గులాబీ పార్టీలో.. సంస్థాగత సందడి

Wed,August 21, 2019 04:17 AM

జనగామ, నమస్తే తెలంగాణ, ఆగస్టు 20: టీఆర్‌ఎస్‌లో సంస్థాగత ఎన్నికల సందడి మొదలైంది. గ్రామ కమిటీలు, జనగామ పట్టణంలో వార్డు కమిటీలను నియమిస్తున్నారు. క్షేత్రస్థాయిలో గులాబీ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రధాన, అనుబంధ శాఖల ఎన్నికలు జోరుగా జరుగుతుండగా.. పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. గ్రామాలు, పట్టణ వార్డుల్లో ఎక్కడ చూసినా గులాబీ జెండాలు రెపరెపలాడుతుండగా, నాయకులు, కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో హాజరవుతున్నారు. గ్రామ కమిటీల ఎన్నికల తర్వాత మండల కమిటీ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోపక్క 30 వార్డులను కైవసం చేసుకుని ఏకపక్ష మెజార్టీతో జనగామ మున్సిపాలిటీపై మరోసారి గులాబీ జెండా ఎగురవేసేలా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. వార్డుస్థాయి నుంచి గులాబీ పార్టీకి పటిష్టమైన పునాదులు వేసి నియోజకవర్గంలోనే అధికశాతం ఓటర్లు ఉన్న పట్టణంపై మరింత పట్టుసాధించేలా పావులుకదుపుతున్నారు.

వార్ వన్‌సైడ్ కోసం..
జనగామలోని ప్రధాన వీధులు, జాతీయ రహదారికి ఇరువైపులా సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలవుతున్న 36 రకాల సంక్షేమ పథకాల స్లోగన్స్‌ను పెద్ద అక్షరాలతో ఆకర్షణీయంగా గోడలపై రాయించారు. అంతేకాకుండా మున్సిపల్‌లోని 30 వార్డుల్లో ప్రతిపక్ష పార్టీలకు స్థానం లేదన్న రీతిలో నాయకులకు గుబులుపుట్టేలా వాడవాడలా పార్టీ జెండా కట్టించి, కార్యకర్తలు, నాయకులకు పెద్ద ఎత్తున గులాబీ కండువాలు అందించి ఎటుచూసినా గులాబీ రెపరెపలతో మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్‌సైడ్ అన్న చర్చకు తెరలేపారు. ఇప్పటికే రూ. 30 కోట్ల టీయూఎఫ్‌ఐడీసీ పథకం నిధులతో పట్టణ సుందరీకరణ, అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టగా.. ఆర్టీసీ జంక్షన్ నుంచి నెహ్రూపార్కు రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

వార్డుల్లో క్లీన్‌స్వీప్ దిశగా..
పట్టుబట్టి జిల్లాకేంద్రం సాధించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఈసారి జరిగే మున్సిపల్ ఎన్నికల్లో పెరిగిన స్థానాలు సహా మొత్తం 30 వార్డుల్లో టీఆర్‌ఎస్ క్లీన్‌స్వీప్ చేయడం ద్వారా ఏకపక్ష స్థానాలతో గులాబీ జెండా రెపరెపలాడించాలనే స్కెచ్ వేశారు. అన్ని వార్డుల్లో టీఆర్‌ఎస్ బలం, బలహీనతను బేరీజు వేసుకొని వార్డులోని మెజార్టీ ప్రజలు, కమిటీల ఏకాభిప్రాయంతో ఆయా వార్డుల్లో టీఆర్‌ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న వార్డు కమిటీ అధ్యక్షులుగా ఎన్నికయ్యే నాయకులు కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ పడేందుకు వీలులేదని ముందుగానే ఖరాకండిగా తేల్చి చెప్పడంతోపాటు వార్డు కమిటీ అధ్యక్షులు, అనుబంధ కమిటీల కార్యవర్గాలన్నీ పార్టీ బీ-ఫారం ఇచ్చే అభ్యర్థి గెలుపునకు పని చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటివరకు వార్డు అధ్యక్షులుగా బాధ్యతల్లో ఉన్న నాయకులే కౌన్సిలర్ టికెట్‌కు పోటీ పడుతుండడంతో ఎమ్మెల్యే తీసుకున్న కీలక నిర్ణయంతో క్యాడర్‌లో రెట్టించిన ఉత్సాసం నెలకొన్నది. గ్రామపంచాయతీ, స్థానిక సంస్థలు, ప్రాదేశిక ఎన్నికల్లో సాధించిన విజయం స్ఫూర్తితో మున్సిపల్‌పై తిరుగులేని ఆధిక్యత సాధించాలనే పక్కా స్కెచ్‌తో టీఆర్‌ఎస్ ముందుకెళ్తున్నది.

ఐదు వార్డులకు పరిశీలకుడు..
కోర్టు నిర్ణయం తర్వాత ఏ క్షణంలోనైనా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలు ఉండడంతో అందుకనుగుణంగా గులాబీ పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నది. నెలన్నరపాటు సభ్యత్వాల ప్రక్రియను పూర్తి చేసి పార్టీలో చేరిన ప్రతీ సభ్యుడికి రూ. 2 లక్షల బీమా సౌకర్యం కల్పించడం, అందరి వివరాలు ఆన్‌లైన్‌లో కంప్యూటీకరించడం, క్రియాశీల కార్యకర్తలకు ఫొటో గుర్తింపు కార్డుల జారీ వంటి నిర్ణయాలతో మునుపెన్నడూ లేనివిధంగా పట్టణంలో టీఆర్‌ఎస్‌లోకి భారీ ఎత్తున చేరి సభ్యుత్వాలు తీసుకున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో పట్టణేతరులైన వివిధ మండలాలకు చెందిన టీఆర్‌ఎస్ నాయకులను ఒక్కో వార్డుకు ఒక ఎన్నికల ఇన్‌చార్జిగా 30 మందిని నియమించి వారి నాయకత్వంలో వార్డు కమిటీలు, అనుబంధ కమిటీల కార్యవర్గాలకు ఎన్నికలు జరిగేలా కార్యాచరణ ప్రటించారు. అంతేకాకుండా ప్రతీ ఐదు వార్డులకు కలిపి ఒక పరిశీలకుడిని నియమించారు. ఇన్‌చార్జీలుగా నియమితులైన నాయకులంతా గ్రామీణ మండలాల్లో నాయకులైనప్పటికీ, పట్టణంలో సొంత ఇళ్లు, బంధు, మిత్రుల గణం అధికంగా ఉన్న వారిని ఏరికోరి ఎంపిక చేయడం సహా వార్డు కమిటీ ఎన్నికల ఇన్‌చార్జీలే రానున్న మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తారని సంకేతాలు ఇచ్చిన ముత్తిరెడ్డి.. పట్టణంపై పట్టుబిగించేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు.

56
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles