పల్లె మురిసె..


Thu,October 10, 2019 04:16 AM

-మారిన గ్రామాల ముఖచిత్రం
-పరిశుభ్రంగా పల్లె సీమలు
-గ్రామ పంచాయతీలు కళకళ
-వాడవాడలా పచ్చదనం
-95 శాతం ప్రణాళిక పనులు


జనగామ, నమస్తే తెలంగాణ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రణాళిక కార్యాచరణలో భాగంగా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులతో పల్లెలన్నీ మురిసిపోతున్నాయి. గ్రామాల్లో స్వచ్ఛందంగా చేపట్టిన శ్రమదానాలతో గ్రామాల రూపురేఖలు మారాయి. పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం తొలగించి శుభ్రం చేశారు. మురికినీటి కుంటలు, డ్రైనేజీలు పరిశుభ్రమయ్యాయి. రహదారులకు అడ్డంగా ఉన్న పిచ్చిమొక్కలను తొలగించి ఖాళీ జాగాల్లో మొక్కలు నాటారు. ప్రభుత్వం నుంచి మంజూరయ్యే నిధులను పక్కాగా.. పకడ్బందీగా ఖర్చు చేసేలా చేపట్టిన పనులు పల్లెలను అభివృద్ధి వైపు నడిపించాయి. ప్రజాప్రతినిధులు, ప్రత్యేక అధికారులు, సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డుసభ్యులు, స్టాండింగ్ కమిటీ, కోఆప్షన్ సభ్యులు, మహిళా, యువజన, స్వచ్ఛంద సేవా సంస్థల సమిష్టి భాగస్వామ్యంతో పల్లెలన్నీ కళకళలాడుతున్నాయి. అభివృద్ధి ప్రణాళిక పనుల్లో ముందున్న గ్రామాలకు గ్రేడింగ్ కేటాయించి పలు గ్రాంటుల ద్వారా నిధులు మంజూరు చేయడం సహా ఆదర్శ సర్పంచ్‌లకు బహుమతులు ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 30 రోజుల ప్రణాళిక పనులకు జిల్లాకు రూ.8.04 కోట్లు మంజూరయ్యాయి. అలాగే గ్రామాల్లో జనాభా ప్రాతిపదికన ఒక్కొక్కరికి రూ.100 చొప్పున 14వ ఆర్థిక సంఘం నిధులు, రూ.67 చొప్పున రాష్ట్ర ప్రణాళిక నిధులు మంజూరయ్యాయి. శనివారం సాయంత్రం జిల్లాలోని 281 గ్రామాల్లో 95 శాతం మేరకు పనులు పూర్తయ్యాయి. జిల్లా పరిషత్, పురపాలక సంఘాల్లో మాత్రమే ఉన్న స్థాయి సంఘాలు, కోఆప్షన్ సభ్యుల విధానాన్ని గ్రామపంచాయతీ వ్యవస్థలో అమలుచేయడంతో అన్ని వర్గాల ప్రజలు ప్రగతి పనుల్లో భాగస్వామ్యమయ్యారు.

ఏకమై ప్రగతి పథం వైపు..
పల్లె పాలనను గాడిలో పెట్టేందుకు రాష్ట్రప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం మేరకు గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి సులువైన మార్గం ఏర్పడి పల్లె పరిపాలన పరుగులు పెడుతున్నది. జిల్లాలోని 281 గ్రామపంచాయతీలు ఉండగా ఒక్కో పంచాయతీకి ముగ్గురు కో-ఆప్షన్ సభ్యుల చొప్పున నాలుగు స్టాండింగ్ కమిటీలతో మొత్తం 16,821 మంది ప్రాతినిధ్యం వహిస్తుండగా, అందులో 8121 మంది మహిళల్లో 843 మందికి కోఆప్షన్ సభ్యులుగా చోటుదక్కింది. ఇందులో గ్రామాభివృద్ధిలో స్ఫూర్తి కలిగిన రిటైర్డ్ ఉద్యోగి, సీనియర్ సిటిజన్, గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు, గ్రామ పంచాయతీకి దాతగా నిలిచిన వారికి ఈ అవకాశం దక్కింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018 సెక్షన్ 49(1) ప్రకారం పారిశుద్ధ్యం, డంపింగ్‌యార్డు, శ్మశానవాటిక, వీధి దీపాల ఏర్పాటు వంటి అంశాలపై నాలుగు స్థాయి సంఘాలను ఏర్పాటుచేశారు. ఇందులో మొక్కల పెంపకం, పచ్చదనం పెంచేలా, సంతల నిర్వహణ కోసం పనిచేస్తున్నాయి. నాలుగు స్టాండింగ్ కమిటీల పనితీరుతో గ్రామ పరిపాలన వ్యవస్థ దిశ, దశ మారుతున్నది. కోఆప్షన్ సభ్యులు, స్థాయి సంఘాల సభ్యులను ఈ అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం కల్పించడం వల్ల అందరూ బాధ్యతతో పనులు చేస్తున్నారు. దీనివల్ల హరితహారం లక్ష్యం, వీధిదీపాల అలంకరణ వంటి సమస్యలు సులువుగా పరిష్కారం అవుతున్నాయి.

పల్లెల్లో విద్యుత్ సమస్యలకు పరిష్కారం..
గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరిసేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టేందుకు పవర్‌వీక్, హరితహారం కార్యక్రమాల నిర్వహణకు 30 రోజుల ప్రణాళిక రూపొందించగా, వీటి అమలులో ప్రజాప్రతినిధులు, అధికారులు కీలకంగా మారారు. సీఎం పంచాయతీరాజ్ శాఖ సమీక్షలో గ్రామాలను బలోపేతం చేసేందుకు ఏరకంగా ముందుకు వెళ్లాలనే అంశంపై దిశానిర్దేశం చేయడంతో పవర్‌వీక్, హరితహారం కీలక అంశాలుగా ఉంటే గ్రామాల్లో పవర్ వీక్ పేరిట ఏడురోజుల పాటు పూర్తిగా విద్యుత్ సంబంధమైన సమస్యలు పరిష్కరించారు. మీటర్ల ఏర్పాటు, వీధిలైట్ల కోసం థర్డ్‌లైన్‌ను ఏర్పాటుచేయడం, ప్రమాదకరంగా ఉన్న స్తంభాలు, వేలాడే తీగలను గుర్తించి సరిచేయడం, పొడవాటి కట్టెలు, ఇనుప స్తంభాలను తొలగించి సిమెంట్ స్తంభాలను నాటడం పూర్తిచేశారు. అలాగే హరితహారంలో భాగంగా విలేజ్ నర్సరీని ఏర్పాటు చేయడం, గ్రామాల్లో వీధివీధిలో విరివిగా మొక్కలు నాటి వాటికి నీళ్లు పోసి సంరక్షిస్తున్నారు. ప్రత్యేక ప్రణాళికలో భాగంగా హరితహారంపై ప్రత్యేకదృష్టి సారించి మొక్కల పెంపకంతోపాటు దోమల నివారణకు ఈసారి కృష్ణ తులసి మొక్కలను పంపిణీ చేశారు.

జిల్లా వ్యాప్తంగా 71,716 మొక్కలు అవసరం ఉండగా 34,364 మొక్కలను అందజేశారు. జిల్లావ్యాప్తంగా 1445 ప్రాంతాల్లో రోడ్ల లెవలింగ్ పూర్తి చేశారు. జిల్లాలోని గ్రామ ప్రధాన వీధులు, దారుల్లో 3,90,245 ఎవెన్యూ ప్లాంటేషన్ మొక్కలను 680.86 కిలో మీటర్ల మేరకు నాటారు. గ్రామాల్లో 446 ప్రాంతాల్లో కమ్యూనిటీ ప్లాంటేషన్ల ద్వారా 7,76,546 మొక్కలు నాటారు. జిల్లావ్యాప్తంగా 9 వేల ఎల్‌ఈడీ లైట్లు వేయాల్సి ఉండగా, 5,681 వీధి లైట్లను అమర్చారు. జిల్లా వ్యాపితంగా రూ.50లక్షల వరకు దాతలు తమ గ్రామాలకు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. రోడ్లపై చెత్తాచెదారం వేసినందుకు రూ.3లక్షల జరిమానా విధించారు.

93

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles