ఆడబిడ్డలకు సర్కార్ సారె..

Tue,August 20, 2019 03:23 AM

-జిల్లాకు చేరిన బతుకమ్మ చీరలు
-అవసరమైనవి 1,96,660
-ఇప్పటికే చేరినవి 45,120
-వారం రోజుల్లో రానున్న మిగిలిన చీరలు
-జనగామ, పాలకుర్తిలోని గోదాముల్లో భద్రపరిచిన జిల్లా యంత్రాంగం

జనగామ, నమస్తే తెలంగాణ, ఆగస్టు 19: తెలంగాణ ఆడబిడ్డలకు అతిప్రధానమైన బతుకమ్మ పండుగకు సర్కార్ సారె పంపిణీకి రంగం సిద్ధమవుతున్నది. సబ్బండ వర్ణాల అభ్యున్నతికి కృషి చేస్తున్న తెలంగాణ సర్కార్.. సర్వమతాలను గౌరవిస్తూ అన్ని వర్గాల మహిళలకు సముచిత స్థానం కల్పిస్తున్నది. రంజాన్, క్రిస్మస్ పండుగల సందర్భంగా నిరుపేద కుటుంబాలకు చెందిన ముస్లింలు, క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేస్తున్నారు. అలాగే, బతుకమ్మ పండుగకు తెల్లరేషన్‌కార్డు ఉన్న కుటుంబాల్లోని 18 ఏళ్లు పైబడిన మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాల ఫిర్యాదుతో గత ఏడాది ఆలస్యంగా బతుకమ్మ చీరల పంపిణీ జరిగింది. దీంతో సారి ముందస్తుగానే చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం 10 నెలల నుంచే సిరిసిల్ల వంటి ప్రాంతాల్లో చేనేత కార్మికులతో చీరలు తయారు చేయించింది. దాదాపు జిల్లాకు సరిపడా చీరలు మంజూరయ్యాయి.

జిల్లాకు చెందిన తెల్లరేషన్‌కార్డు కలిగి ఉన్న మహిళలకు మొత్తం 1,81,660 చీరలు సహా 10 శాతం అదనంగా మరో 19,666 చీరలతో కలిపి మొత్తం 2,16,326 లక్షల చీరలు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపించారు. జనగామ రెవెన్యూ డివిజన్ పరిధిలోని జనగామ అర్బన్, జనగామ రూరల్, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల, రఘునాథపల్లి, లింగాలఘనపురం మండలాలకు చెందిన 97,856 మందికి, స్టేషన్‌ఘన్‌పూర్ డివిజన్‌లోని ఘన్‌పూర్(స్టే), పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల, చిలుపూర్, జఫర్‌ఘడ్ మండలాలకు 98,804 మందికి ఈసారి చీరలు పంపిణీ చేయనున్నారు.

భద్రంగా బతుకమ్మ చీరలు
ఇందులో ఇప్పటికే 45,120 చీరలు జిల్లాకు చేరగా, జనగామ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 7 మండలాల నిల్వలను జనగామలోని వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాంలో, స్టేషన్‌ఘన్‌పూర్ డివిజన్ పరిధిలోని 5 మండలాల చీరల స్టాక్‌ను పాలకుర్తి మండలకేంద్రంలోని నాబార్డు గోదాంలో చేనేత, జౌళిశాఖ అధికారులు భద్రపరిచారు. 2017 సంవత్సరంలో 2,00,454 మంది మహిళలకు చీరలు పంపిణీ చేయగా, 2018లో బతుకమ్మ పండుగ నాటికి అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం, పాత పథకాలను కొనసాగించుకోవచ్చని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా ప్రతిపక్షాలు అడ్డంకులు చెప్పడంతో డిసెంబర్‌లో చీరల పంపిణీ జరిగింది. గత ఏడాది డిసెంబర్‌లో జిల్లాలో 1.68 లక్షల కుటుంబాలకు తెల్లరేషన్ కార్డుదారులు ఉండగా, 355 రేషన్ దుకాణాల ద్వారా 1.81 లక్షల చీరలు పంపిణీ చేశారు. జిల్లా అవసరానికి సరిపడా 1,96,660 లక్షల చీరలకు సోమవారం నాటికి 45,120 చీరలు జనగామ, పాలకుర్తి గోదాంలకు చేరాయి.

ఇంకా 70 వేల చీరల స్టాక్ మంగళవారం నాటికి చేరుకోనుండగా, వారం, పది రోజుల్లో మిగిలిన చీరలు అందున్నాయి. గోదాంల్లో భద్రపరిచిన చీరలను తొలుత మండలాల వారీగా రెవెన్యూ, పౌరసరఫరాల శాఖలకు అప్పగించి ఆ తర్వాత అక్కడి నుంచి గ్రామాల వారీగా రేషన్ దుకాణం డీలర్లకు అందించి పకడ్బందీగా పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

57
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles