మద్దతు ధర కల్పించేందుకే..కొనుగోలు కేంద్రాలు


Thu,October 17, 2019 03:24 AM

-స్వరాష్ట్రంలో అన్నదాతల ముఖాల్లో సంతోషం
-రైతులు కోరితే మరిన్ని అదనపు కేంద్రాలు
-తేమ లేకుండా ధాన్యం తీసుకురావాలి
-జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
-జనగామ మార్కెట్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
జనగామ, నమస్తే తెలంగాణ, అక్టోబర్ 16: ధాన్యానికి మద్దతు ధర కల్పించేందుకే జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి స్పష్టం చేశారు. జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం(పీఏసీఎస్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జేసీ ఓజే మధు, ఆర్డీవో మధుమోహన్, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ ఇర్రి రమణారెడ్డి, డీఎస్‌వో రోజారాణి, జిల్లా సహకార అధికారి(డీసీవో) మద్దిలేటితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ మద్దతు ధరల పట్టిక పోస్టర్లను ఆవిష్కరించి, యార్డులో రైతులు అమ్మకానికి తెచ్చిన ధాన్యం నాణ్యతను యంత్రంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబీమా పథకాలతోపాటు వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర, కొరత లేకుండా ఎరువులు, పురుగుల మందులు అందిస్తుండడంతో రాష్ట్రంలోని రైతులు సంతోషంగా ఉన్నారన్నారు.

రైతు ముఖాల్లో చిరునవ్వు..
గత పాలకుల హయాంలో రైతులు అన్ని విధాలుగా ఇబ్బందులు పడేవారని, తెలంగాణ వచ్చిన తర్వాత స్వయంగా రైతుబిడ్డ అయిన కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో కష్టాలన్నీ తొలగిపోయి.. ఏడాదంతా వారి ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తున్నదని ముత్తిరెడ్డి అన్నారు. అన్ని నియోజకవర్గాలు, మండలకేంద్రాల్లో ఆ ప్రాంత అవసరాలకు తగ్గట్టు గోదాముల నిర్మాణం చేపట్టామని, ఎంత ధాన్యం పండితే అంత మేరకు ప్రభుత్వ సంస్థల ద్వారా మద్దతు, గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేసేలా కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. గోదావరి జలాలతో చెరువులు, కుంట లు నింపి గ్రామాల్లో సాగునీటి సమస్య తీర్చడం వల్ల పంట దిగుబడి గణనీయంగా పెరిగిందని, అన్ని రకాల ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయడం ద్వారా దళారీ వ్యవస్థను పూర్తిగా రూపుమాపినట్లు ముత్తిరెడ్డి స్పష్టం చేశారు.


రైతు సమస్యలను పట్టించుకోలేదు..
గత ప్రభుత్వాలు రైతులు ఎదుర్కొంటున్న ఏ ఒక్క అంశంపై దృష్టి సారించని ఫలితంగా విత్తనాలు మొదలుకొని.. ఎరువులు, పురుగు మందులు, కరెంట్, పంట ఉత్పత్తుల అమ్మకం కోసం రైతులు రోడ్డెక్కి ఆందోళన చేయాల్సి వచ్చేదని ఎమ్మెల్యే ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. తేమ శాతం 17 కంటే తక్కువ, చెత్తాచెదారం లేకుండా ఉన్న ధాన్యానికి మద్దతు ధర లభిస్తుందన్నారు. త్వరలో జిల్లాలోని మరిన్ని ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, ఒకవేళ ధాన్యం ఎక్కువగా పండే గ్రామాల్లో రైతులు కోరితే అక్కడ కూడా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే చెప్పారు. తేమ, తాలు, చెత్త లేకుండా సకాలంలో యార్డుకు తీసుకువచ్చేలా మార్కెటింగ్ అధికారులు రైతులను చైతన్యం చేయాలని ఆదేశించారు. ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉంటే యార్డులో ఆరబెట్టుకునే వెసులుబాటు కల్పించాలని సూచించారు. వ్యాపారులు సైతం ధాన్యం అతితక్కువ ధరకు కొనుగోలు చేయడం సరికాదని, అలాంటి ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిన్నచిన్న అంశాలపై రైతులు ఆందోళనకు దిగకుండా సమస్య ఉంటే అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని కోరారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వాలి
పన్నుల రూపంలో తెలంగాణ ఏటా కేంద్రానికి రూ. లక్షా 35 వేల కోట్ల నిధులు సమకూరుస్తున్నా.. మన వాటాగా కేంద్రం నుంచి అతితక్కువ నిధులు వస్తున్నాయని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. పరాయి పాలనలో 60 ఏళ్లు వెనకబాటుకు గురైన తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తూ శాశ్వత ప్రాతిపదికన గోదావరి నదిపై అత్యంత ప్రతిష్టాత్మకమైన బహుళార్థ సాధక కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందన్నారు. దేశంలోనే అతితక్కువ వ్యవధిలో ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం చేకూర్చే ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తే రెండు పంటలకు నిండుగా నీళ్లు, ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లు అందించే వీలుండేదని అభిప్రాయపడ్డారు. కానీ, బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలపై వివక్ష చూపుతోందని విమర్శించారు. రాష్ట్రంలో కార్మికులు, కర్షకుల చెమట చుక్కలతో కేంద్రానికి జమ చేస్తున్న నిధుల్లోంచి కనీసం లక్ష కోట్ల రూపాయలు మంజూరు చేస్తే తెలంగాణలో సంక్షేమ, అభివృద్ధి పథకాలు మరింత మెరుగ్గా అమలవుతాయన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలన, ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ సహా మేధావులు, ఆర్థికరంగ నిపుణులే ప్రశంసించారని ఎమ్మెల్యే గుర్తుచేశారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి జీవన్‌కుమార్, సహకార కార్యాలయం సూపరింటెండెంట్ మురళీరమణ, అసిస్టెంట్ రిజిస్ట్రార్, జనగామ పీఏసీఎస్ పర్సన్ ఇన్‌చార్జి శ్రీనుబాబు, సీఈవో ఆర్ విద్యాసాగర్‌రావు, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పోకల లింగయ్య, టీఆర్‌ఎస్ నాయకులు పసుల ఏబెల్, గజ్జెల నర్సిరెడ్డి, బూరెడ్డి ప్రమోద్‌రెడ్డి, ఉల్లెంగుల కృష్ణ, మాశెట్టి వెంకన్న, సురేందర్‌రెడ్డి, పంతుల ప్రభాకర్‌రావు, వెంకట్‌రెడ్డి, అన్వర్ షరీఫ్, లెనిన్ పాల్గొన్నారు.

72

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles