కుల వృత్తులకు పెద్దపీట


Wed,September 11, 2019 01:53 AM

పాలకుర్తి రూరల్‌ : రాష్ట్రంలో కులవృత్తులకు సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేశారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం మండలంలోని తొర్రూరు పెద్ద చెరువులో ప్రభుత్వం సబ్సిడీపై ఉచితంగా పంపిణీచేసిన చేప పిల్లలను ముదిరాజ్‌ సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి చెరువులో వదిలారు. ఆనంతరం దుర్గమ్మ గుడి వద్ద తెలంగాణకు హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. విస్నూరులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల గ్రామ ప్రణాళికలో భాగంగా రోడ్డుకు ఇరువైపుల ఉన్న పిచ్చి మొక్కలను ముళ్ల పొదలను తొలగించారు. ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. జిల్లాలో ఈ ఏడాది 627 చెరువుల్లో 2.89 కోట్ల చేప పిల్లల పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. ముదిరాజ్‌లు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికే సీఎం కేసీఆర్‌ కాంట్రాక్టర్లను తొలగించి నేరుగా చేప పిల్లలను అందించేలా చర్యలు చేపట్టారన్నారు. ముదిరాజ్‌ల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. కులవృత్తులకు పూర్వవైభవం తీసుకు రావడమే తెలంగాణ సర్కార్‌ లక్ష్యమన్నారు. సీఎం కేసీఆర్‌ నాయత్వంలోనే ముదిరాజుల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో దేశం గర్వించే స్థాయికి ఎదిగామన్నారు. మత్స్యకారులు చేపలు విక్రయించడానికి ఏసీ షెడ్ల నిర్మాణంతో పాటు ఆటోలు, ట్రాలీలు, డీసీఎంలు, ద్విచక్ర వాహనాలను సబ్సిడీపై అందజేస్తున్నట్లు చెప్పారు. వృత్తిలో భాగంగా మత్స్యకారులు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5లక్షల బీమా అందజేస్తున్నామన్నారు. గోదావరి జలాలతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 70 శాతం చేరువులు నిండాయన్నారు. మరో వారం రోజుల్లో మిగతా చెరువులను గోదావరి, ఎస్సారెస్పీ జలాలతో నింపుతామని హామీ ఇచ్చారు. పాలకుర్తి మండలంలోని చేరువులు గోదావరి జలాలతో నిండడంతో ఆనందం వ్యక్తం చేశారు. చెరువులు, కుంటలు నిండితేనే భూ గర్భ జలాలు పెరగడంతో పాటు మత్స్యకారులకు జీవనోపాధి కలుగుతోందన్నారు. మత్స్యకారులకు నాణ్యమైన చేపపిల్లలను పంపిణీ చేయాలని మత్స్యశాఖ జిల్లా అధికారి శ్రీపతికి సూచించారు. మత్స్యకార సహకార సొసైటీలు ఆర్థికంగా ఎదగాలన్నారు.


భవిష్యత్‌ తరాల కోసమే హరితహారం
భవిష్యత్‌ తరాల కోసమే సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని, ఇందులో అందరూ భాగస్వాములు కావాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. హరితహారంలో భాగంగా మండలంలోని తొర్రూరు దుర్గమ్మ గుడి వద్ద స్థానిక నాయకులతో కలిసి మంత్రి ఎర్రబెల్లి మొక్కలు నాటారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆకుపచ్చ తెలంగాణే ప్రభుత్వ ధ్యేయమన్నారు. గ్రామపంచాయతీల పరిధిలో నాటిన మొక్కలను కాపాడాల్సిన బాధ్యత సర్పంచ్‌లు, వార్డుసభ్యులు, పంచాయతీ కార్యదర్శులపై ఉందన్నారు. నూతన పంచాయతీ రాజ్‌ చట్టాన్ని పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

పరిసరాల పరిశుభ్రత పాటించాలి
గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణను యుద్ధ ప్రాతిపాదికన పూర్తిచేయాలని, లేదంటే సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తప్పవని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హెచ్చరించారు. మంగళవారం 30 రోజుల గ్రామ ప్రణాళికలో భాగంగా మండలంలోని విస్నూరులో గొడ్డలి పట్టి రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను, ముళ్ల పొదలను మంత్రి ఎర్రబెల్లి స్వయంగా తొలగించారు. ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ గ్రామంలోని ప్రతీ వ్యక్తినీ పారిశుధ్య నిర్వహణలో భాగస్వాములు చేయాలని సూచించారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, వైద్యఆరోగ్య శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ చేపట్టిన 30రోజుల గ్రామ ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలుచేయాలన్నారు. సర్పంచ్‌లు, కార్యదర్శులు పనిచేయకుంటే పదవి పోవడం ఖాయమని హెచ్చరించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, జెడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ పుస్కూరి శ్రీనివాసరావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్‌, పాలకుర్తి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ముస్కు రాంబాబు, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతి, భవాని, చిక్కుడు రాములు, మాచర్ల ఎల్లయ్య, జిల్లా మండల పరిషత్‌ కోఆప్షన్లు ఎండీ మదార్‌, ఎండీ సర్వర్‌ఖాన్‌, సర్పంచ్‌లు మల్లారెడ్డి, యాకయ్య, ఎంపీటీసీలు కౌసల్య, యాకయ్య, అశోక్‌, రాంబాబు, ఏలేంద్ర, చిన్న పెంటయ్య, యాకయ్య, నాగయ్య, సోమనాథం, యాకస్వామి, శ్రీనివాస్‌, ధనుంజయ, సింగారపు దీపక్‌ పాల్గొన్నారు.

43

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles