పూల వనమైంది


Mon,October 7, 2019 03:29 AM

-జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ
-గంగమ్మ ఒడిని చేరిన గౌరమ్మ
-వర్షంలోనూ మహిళల ఆటపాట
-పాల్గొన్న ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, రాజయ్య, కలెక్టర్, డీసీపీ
-ఆడిపాడిన యాదగిరిరెడ్డి, వినయ్‌కృష్ణారెడ్డి సతీమణులు


జనగామ నమస్తే తెలంగాణ, అక్టోబర్ 06: పుడమితల్లి పూల వనమైంది.. ఆడబిడ్డల ఆటపాటలతో వీధివీధి మార్మోగింది. తొమ్మిది రోజులపాటు సాగిన పూల జాతర ఆదివారం ముగిసింది. చివరి రోజు సద్దుల బతుకమ్మ సంబురాలు జిల్లాలో అంబరాన్నంటాయి. తీరొక్క పూలతో పేర్చిన రంగురంగుల బతుకమ్మలను ఆడపడుచులు ఒక్కచోట చేర్చి.. చేయిచేయి కలిపి చప్పుట్లు కొట్టి బృందగానాలతో ఆడిపాడారు. ఈ సందర్భంగా జిల్లా అంతట మైదానాల్లో బతుకమ్మ ఆటపాటలతో సందడి నెలకొంది. ఆదివారం సాయంత్రం వర్షం కురిసి బతుకమ్మ వేడుకలకు సిద్ధం చేసిన మైదానాలు బురదమయంగా మారినా ఏడాదికోసారి వచ్చే సద్దుల బతుకమ్మ సంబురాల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం నిదురపో గౌరమ్మ నిదురపోవమ్మా.. నిదురకు నూరేళ్లు.. నీకు వెయ్యేళ్లు.. అంటూ వాగులు, చెరువుల్లో నిమజ్జనం చేశారు. పసుపు గౌరమ్మను తాంబూలంలో తీసుకొని.. ఒకరికొకరు వాయినం ఇచ్చుకున్నారు. వెంట తీసుకెళ్లిన సద్దులను విప్పి సత్తుపిండిని పంచిపెట్టారు. జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య బతుకమ్మలకు స్వాగతం పలికి వేడుకల్లో పాల్గొన్నారు. జిల్లాకేంద్రంలోని బతుకమ్మకుంటలో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకలకు కలెక్టర్ టీ వినయ్‌కృష్ణారెడ్డి దంపతులు, డీసీపీ శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, ఆయన సతీమణి పద్మలతారెడ్డి హాజరయ్యారు.

వర్ణశోభితమైన బతుకమ్మకుంట
జనగామలోని బతుకమ్మకుంట, బాణాపురం(రంగప్ప చెరువు) ప్రాంగణాలు జనసాగరమై తీరొక్కపూలతో వర్ణశోభితమైంది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి దంపతులు, కలెక్టర్ టీ వినయ్‌కృష్ణారెడ్డి దంపతులు, డీసీపీ శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ముత్తిరెడ్డి ప్రత్యేకంగా బతుకమ్మకుంటలో సద్దుల బతుకమ్మ ఏర్పాట్లను పలుమార్లు పర్యవేక్షించి మైదానాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. వేదికల వద్ద పటాకుల పేలుళ్లతో చిన్నారులు సందడి చేయగా, యువకుల కేరింతలు.. యువతులు ఆటపాటల్లో మునిగితేలారు. ఆటపాటల అనంతరం పోయిరా బతుకమ్మ పోయిరావమ్మా.. అంటూ మహిళలు వీడ్కోలు పలికారు.

ప్రజాప్రతినిధులు, అధికారుల సందడి
జనగామ పట్టణంలోని బతుకమ్మకుంట, బాణాపురంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఆయన సతీమణి, బతుకమ్మ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షురాలు పద్మలతారెడ్డి, మున్సిపల్ కమిషనర్ నోముల రవీందర్, మాజీ మార్కెట్ చైర్‌పర్సన్ బండ పద్మ, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు బండ యాదగిరిరెడ్డి పాల్గొన్నారు. తొలుత బాణాపురం(రంగప్పచెరువు) వద్ద జరిగిన బంగారు బతుకమ్మ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు ప్రదానం చేశారు. అలాగే, పట్టణంలోని కొండల్‌రెడ్డి కాలనీ, శివాలయం, గిర్నిగడ్డ, గుండ్లగడ్డ, అంబేద్కర్‌నగర్, సంజయ్‌నగర్, జ్యోతినగర్, శ్రీనివాసకాలనీ, గీతానగర్, ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద సాయంత్రం 6 నుంచి రాత్రి 10 వరకు మహిళలు బతుకమ్మ ఆటలు ఆడారు. కార్యక్రమాల్లో మాజీ కౌన్సిలర్లు ఎల్లయ్య, రజనీ సతీశ్, హరిశ్చంద్రగుప్త పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముత్తిరెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ద్వారా మరిన్ని నిధులు సాధించి బతుకమ్మకుంటను మినీ ట్యాంక్‌బండ్‌గా సర్వహంగులతో తీర్చిదిద్ది మహిళలకు అంకితం ఇస్తానన్నారు.

జాగృతి ద్వారా విశ్వవ్యాప్తం చేసిన బతుకమ్మ సంబురాలను రానున్న రోజుల్లో మరింత శోభాయమానంగా జరుపుకుందామన్నారు. కార్యక్రమంలో కొమురవెల్లి ఆలయ మాజీ చైర్మన్ సేవెల్లి సంపత్, మార్కెట్ మాజీ చైర్‌పర్సన్ బండ పద్మ, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పోకల లింగయ్య, గౌరవ అధ్యక్షుడు పజ్జూరి గోపయ్య, మాజీ కౌన్సిలర్లు గజ్జెల నర్సిరెడ్డి, కొన్యాల జనార్దన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు పసుల ఏబెల్, డాక్టర్ సుధా సుగుణాకర్‌రాజు, ఉల్లెంగుల కృష్ణ, ఉడుగుల నర్సింహులు, మామిడాల రాజు, ఏనుగుతల యాదగిరి, సోమేశ్వర్, రాపర్తి ప్రశాంత్, జిట్టె శ్రీశైలం, బక్క లక్ష్మణ్, దామెర రాజు, లెనిన్, చిన్నం నర్సింహులు, జనగాం సత్తిరెడ్డి, వడ్యాలపు రాజేందర్, సురేందర్‌రెడ్డి, తిప్పారపు విజయ్ పాల్గొన్నారు.

65

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles