పల్లెలు మురిసిపోతున్నాయి


Thu,September 12, 2019 02:37 AM

-కొనసాగుతున్న 30 రోజుల కార్యాచరణ
-గిర్నితండలో మంత్రి ఎర్రబెల్లి, వెల్దిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
-యువకులతో కలిసి మంత్రి శ్రమదానం
-అధికారులు, ప్రజాప్రతినిధుల పల్లెబాట
-గ్రామాల్లో బృందాల విస్తృత పర్యటన
-స్టాండింగ్, కో ఆప్షన్ కమిటీల ఎన్నికలు


జనగామ, నమస్తే తెలంగాణ, సెప్టెంబర్ 11: పల్లెలు మురిసిపోతున్నాయి. ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో గ్రామాల్లో కనీస వసతులు కల్పించి అభివృద్ధికి బాటలు వేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులంతా పల్లెబాట పట్టారు. గ్రామాల్లో పచ్చదనం సంతరించుకునేలా మొక్కల పెంపకం, పల్లెలను అద్దంలా తయారు చేసేందుకు పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ, అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు మరమ్మతులు చేయడం వంటి పనులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బుధవారం కొడకండ్ల మండలం గిర్నితండలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను మంత్రి ఎర్రబెల్లి స్వయంగా డోజర్‌తో తొలగించారు.

అలాగే, గ్రామంలోని యువకులతో కలిసి పారతో పిచ్చిమొక్కలు, చెత్తాచెదారాన్ని తొలగించి మొబైల్ డస్ట్‌బిన్‌లో వేశారు. ప్రతి ఒక్కరూ సొంత ఊరికి కొంత మేరకైనా శ్రమదానం చేయాలని ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. అదేవిధంగా కలెక్టర్ టీ వినయ్‌కృష్ణారెడ్డి రఘునాథపల్లి మండలం వెల్ది గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి, గ్రామ కమిటీల సభ్యులతో ప్రగతి ప్రణాళిక పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సహా జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, ప్రత్యేక అధికారులు, ఇన్‌చార్జీల పర్యటనలతో గ్రామాల్లో ప్రగతి పండుగ వాతావరణంతో సందడి నెలకొన్నది. రఘునాథపల్లి గ్రామ, మండలస్థాయిల్లో నియమించిన ప్రత్యేక అధికారుల బృందాలు ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల రూపురేఖలు మార్చేందుకు వివిధ శాఖల వారీగా ప్రణాళికలు తయారు చేస్తున్నారు.

హరితహారంపై అవగాహన
హరితహారంపై స్థానికులకు అవగాహన కల్పిస్తున్నారు. వార్డులు, కాలనీల్లో పర్యటించిన ప్రజలకు అవసరమైన పనులకు గ్రామసభల ద్వారా ప్రతిపాదనలు తయారు చేసి నిధులు కేటాయించేలా ముందుకు సాగుతున్నారు. గ్రామానికి చెందిన ధనవంతులు, ఆర్థికంగా స్థితిమంతులు, ఇతర దేశాలు, రాష్ర్టాలు, ప్రాంతాల్లో స్థిరపడిన వారి సహకారంతో గ్రామాభివృద్ధికి తోడ్పాటునందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుస్ఫూర్తితో జిల్లాలో ఇప్పటికే పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. జనగామ నియోజకవర్గంలోని నర్మెట మండలానికి చెందిన టీఆర్‌ఎస్ నాయకుడు పెద్ది రాజిరెడ్డి తన స్వగ్రామం మచ్చుపహాడ్‌కు రూ. లక్ష విరాళం సహా సమీప తండాలకు రూ. 35 వేలు ప్రకటించి స్ఫూర్తిదాతగా నిలిచారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల్లో గ్రామాభివృద్ధికి ప్రత్యేక కోసం మూడో రోజు ఆదివారం గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధుల బృందాలు బుధవారం జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించాయి. గ్రామాలు పచ్చదనాన్ని సంతరించుకునేలా చూడడం, పారిశుధ్యాన్ని మెరుగుపర్చడం, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడడంతోపాటు స్థానిక సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు పడుతున్నాయి.

ఎక్కడికక్కడే పనుల గుర్తింపు
ఈ నెల 8 నుంచి 12 వరకు గ్రామగ్రామాన వీధులు, వార్డుల్లో గ్రామ ప్రత్యేక అధికారి నేతృత్వంలో గ్రామ కార్యదర్శి, జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్, ఎంపీటీసీలు, ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు, కో ఆప్షన్ సభ్యులు పర్యటించి రోడ్లు, వీధిలైట్లు, పాడుబడిన బావులు, శిథిలమైన ఇళ్లు, బోరు బావులు, మురికి కాల్వలను పరిశీలించి ఎక్కడికక్కడ ఎలాంటి పనులు అవసరమో గుర్తించి అభివృద్ధి ప్రణాళికలో ప్రతిపాదించి బడ్జెట్ కేటాయిస్తారు. గ్రామీణ ప్రజలకు మేలు చేసే లక్ష్యంగా పంచాయతీలను మరింత బలోపేతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను అమలుకు బాటలు పడుతుండడంతో ఇక సమస్యల్లేని ప్రగతి పల్లెలుగా రూపాంతరం చెందనున్నాయి. ఇక జిల్లా, మండల పరిషత్, పురపాలక సంఘాల్లో మాదిరిగా గ్రామ పంచాయతీల్లోనూ కొత్తగా ముగ్గురు కో ఆప్షన్ సభ్యులు, స్టాండింగ్ కమిటీలను ఎన్నుకునే ప్రక్రియ మొదలైంది.

గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరిసేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టేందుకు పవర్‌వీక్, హరితహారం కార్యక్రమాల నిర్వహణకు 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించి మండలాల వారీగా ఇప్పటికే ప్రత్యేక అధికారులను నియమించారు. గ్రామాల్లో పవర్‌వీక్ పేరిట ఏడురోజులపాటు పూర్తిగా విద్యుత్ సంబంధమైన సమస్యలు పరిష్కరించాల్సి ఉంటుంది. గ్రామాల్లో వీధిలైట్ల కోసం ఎంత కరెంట్ వాడుతున్నారో కచ్చితమైన నిర్ధారణకు రావడం, మీటర్లు పెట్టడం, వీధిలైట్ల థర్డ్‌లైన్‌ను ఏర్పాటు చేయడం, విధిగా ఎల్‌ఈడీ బల్బులను అమర్చడం, వంగిపోయి ప్రమాదకరంగా ఉన్న స్తంభాలు, వేలాడే కరెంటు తీగలను గుర్తించి సరిచేయడం, పొడవాటి కట్టెలు, ఇనుప స్తంభాలను తొలగించి సిమెంట్ స్తంభాలను నాటడం చేయాల్సి ఉంటుంది.

చెట్లుగా ఎదిగే వరకూ బాధ్యత..
ఇక హరితహారం కార్యక్రమంలో భాగంగా విలేజ్ నర్సరీని ఏర్పాటు చేయడం, గ్రామాల్లో వీధివీధిన విరివిగా మొక్కలు నాటి వాటికి నీళ్లు పోసి రక్షించడం, పెట్టిన మొక్కలన్నీ చెట్లుగా ఎదిగే వరకూ బాధ్యత తీసుకోవడం, ప్రతీ ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ చేసి యజమానులు, రైతులతో మాట్లాడి పెద్దఎత్తున చింత మొక్కలు సరఫరా చేయాల్సి ఉంటుంది. రోడ్లు, వీదీలైట్లు, పాడుబడిన బావులు, శిథిలమైన ఇళ్లు, బోరుబావులు, మురికి కాల్వలను పరిశీలించి ఎక్కడెక్కడ ఎలాంటి పనులు అవసరమో పరిశీలించి అభివృద్ధి ప్రణాళికలో ప్రతిపాదించి బడ్జెట్ కేటాయించాలి. ఇప్పటికే 30 రోజుల గ్రామాభివృద్ధి ప్రణాళిక కోసం ఇప్పటికే ప్రభుత్వం జిల్లాకు ఎస్‌ఎఫ్‌సీ కింద రూ. 3.22 కోట్లు, 14వ ఆర్థిక సంఘం ద్వారా రూ. 4.81 కోట్లు మొత్తం రూ. 8.04 కోట్లు విడుదల చేయగా, అధికారుల పర్యటనలో ప్రతిపాదించిన పనులకు గ్రామసభ ఆమోదంతో నిధులు ఖర్చు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. పల్లె పాలనను గాడిలో పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం మేరకు రూపొందించిన కొత్త చట్టం ప్రకారం ఇకపై పంచాయతీల్లో భిన్నమైన మార్పులు, చేర్పులతో గ్రామీణ పాలనపై పర్యవేక్షణ పెరగడంతోపాటు సమస్యల పరిష్కారానికి సులువైన మార్గం ఏర్పడి పల్లె పరిపాలన పరుగులు పెట్టనుంది.

66

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles