామలో ఎక్కడ నలుగురు కలిసినా మున్సిపల్‌ ఎన్నికలపైనే చర్చ జరిగింది. గత ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న సంఘటల్ని నెమరువేసుకున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో జనగామ జిల్లా ఆవిర్భవించాక మొదటిసారి పురపాలక సంఘం ఎన్నికలు జరగనున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే నవంబర్‌లో ఎన్నికలు జరగడం తథ్యం. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆయా వార్డుల్లో ఆశావాహులు తమ ఆలోచనలకు పదునుపెట్టారు. కౌన్సిల్‌హాల్‌లో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే ఆశావహులు పరుగులు పెడుతున్నారు.


జనగామ మున్సిపాలిటీకి ఘన చరిత్ర
జనగామ మున్సిపాలిటీకి ఎంతో చరిత్ర ఉంది. 1953లో గ్రేడ్‌-3 మున్సిపాలిటీగా అవతరించింది. కాలక్రమంలో వార్డుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2010లో గ్రేడ్‌-2 మున్సిపాలిటీగా మారింది. 2014లో 28 వార్డులకు ఎన్నికలు జరిగాయి. అనంతరం అదే ఏడాది జూలైలో పాలక వర్గం ఏర్పాటైంది. ఈ పాలకవర్గం పదవీ కాలం 2019 జూలైతో ముగిసింది. అప్పటి నుంచి ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని నేతలు ఎదురుచూస్తున్నారు. 2014లో అప్పుడు ఉన్న రిజర్వేషన్‌ నిబంధనల ప్రకారం వార్డులను కేటాయించారు. జనగామ పట్టణ జనాభా పెరగడంతో పాటు సమీప గ్రామాలు పట్టణానికి దగ్గరయ్యాయి. ఈ ఏడాది జూలైలో వార్డుల పునర్విభజన ప్రక్రియ చేపట్టారు. యశ్వంతపూర్‌, శామీర్‌పేటను జనగామ మున్సిపాలిటీ పరిధిలోకి చేర్చారు. ఈ మేరకు రెండు వార్డులను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలా పెరిగిన రెండు వార్డులతో కలిపి మొత్తం 30 వార్డులకు మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ త్వరలతో వెలువడనుంది.

65వేలకు పైగా పట్టణ జనాభా..
2019 సాధారణ ఎన్నికల సమయంలో వెల్లడించిన ఓటర్ల జాబితాను బట్టి చూస్తే పట్టణంలో పురుష ఓటర్లే కాస్త ఎక్కువగా ఉన్నారు. కానీ జనాభాలో మహిళల సంఖ్యే ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పట్టణంలో ఎస్టీ ఓటర్లు 937, ఎస్సీ ఓటర్లు 5,569, బీసీ ఓటర్లు 26,617, ఇతరులు 6,367 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 39,480 మంది ఓటు హక్కు పొంది ఉన్నారు. ప్రస్తుతం ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, సవరణలు జరుగుతున్న నేపథ్యంలో ఓటర్ల సంఖ్య కాస్త అటు ఇటుగా మారే అవకాశముంది. వరంగల్‌ జిల్లా కేంద్రానికి 55 కిలో మీటర్లు, హైదరాబాద్‌కు 85 కిలో మీటర్లు దూరంలో ఉన్న జనగామలో అక్షరాస్యత శాతం ఎక్కువ. 82.39 శాతం మంది అక్షరాస్యత సాధించిన జిల్లాగా పేరుంది. 13,500 పైగా నివాస గృహాలు ఉన్న పట్టణంలో అన్ని వార్డులో మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటవుతున్న కాలనీల్లో సదుపాయాలు కల్పిస్తున్నారు. పట్టణానికి రోడ్డు రవాణా సౌకర్యమే కాకుండా రైల్వే రవాణా సైతం ఉంది.

రిజర్వేషన్‌పై ఉత్కంఠ
మున్సిపల్‌ చైర్మన్‌, వార్డుల రిజర్వేషన్‌పై నేతల్లో ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికల అనుభవం ఉన్న వారు తమదైన శైలిలో ముందుకు దూసుకుపోయే అవకాశముంది. వార్డుల జనాభా, ఆయా వార్డులో ఉన్న సామాజిక పరిస్థితితో పాటు తదితర విషయాల్ని బేరీజు వేసుకుంటున్నారు. ఏ వార్డు నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుంది, ఆ వార్డు రిజర్వేషన్‌ ఏవిధంగా ఉండబోతున్నదో, ఎక్కడ అనుకూల పరిస్థితులున్నాయో.. ఇలా అన్ని విషయాలపై నేతలు ఆలోచనలో పడ్డారు. తమకున్న అనుభవంతో ముందస్తుగానే వార్డుల రిజర్వేషన్‌ను ఊహించుకుంటున్నారు. ఇక చైర్మన్‌ పదవికి సైతం చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్లే ఇప్పటికే తమ తమ అనుచర వర్గంతో చర్చలు జరిపారు. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్‌ రానుండటంతో నేతల్లో ఎన్నికల వేడి నెలకొంది.

68

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles