క్యాన్సర్‌పై యుద్ధభేరి!


Sun,October 13, 2019 01:44 AM

- తెలంగాణ సర్కార్‌ మరో వినూత్న కార్యక్రమం
- త్వరలో ‘ఇంటింటికీ క్యాన్సర్‌ పరీక్షలు’ ప్రారంభం
- ప్రజల ఆరోగ్య సమాచారం ఆన్‌లైన్‌లో నమోదు
- ఇప్పటికే వైద్య సిబ్బందికి పూర్తయిన శిక్షణ
- తొలివిడతలో ఎంపికైన జిల్లా


జనగామ జిల్లాప్రతినిధి, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం మరో సమరానికి సన్నద్ధమైంది. ఇప్పటికే కంటివెలుగు, కేసీఆర్‌ కిట్‌ వంటి వినూత్న పథకాలతో సత్ఫలితాలను సాధించిన రాష్ట్ర సర్కార్‌.. క్యాన్సర్‌ మహమ్మారిని తరిమేందుకు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‘ఇంటింటికీ క్యాన్సర్‌ పరీక్షలు’ అనే కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. త్వరలోనే ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించనుంది. కార్యక్రమ అమలుకు తొలి విడుత 12 జిల్లాలను ఎంపిక చేయగా, అందులో జనగామ ఒకటి. ఈ మేరకు సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చింది. వైద్య సేవలు అందించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారు.

బాధితుల్లో మహిళలే అధికం..
క్యాన్సర్‌ కేసుల రికార్డులను ఓసారి పరిశీలిస్తే బాధితుల్లో మహిళలే అధికంగా ఉన్నారు. అందులో అత్యధిక శాతం గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌, రొమ్ము క్యాన్సర్‌ వారు ఉన్నారు. ఇక మగవారిలో ఎక్కువ శాతం నోటి క్యాన్సర్‌ వస్తున్నది. ఇలాంటి క్యాన్సర్లను తొలి దశలోనే గుర్తించి చికిత్స అందించడం కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ‘ఇంటింటికీ క్యాన్సర్‌ పరీక్షలు’ కార్యక్రమాన్ని నవంబర్‌లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నది. నోటి, రొమ్ము క్యాన్సర్‌ పరీక్షలను ఇళ్ల వద్దే నిర్వహిస్తారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ పరీక్షలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షల అనంతరం బాధితులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలోనే తొలిదశ చికిత్స అందిస్తారు. పుండ్లు అయిన వారికి వీఏహెచ్‌ పరీక్ష చేస్తారు. ఈ పరీక్ష నివేదికను బట్టి క్రయోథెరపి చేయాలా.. బయాప్సికి పంపించాలా అనేది వైద్యులు నిర్ధారిస్తారు. హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్‌ వైద్యశాల నేతృత్వంలో ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో వైద్యాధికారులు, నర్సులకు శిక్షణ ఇచ్చారు. క్యాన్సర్‌ పరీక్షలకు అవసరమైన పరికరాలను సమకూర్చేందుకు నూతనంగా కొనుగోలు చేయాలని ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించింది.

17 పీహెచ్‌సీల ఆధ్వర్యంలో..
జిల్లా నుంచి క్యాన్సర్‌ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వం చేపడుతున్న ఇంటింటికి క్యాన్సర్‌ పరీక్షలు కార్యక్రమంపై వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. జిల్లాలోని 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్‌సీ) నుంచి సిబ్బంది శిక్షణలో పాల్గొన్నారు. ఒక్కో పీహెచ్‌సీ నుంచి ఒక డాక్టర్‌, ఒక ఏఎన్‌ఎం శిక్షణ తీసుకున్నారు. మాతాశిశు సంరక్షణ కేంద్రం నుంచి ఒక గైనకాలజిస్ట్‌ శిక్షణ పొందారు. మొత్తం 35 మందికి ‘ఇంటింటికీ క్యాన్సర్‌ పరీక్షలు’ కార్యక్రమంపై రాష్ట్ర స్థాయిలో శిక్షణ తీసుకున్నారు. వీరంతా కార్యక్రమం ప్రారంభం కాగానే ఇంటింటికీ వెళ్లి పరీక్షలు చేయడానికి సన్నద్ధమయ్యారు.

వారంలో ఐదు రోజులు..
వారానికి ఐదు రోజులపాటు ఇంటింటికీ వెళ్లి రోజుకు 30 మందికి పరీక్షలు చేస్తారు. పరీక్షించిన వ్యక్తి ఆరోగ్య సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. శిక్షణ పొందిన ఏఎన్‌ఎంలు ఇంటింటికీ వెళ్లి పురుషులు, మహిళల నీటిలో టార్చిలైట్‌ వేసి ఎలాంటి పుండ్లు ఉన్నాయి.. ఎంతకాలం నుంచి ఉన్నాయని తెలుసుకుంటారు. నోటిలో దీర్ఘకాలికాలంగా మానని పుండ్లు ఉన్నా.. తెల్లని మచ్చలు కనిపించినా.. నోరు పూర్తి స్థాయిలో తెరవలేకపోతున్నా.. గతంలో పొగాకు ఉత్పత్తులు వాడినా, ప్రస్తుతం వాడుతున్న వారు, ఈ తరహా సందేహాస్పద లక్షణాలున్న వారిని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది గుర్తించి వివరాలు నమోదు చేస్తారు. మహిళల్లో ప్రత్యేక విధానంలో రొమ్ము పరీక్షలు చేస్తారు. రొమ్ములో నొప్పిలేని గడ్డలు, చనుమొన నుంచి రక్తం రావడం, చనుమొన లోపలికి వెళ్లడం వంటి లక్షణాలు రొమ్ము క్యాన్సర్‌గా అనుమానిస్తారు. ప్రాథమికంగా సందేహించిన వారిని సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి వద్దకు తీసుకెళ్లి అక్కడ మరోసారి పరీక్షిస్తారు. క్యాన్సర్‌గా నిర్ధారిస్తే ఎంఎన్‌జే క్యాన్సర్‌ దవాఖానకు తరలిస్తారు.

గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌కు మాత్రం వైద్యాధికారి అందుబాటులో ఉన్న ఆరోగ్య కేంద్రంలోనే శిక్షణ పొందిన నర్సింగ్‌ సిబ్బంది పరీక్షలు చేస్తారు. ప్రాథమిక స్థాయిలో ఉందని గుర్తిస్తే అక్కడికక్కడే చికిత్స చేస్తారు. అలాగే, చికిత్సకు ముందు సందేహించిన ప్రాంతం నుంచి కణాలను సేకరించి బయాప్సీ పరీక్షకు పంపిస్తారు. చికిత్స అనంతరం మూడు నెలల తర్వాత మరోసారి పరీక్షలు చేసి బయాప్సీకి పంపిస్తారు. తద్వారా బాధితురాలికి ఎప్పటికప్పుడు చికిత్స అందించడంతోపాటు వ్యాధి తీవ్రతను అంచనా వేయవచ్చు.

సేవలు అందించేందుకు సిద్ధం
‘ఇంటింటికీ క్యాన్సర్‌ పరీక్షలు’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించినా వైద్య సేవలందించడానికి సిద్ధంగా ఉన్నామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ మహేందర్‌ తెలిపారు. సర్కార్‌ ఆదేశాల మేరకు శిక్షణ కార్యక్రమం పూర్తయిందన్నారు.
గత నివేదికలను పరిశీలిస్తే జిల్లాలో క్యాన్సర్‌ బాధితుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. వారిలో ఎక్కువ మంది గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌తో బాధపడుతున్నారని ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ అశోక్‌కుమార్‌ తెలిపారు. గత సర్వే ప్రకారం జనాభాలో 0.025 శాతం నోటి క్యాన్సర్‌, 0.032 శాతం రొమ్ము క్యాన్సర్‌, 0.039 శాతం మంది గర్భసంచి ముఖ ద్వార క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తేల్చారని పేర్కొన్నారు. అయితే, ఈ శాతం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. జనాభా విపరీతంగా పెరగడంతోపాటు క్యాన్సర్‌ బాధితుల సంఖ్య కూడా పెరిగిన కారణంగానే ప్రభుత్వం ‘ఇంటింటికీ క్యాన్సర్‌ పరీక్షలు’ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు.

43

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles