పంచాయతీలకు ట్రాక్టర్లు


Tue,October 22, 2019 02:31 AM

-చెత్త సేకరణకు ట్రాలీ ఆటోలు
-ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
-దీపావళిలోగా కొనుగోలు చేయాలని ఆదేశం
-కలెక్టర్ నేతృత్వంలో జిల్లా స్థాయి కమిటీ
-కన్వీనర్‌గా జిల్లా పంచాయతీ అధికారి
-ట్రాక్టర్ల కొనుగోలుకు కసరత్తు ప్రారంభం


జనగామ రూరల్, అక్టోబర్ 21: పరిశుభ్రమైన పల్లెలుగా తీర్చిదిద్దేందుకు 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. గ్రామాలను నిత్యనూతనంగా తయారు చేసేందుకు సంకల్పించింది. ముఖ్యంగా పారిశుధ్య నిర్వహణపై దృష్టి సారించిన సర్కార్.. అందుకు అవసరమైన వాహనాలను సమకూర్చేందుకు నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలోంచి పుట్టిన ప్రణాళిక పనులతో ఇప్పటికే పల్లెలు కళకళలాడుతుండగా.. ఈ కార్యక్రమాన్ని రోజూ కొనసాగించేలా ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్‌తోపాటు నీళ్ల ట్యాంకర్‌ను కొనుగోలు చేయాలని పంచాయతీరాజ్ శాఖ నుంచి ఆదేశాలు విడుదలయ్యాయి. ఈ మేరకు దీపావళిలోగా కొనుగోలు చేసేందుకు అధికారులు కసరత్తును ముమ్మరం చేశారు. జిల్లాలోని 12 మండలాల్లో 281 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో మూడు గ్రామాలకు ఇప్పటికే ట్రాక్టర్లు ఉన్నాయి. ఐదు గ్రామాలకు ట్రాలీ ఆటోలు ఉన్నాయి.

మిగితా గ్రామాలకు కొనుగోలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా కమిటీని ఏర్పాటు చేశారు. గ్రామాల్లో సంపూర్ణ పారిశుధ్యం కోసం చెత్తాచెదారం తొలగింపు, పచ్చదనాన్ని పెంపొందించేందుకు మొక్కలకు నీళ్లు పట్టేందుకు ట్రాక్టర్లు, ట్రాలీలను ఉపయోగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో జిల్లా యంత్రాంగం కొనుగోలు చేసేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్నది. ఈ దీపావళి పండుగలోగా ప్రతి పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ ఆటో కోనుగోలు చేయాలని ప్రభుత్వం నుంచి పక్కా ఆదేశాలు జారీ అయినట్లు కలెక్టర్ తెలిపారు. గ్రామాల్లో ఇటీవల చేపట్టిన నెల రోజుల ప్రణాళిక పనులకు అద్దె ట్రాక్టర్‌ను వాడుకోవడంతో ఖర్చు భారీగా రావడంతో ప్రతి జీపీకి ట్రాక్టర్ కొనుగోలు చేయాలని అధికారుల సూచన మేరకు ప్రభుత్వం సిద్ధమైంది.

మారిన గ్రామాల రూపురేఖలు
తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన పంచాయతీరాజ్ చట్టంతో గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారాయి. పల్లెల్లో కొన్నేళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యలు 30 రోజుల ప్రణాళిక పనులతో పూర్తిగా తొలగిపోయాయి. పకడ్బందీగా పల్లెల సమగ్రాభివృద్ధికి అడుగులు పడ్డాయి. పరిశుభ్రత, పచ్చదనం, ప్రతి వార్డులోని ఇంటింటికీ మొక్కలు నాటడంతో గ్రామాలు సుందరంగా తయారయ్యాయి. నెల రోజుల్లో జరిగిన పనులకు ప్రభుత్వం నుంచి భారీగా నిధులు విడుదల కావడంతో ప్రతి గ్రామానికి ట్రాక్టర్ కొనుగోలు చేసేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఆయా గ్రామ పంచాయతీల ఆర్థిక పరిస్థితిని బట్టి అందుకనుగుణంగా మినీ ట్రాక్టర్ లేక ట్రాక్టర్‌ను కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశిస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారని అధికారులు తెలిపారు.

సిద్ధమైన ప్రతిపాదనలు..
జిల్లాలోని 12 మండలాల్లో ఉన్న 281 గ్రామ పంచాయతీలకు శివునిపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తిలో ట్రాక్టర్లు, కొడకండ్ల, బచ్చన్నపేట, చిన్నపెండ్యాల, స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథపల్లిలో ట్రాలీ ఆటోలు ఉన్నాయి. ఇవికాకుండా మిగితా గ్రామాల్లో ట్రాక్టర్ల కొనుగోలుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అంటే 278 గ్రామాలకు నూతన ట్రాక్టర్లు కొనుగోలు చేయాల్సి ఉంది. గ్రామ పంచాయతీ జనాభాను బట్టి ఎంత కెపాసిటీ ట్రాక్టర్ అవసరమనేది పంచాయతీరాజ్ శాఖ అధికారులు గుర్తించే పనిలో ఉన్నారు. ట్రాక్టర్ల కొనుగోలుకు సంబంధించిన ప్రభుత్వ నియమనిబంధనలను సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులతో చర్చించి.. ట్రాక్టర్ల కంపెనీల పేర్లను తెలిపి అందరికీ వివరిస్తున్నారు. ప్రతి గ్రామ పంచాయతీ నుంచి ట్రాక్టర్ కొనుగోలుకు సిద్ధమవుతున్నారు. ఈ ట్రాక్టర్లు ప్రతి గ్రామ పంచాయతీ నిధుల నుంచి రూ. 5 లక్షలు చెల్లించి కొనుగోలు చేయాలి. అందుకు ప్రభుత్వం నుంచి వచ్చే 14వ ఆర్థిక సంఘం లేదా గ్రామ పంచాయతీ నిధుల నుంచి మిగితా డబ్బులు చెల్లించేందుకు కసరత్తు చేస్తున్నారు.

ట్రాక్టర్ కొనుగోలుకు కావాల్సిన నిధులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జీపీల్లో ట్రాక్టర్ల కొనుగోలుకు నిధులు ఉన్నాయా.. లేక బ్యాంకుల నుంచి అప్పు తీసుకుని కొనుగోలు చేయాలా.. అందుకు ఏ పద్ధతిన బ్యాంకుకు తిరిగి చెల్లింపులు చేయాలని ప్రతిపాదనలు తీసుకునేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమైంది. గ్రామాల నుంచి ప్రతిపాదనలు వచ్చాక కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి.. సమస్యను పరిష్కరించేందుకు పంచాయతీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి కలెక్టర్ ఆయా బ్యాంకర్ల అధికారులతో చర్చిస్తారు. దీపావళి వరకు గ్రామాల్లో నూతన ట్రాక్టర్లు కొనుగోలు చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రభుత్వం నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసిన విషయం తెలిసింది. ఇందులో 500 జనాభా ఉన్న పంచాయతీలు ఎన్ని ఉన్నాయి..
ఆ పంచాయతీలకు 15 హెచ్‌పీ, 500 నుంచి 3 వేల జనాభా ఉన్న జీపీల్లో 21 హెచ్‌పీ, 3 వేలకు పైగా ఉన్న జీపీల్లో 35 హెచ్‌పీ నుంచి ఆపై కెపాసిటీ ట్రాక్టర్లు కొనుగోలుకు ప్రభుత్వం ప్రతిపాదించినట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం ట్రాక్టర్ల కంపెనీల లిస్టును ప్రభుత్వం విడుదల చేసింది. స్వరాజ్, ఐషర్, మహేంద్ర, పర్బుజన్, హెచ్‌ఎంటీ, జాండీర్ తదితర కంపెనీలు ఉన్నాయి. ట్రాక్టర్ కెపాసీటీ కూడా ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఉంది. గ్రామ పంచాయతీల జనాభా ప్రాతిపదికన వాహనాలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కమిటీ చైర్మన్‌గా కలెక్టర్ నియామకం
గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను కొనుగోలు చేసేందుకు జిల్లాస్థాయిలో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చైర్మన్‌గా కలెక్టర్, కన్వీనర్‌గా జిల్లా పంచాయతీ అధికారి, ఇతర విభాగాల అధికారులు సభ్యులుగా ఉంటారని అధికారులు తెలిపారు.

93

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles