యాసంగికి సాగునీరందిస్తాం


Mon,October 7, 2019 03:26 AM

లింగాలఘనపురం, అక్టోబరు 06 : మండలంలోని చెరువులను డిసెంబరు వరకు గోదావరి జలాలతో నింపి యాసంగి పంటకు సాగునీరును అందిస్తామని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. జనగామ మండలంలోని యశ్వంతాపూర్ నుంచి నెల్లుట్ల వరకు నిలిచిపోయిన అశ్వరావుపల్లి రిజర్వాయర్ ప్రధాన కాలువవను ఆయన జనగామ ఆర్డీవో మధుమోహన్‌తో కలసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్బంగా మూలబావిలోని దీకొండ యాదగిరి నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. లింగాలఘనపురం మండలంలోని అన్ని చెరువులను మూడు కాలువల ద్వారా గోదావరి జలాలతో చెరువులను నింపుతున్నామన్నారు. ఒక కాలువ ద్వార నవాబుపేట రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు చేరుకుంటున్నాయన్నారు. ఈ క్రమంలో వనపర్తి చెరువు మత్తడి పోస్తుండగా, కొత్తపెల్లి చెరువు అలుగుకు సిద్ధ్దంగా ఉందన్నారు. నేలపోగుల, వడిచర్ల, కొత్తపెల్లి, గుమ్మడవెల్లి చెరువుల్లోకి గోదావరి జలాలు చేరుతున్నాయన్నారు. మరో కాలువ ద్వారా చీటకోడూరు రిజర్వాయర్ నుంచి మండలంలోని మాణిక్యపురం, నాగారం, కళ్లెం చెరువులను నింపి 1285 ఎకరాలకు సాగు నీరందించేందుకు పనులు యుద్ధ్ద ప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. మూడో కాలువైన అశ్వరావుపెల్లి ప్రధాన కాలువకు కొంతమంది రైతులు అడ్డుకోవడంతో పనులు నిలిచాయన్నారు.


కాలువ 35 కిలో మీటర్ల మేర తవ్వు తుండగా, జనగామకు చెందిన నాలుగెకరాలు, లింగాలఘనపురం మండలం నెల్లుట్లకు చెందిన రెండు ఎకరాలు రైతులు అడ్డు కోవడంతో పనులు నిలిచి పోయాయన్నారు. ఆయా రైతుల నష్టపరిహారాన్ని కోర్టులో జమ చేసి పోలీసు బలగాలతో కాలువ పనులు పూర్తి చేయిస్తామన్నారు. వచ్చే ఏడాది మార్చి లోగా ఈ కాలువ ద్వార నీరందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారని, వాస్తవానికి డిసెంబరు వరకే పూర్తి చేయించేందుకు అధికారులపై ఒత్తిడి తీసుక వస్తున్నామన్నారు. రైతులు సహకరించాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ చిట్ల జయశ్రీ, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బొల్లంపెల్లి నాగేందర్, ఆర్డీవో మధుమోహన్, లింగాలఘనపురం, జనగామ తహసీల్దార్లు రంగ, రవీందర్, నాయకులు చిట్ల ఉపేందర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, మోటె వీరస్వామి, గట్టగల్ల యాదగిరి, కేమిడి వీరసాయిమల్లేశ్, కేమిడి యాదగిరి, వేముల శ్రీనివాస్, నీలం నర్సయ్య, బింగి స్వామి, రవి, ఉడుగుల భాగ్యలక్ష్మి, కొత్తకొండ గంగాధర్, ఉప్పల మధు, వేమండ్ల శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు మూలబావిలో ఇందిర సత్తిరెడ్డి నివాసంలో ఎమ్మెల్యే రాజయ్య బతకమ్మ పేర్చారు.

86

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles