అదనపు చార్జీలు వసూలు చేస్తే చర్యలు


Thu,October 10, 2019 04:12 AM

జనగామ, నమస్తే తెలంగాణ : ఆర్టీసీ ద్వారా నడుస్తున్న బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేస్తే సంబంధిత తాత్కాలిక సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ హెచ్చరించారు. బుధవారం ఆయన హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జనగామ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, డీసీపీ శ్రీనివాసరెడ్డి, జిల్లా రవాణా అధికారి రమేశ్ రాథోడ్, ప్రాంతీయ అధికారి సాయి చరణ్, ఆర్టీసీ డిపో మేనేజర్ ధరమ్‌సింగ్ పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పనిచేస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్ర వ్యాపితంగా 58 నుంచి 68శాతం బస్సులు నడుపుతున్నామని, దసరా సెలవులు మరో నాలుగు రోజుల్లో ముగుస్తున్నందున, పాఠశాలలు పునర్ ప్రారంభం కానున్న దృష్ట్యా ఇదే స్ఫూర్తితో ఒత్తిడి లేకుండా పనిచేయాలని సూచించారు. ప్రత్యామ్నాయంగా నియమించిన డ్రైవర్లు, కండక్టర్లు ప్రయాణికుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని అలాంటివి దృష్టికి వస్తే తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 80శాతం బస్సులు నడుస్తున్నాయని, ఆర్టీసీ ప్రాంగణంలో 32సీసీ కెమెరాలను అమర్చి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశామని, ప్రశాంత వాతావరణంలో బస్సులు నడుస్తున్నాయని వివరించారు. ఆర్టీసీ బస్సుల్లో అధిక వసూళ్లు చేస్తే కాల్‌సెంటర్ కాంటాక్ట్ నంబర్ 7382926139 ద్వారా ప్రయాణీకులు ఫిర్యాదు చేస్తే బాధ్యుడైన కండక్టర్‌పై ఎఫ్‌ఐఆర్ బుక్ చేయాలని సూచించారు. బస్ పాస్‌లు ఉన్న వారిని అనుమతించాలని, విధుల్లోకి వెళ్లే ముందు డ్రైవర్లు, కండక్టర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపుతున్నామని చెప్పారు. బస్సుల నిర్వహణకు ప్రైవేట్ మెకానిక్‌లను తీసుకోవాలని, ఆర్టీసీ కార్యాలయాల్లో ఇతర విధులకు ప్రభుత్వశాఖల సిబ్బందిని ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

55

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles