రైతు మురవాలె.. వరంగల్ మెరవాలె


Fri,October 18, 2019 03:26 AM

-గిట్టుబాటుకు కట్టుబడాలె
-దిగుబడిని బట్టి కొనుగోలు కేంద్రాలు పెంచుకోవాలి
-మార్కెట్ స్థితిగతులపై రైతులకు సమాచారం అందించాలి
-రైతుల్ని ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదు
-మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు


(వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ) : వర్షాలతో అనూహ్య పంట దిగుబడులు. మునుపెన్నడూలేని విధంగా వరి, పత్తి పంటల సాగు విస్తీర్ణం రికార్డు స్థాయిలో పెరగడం. దిగుబడులు అదే స్థాయిలో ఉంటాయన్న అంచనాలతో సర్కార్ ముందుకుసాగుతున్నది. రైతుకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఎక్కడా నిర్లక్ష్యం చేయకూడదనే విధాన నిర్ణయం. ఎక్కడైనా ఎవరైనా కావాలని రైతులకు ఇబ్బందులు కల్పించారని తమ దృష్టికి వస్తే బాధ్యులపై చర్యలు తప్పవనే హెచ్చరికలు. వరి ధాన్యం లేదా పత్తి కొనుగోళ్లలో కానీ సర్కార్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన మిల్లుల్ని (జిన్నింగ్, రైస్, ఐకేపీ మొదలైన) బ్లాక్ లిస్ట్‌లో పెడతామన్న స్పష్టమైన ఆదేశాలు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ రైతులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడమే పరమావధిగా ముందుకు సాగుతున్న వాతావరణాన్ని పుణికిపుచ్చుకుని ముందస్తు కార్యాచరణ ఉండాలన్న స్పష్టమైన అవగాహన. జిల్లాలో మునుపెన్నడూ లేనివిధంగా కొనుగోళ్ల ప్రారంభానికి ముందే కొనుగోలు ప్రక్రియలో భాగస్వాములైన అన్ని వర్గాలను సమీకరించి కార్యోన్ముఖుల్ని చేయడం దాదాపు ఇదే తొలిసారి. ఈ తొలి అడుగుకు నాంది పలికిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుపై ప్రశంసలు కురిశాయి. సాధారణంగా కొనుగోలు ముందస్తు ఏర్పాట్లపై మార్కెటింగ్ అధికారులతో సమీక్షలు, సమావేశాలు జరిగేది.

కానీ ఈసారి రాష్ట్రంలో తొలిసారిగా వరంగల్ ఉమ్మడి జిల్లా ఒక అడుగు ముందుకేసింది. మంత్రి ఎర్రబెల్లి చొరవతో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులతోపాటు రైస్ మిల్లర్లు, జిన్నింగ్ మిల్లులు, సీసీఐ, ఐకేపీ, రైతు సమన్వయ సమితిలు, హమాలీలు ఇలా కొనుగోళ్లతో సంబంధం ఉన్న అన్ని వర్గాలకు ప్రభుత్వ పరంగా అందే సహకారం, చేయాల్సిన సమన్వయంపై సంపూర్ణ అవగాహన సదస్సు నిర్వహించారు. గురువారం హన్మకొండలోని అంబేద్కర్ భవన్‌లో వరి, పత్తి కొనుగోళ్లపై అవగాహనలో అన్ని వర్గాల నుంచి విలువైన సూచనలు చేశారు. ఆచరణాత్మక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. అంతిమంగా రైతు మురిసెలాగా, రాష్ట్రంలో కొనుగోళ్ల వ్యవహారంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఆదర్శంగా మెరవాలని ఆశించారు. ఖరీఫ్ సీజన్ 2019-20 వరి, పత్తి కొనుగోలుపై వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల అవగాహన సదస్సులో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్లు ప్రశాంత్ పాటిల్, ఎం హరిత, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సొసైటీ చైర్మన్లు, రైతు సమన్వయ సమితి ప్రతినిధులు, సీసీఐ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

కేంద్రానికో ప్రత్యేకాధికారి..
కొనుగోలు ప్రక్రియ మొత్తం సక్రమంగా నిర్వహించేందుకు ఇటీవల గ్రామ పంచాయతీల్లో 30 రోజుల కార్యాచరణ విజయవంతం కావడానికి గ్రామానికో మండలస్థాయి అధికారి, మండలానికో జిల్లా స్థాయి అధికారిని ప్రత్యేకాధికారిగా నియమించినట్లుగా ప్రతి కొనుగోలు కేంద్రానికో పర్యవేక్షణాధికారిని నియమించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రైతులకు ఇబ్బంది కలిగిస్తే ఎవరినైనా ఉపేక్షించేది ఉండదని ఆయన తేల్చిచెప్పారు. కొనుగోళ్ల వ్యవహారంలో ఎక్కడైనా ఎవరైనా రైతులను ఇబ్బందులకు గురిచేసినట్టు తమ దృష్టికి వస్తే సదరు సంస్థలను బ్లాక్ లిస్ట్‌లో పెడతామని హెచ్చరించారు.

దిగుబడికి అనుగుణంగా కేంద్రాలు
సమృద్ధిగా వర్షాలు కురిసి మునుపెన్నడూ లేనివిధంగా పంట దిగుబడి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు అనుగుణమైన కొనుగోళ్లు చేయడానికి అందుబాటులో ఉన్న అన్ని రకాల సౌకర్యాలను వినియోగించుకోవాలని, అందరూ భాగస్వాములు కావాలని సర్కార్ భావించింది. పత్తి, వరి ధాన్యం కొనుగోళ్లపై ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించుకొని అమలు చేసుకోవాల్సిన అనివార్యతల్ని గుర్తించి సమగ్ర కార్యాచరణ సిద్ధం చేశారు. పత్తి, వరి ధాన్యం కొనుగోలులో గతానుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎదురైన అనుభవాలను గుణపాఠాలుగా మార్చుకొని ముందుకుసాగేందుకు అవగాహన సదస్సు దోహదం చేసింది. ఐకేపీ కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, మార్కెట్ యార్డులు పూర్తి స్థాయిలో పనిచేయాలని, రైతులకు మేలు జరిగేలా ఉండాలన్న స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

గ్రామాలు, మండలాల వారీగా వ్యవసాయ అధికారుల దిగుబడి అంచనాలకు తగ్గట్టుగా కొనుగోలు కేంద్రాలు ఉండాలని, కొన్నిచోట్ల దిగుబడి ఎక్కువగా ఉంటే ఆ దిగుబడికి ఎక్కువ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిందేనని మంత్రి ఎర్రబెల్లితోపాటు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి సూచించారు. అంతేకాకుండా పత్తి కొనుగోళ్ల విషయంలో సీసీఐ గతంలో అనుసరించిన పద్ధతిని అనుసరిస్తే సమస్యలు ఉత్పన్నం అవుతాయని, సీసీఐ గిట్టుబాటు ధర చెల్లించడంతోపాటు అంతకన్నా అధిక ధర చెల్లించే వ్యాపారస్తులకు పోటీగా ఉండాలంటే నిరంతరం ఆపరేషన్స్ ఉండటంతోపాటు నిబంధనల మేరకు లూజ్ పత్తిని తీసుకొచ్చేందుకు అధికారులు రైతుల్ని చైతన్యం చేయాలని సూచించారు. సీసీఐకి ఉన్న మానవ వనరులు సరిపోకపోతే.. తమ దృష్టికి తెస్తే వారికి సహకరించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని మంత్రి సహా జిల్లా కలెక్టర్లు భరోసా ఇచ్చారు.

విధులు..బాధ్యతలు
రైతు దిగుబడితో ఇంటి నుంచి మార్కెట్‌కు తరలించే ముందు నెలకొన్న వాతావరణం నుంచి మార్కెట్‌లో తన సరుకును అమ్ముకొని పోయేదాకా అన్నిస్థాయిల్లో భాగస్వాములయ్యేవారు బాధ్యతగా తమతమ విధుల్ని నిర్వర్తించాల్సిందేనని సర్కార్ స్పష్టం చేసింది. గతంలో కంటే ఈసారి గ్రామ, మండల, జిల్లా రైతు సమన్వయ సమితి బాధ్యులు, రైతులకు అన్ని విధాలుగా సహాయకారిగా, సంధానకర్తగా ఉండేలా చొరవ తీసుకోవాలి. కేవలం వారేకాకుండా స్థానిక ప్రజాప్రతినిధి నుంచి మొదలుపెడితే ఎమ్మెల్యే, మంత్రి దాకా అందరూ వారివారి స్థాయిల్లో వారు రైతుకు తోడ్పాటును అందించాలని సంకల్పించడం ఈసారి విశేషం. సీసీఐ కానీ, వరి కొనుగోళ్ల విషయంలో గిట్టుబాటు ధర నిర్ణయం తీసుకున్న తర్వాత నాణ్యమైన సరుకు మార్కెట్‌కు తెస్తే అందుకు తగ్గ ధర వస్తుందని భరోసా ఇచ్చారు. ఇటు పత్తిలో కానీ, అటు వరి ధాన్యంలో కానీ తేమ శాతం తక్కువగా ఉండేవిధంగా రైతులకు సమగ్రంగా అవగాహన కల్పించేలా కార్యాచరణ చేయాలన్నారు.

సీసీఐ, పీపీసీ (వరి ధాన్యం కొనుగోలు కేంద్రం)లకు ఆయా కేంద్రాల వద్ద నెలకొన్న పరిస్థితులు, మార్కెట్ స్థితిగతుల్ని ఎప్పటికప్పుడు రైతులకు అవగాహన కల్పించడం, అందరూ బాధ్యత తీసుకోవడంతోపాటు మరోవైపు మిల్లర్లు, ప్రైవేట్ వ్యాపారులు, జన్నింగ్ మిల్లులు, రైస్ మిల్లుల యజమానులు, ట్రాన్స్‌పోర్ట్‌కు సంబంధించిన ఏర్పాట్లు పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేయాలని సూచించారు. అంతిమంగా రైతు మురవడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, రైతుకు ఎటువంటి కష్టం, ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పారు. నాణ్యమైన పత్తి దిగుబడి చేస్తున్న జిల్లాగా గుర్తింపు ఉన్న వరంగల్, ఇప్పుడు వరి దిగుబడిలోనూ ప్రముఖ స్థానం ఆక్రమించిందని ఈ నేపథ్యంలో కొనుగోళ్ల ప్రక్రియలో ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా రాష్ర్టానికే ఆదర్శంగా నిలవాలని ప్రతినబూనడం విశేషం.

63

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles