పరిసరాల పరిశుభ్రతలో భాగస్వాములు కావాలి


Fri,September 13, 2019 03:50 AM

చిలుపూర్, సెప్టెంబర్ 12: పరిసరాల పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని జెడ్పీ సీఈవో రమాదేవి సూచించారు. సీఎం కేసీఆర్ చేపట్టిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా చిలుపూర్ మండలంలోని చిన్నపెండ్యాల, రాజవరం, తీగలతండాను గురువారం ఆమె సందర్శించారు. ప్రతీ కుటుంబానికి తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనే ఆలోచన ఉంటే నిరంతరంగా ఆరోగ్యంగా ఉంటారని జెడ్పీ సీఈవో అన్నారు. కార్యదర్శులు, సర్పంచ్‌లు చైతన్యవంతులుగా ఉన్న గ్రామాల్లో 30 రోజుల ప్రణాళిక సక్రమంగా సాగుతున్నట్లు తెలిపారు. ప్రతీ ఇంటికి 6 మొక్కలను అందిస్తారని, ఆ మొక్కలను అందించిన ఇంటికి స్టిక్కరింగ్ చేస్తారన్నారు. మొక్కలను తీసుకున్న వారు నాటి పోషిస్తే ప్రభుత్వపరంగా పథకాలు సక్రమంగా అందుతాయన్నారు. ప్రజలు జబ్బు చేసినప్పుడే దోమల గుర్తించి ఆలోచిస్తారని, నిరంతరంగా ఇళ్లలో ఉన్న మురికి, చెత్తాచెదారాన్ని తొలగిస్తే ఆ బాధ ఉండదన్నారు.


ప్రస్తుత సీజన్‌లో డెంగ్యూ, మలేరియా జ్వరాల బారిన పడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నట్లు తెలిపారు. ప్రతీ ఇంటి పరిధిలో పూల మొక్కలు నాటుకుని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అదేవిధంగా కృష్ణతులసి మొక్కలను నాటితే ఇళ్లలోకి దోమలు రాకుండా నివారించుకోవచ్చని ఆమె సూచించారు. శుక్రవారం జనగామ జిల్లాకేంద్రం నుంచి వడ్లకొండ గ్రామం వరకు రోడ్డుకిరువైపులా 1500 మీటర్ల పొడవునా మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న సర్పంచ్‌లు హాజరు కావాలని జెడ్పీ సీఈవో కోరారు. గ్రామాల్లో పుట్టి పెరిగిన వారంతా తమవంతు సహకారాన్ని అందించాలనే ఆలోచన, మంచి మనస్సుతో విరాళాన్ని అందించి, గుర్తింపు పొందాలని కోరారు. కార్యక్రమంలో డీఎల్‌పీవో కనకదుర్గ, ఎంపీడీవో సత్యనారాయణ, సర్పంచ్‌లు మామిడాల లింగారెడ్డి, మారెపల్లి తిరుమల కృష్ణమోహన్‌రెడ్డి, మాలోత్ లక్ష్మి ఠాకూర్, ఈవోపీఆర్డీ సురేష్, కార్యదర్శులు రోగ్జాబేగం, తిరుమల్‌రెడ్డి, గట్టు సంకీర్తన పాల్గొన్నారు.

46

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles