ఫిర్యాదులను పరిష్కరించండి


Tue,October 22, 2019 02:29 AM

-గ్రీవెన్స్‌లో కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి
జనగామ, నమస్తే తెలంగాణ : ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరిస్తున్న ఫిర్యాదులు, వినతులు, దరఖాస్తులపై సంబంధిత జిల్లా అధికారులు తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో డీఆర్‌వో మాలతి, ఏవో విశ్వప్రసాద్‌తో కలిసి నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పలు అంశాలపై ప్రజల నుంచి 67 దరఖాస్తులను స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో గ్రీవెన్స్‌కు వచ్చిన దరఖాస్తులకు పరిష్కారం చూపకపోవడంతో పలువురు మళ్లీ అదే సమస్యపై ఫిర్యాదులు, దరఖాస్తులు చేసుకుంటున్నారని అన్నారు. వీటిని తగ్గించాలంటే దరఖాస్తుదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. నిజమైన బాధితులకు న్యాయం చేయాలని, ఒకవేళ దరఖాస్తుదారుడి ఫిర్యాదు తప్పయితే దానిపై కూడా వారికి స్పష్టత ఇవ్వాలన్నారు. సోమవారం నాటి ప్రజావాణికి మద్యం దుకాణాల నియంత్రణ, భూమి తగాదాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ రుణాల మంజూరు చేయాలని పలువురు దరఖాస్తులు అందజేశారు.


గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని సీపీఐ, సీపీఎం నాయకులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. పలు అంశాలపై స్వీకరించిన ఫిర్యాదులు, దరఖాస్తులు, వినతులను ఆయా జిల్లా శాఖల అధికారులకు పంపించి దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని సూచించారు. ఇదిలా ఉండగా జనగామ మండలం గానుగపహాడ్ గ్రామానికి చెందిన ఓ రైతు పూర్వికుల నుంచి తనకు రావాల్సిన వ్యవసాయ భూమి అన్యాక్రాంతమైందని ఆందోళన వ్యక్తం చేస్తూ పురుగుల మందు, కిరోసిన్ డబ్బాతో ప్రజావాణికి వచ్చాడు. సమాచారం తెలుసుకున్న కలెక్టర్ బాధిత రైతుతో ప్రత్యేకంగా మాట్లాడారు. రైతు గోడును ఓపికగా విన్న కలెక్టర్ పూర్వీకుల ఆస్తి పంపకానికి సంబంధించి గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో కూర్చొని మాట్లాడుకొని సమస్య పరిష్కరించుకునే వరకు వివాదాస్పద భూమిని ఎవరి పేరిట నమోదుచేయొద్దని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

54

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles