గీత దాటితే మోతే..!

Wed,August 14, 2019 01:22 AM

జనగామ టౌన్, ఆగస్టు 13: రవాణా శాఖలో నూతన సంస్కరణలు రానున్నాయి. ఇక నుంచి వాహనదారులు నిబంధనలను అతిక్రమిస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదు. ప్రతీ వాహనదారుడు రోడ్డు భద్రతా నిబంధనలు కచ్చితంగా పాటించేలా కేంద్ర ప్రభుత్వం 2019 నూతన రోడ్డు రవాణా చట్టాన్ని అమల్లోకి తెస్తున్నది. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాతోపాటు జైలుశిక్ష విధించనుంది. కొన్ని సౌలభ్యాలను సైతం కల్పించింది. వాహనాలు కొనుగోలు చేసినచోటే రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తూ కొత్తచట్టంలో మార్పులు తీసుకొచ్చింది. రవాణేతర వాహనాలను డీలర్లే రిజిస్ట్రేషన్ చేసి హైసెక్యూరిటీ ప్లేట్లు అమర్చనున్నారు. మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు షోరూంకు వెళ్లి వాహనాన్ని పరిశీలిస్తారు. ఫ్యాన్సీ నంబర్ కావాలంటే రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ నూతన చట్టం సెప్టెంబర్ నుంచి అమల్లోకి రానుండగా.. వాహనదారుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.

కొత్త చట్టంలోని విధానాలు..
లక్కీ, ఫ్యాన్సీ నంబర్లు కావాలంటే మాత్రం ఎలాంటి వాహనదారుడైనా రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సిందే. రిజిస్ట్రేషన్ అథారిటీ ప్రకారం ట్రాన్స్‌పోర్టు వాహనాలైన లారీలు, బస్సులు, పదిసీట్లకు మించిన మినీబస్సులు, ఆటోలు, క్యాబ్‌లు, నాన్‌ట్రాన్స్‌పోర్టు వాహనాలైన రోడ్డు రోలర్స్, రిమౌంటెడ్ వెహికిల్స్, నిర్మాణ సంబంధమైన వాహనాలు కార్యాలయాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించాలని కేంద్రం కొత్తచట్టంలో పేర్కొంది. మరోవైపు ఈ చట్టం ప్రకారం జరిమానాలు రెట్టింపు చేసింది. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలకనుగుణంగా ఈ నిబంధనలు మరింత కఠినతరం చేస్తూ నూతన విధానాన్ని వచ్చే నెలలో అమల్లోకి తేనుంది.

మైనర్లకు రూ. 25 వేల జరిమానా
ఇకపై మైనర్లు వాహనాలు నడిపితే రూ. 25 వేలు జరిమానా. సంరక్షకులకు, వాహన యజమానులకు మూడేళ్ల జైలుశిక్ష. వాహన రిజిస్ట్రేషన్ రద్దు చేయనున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ. 5 వేలు, అతివేగంగా వాహనం నడిపితే రూ. 2 వేలు, ప్రమాదకరంగా నడిపితే రూ. 5 వేలు, మద్యం తాగి నడిపితే రూ. 10 వేలు, హెల్మెట్ లేకుండా నడిపితే రూ. 1000 జరిమానాతోపాటు 3 నెలలపాటు డ్రైవింగ్ లైసెన్సు రద్దు. అదేవిధంగా ద్విచక్ర వాహనం వెనుక ఉన్న వారికి హెల్మెట్ లేకున్నా రూ. 1000, ఇన్సూరెన్స్ లేని వాహనాలకు రూ. 2 వేలు, అత్యవసర సర్వీస్‌లైన అగ్నిమాపక శాఖ, పోలీస్, అంబులెన్స్ వాహనాలకు దారి ఇవ్వకుంటే రూ. 10 వేలు, డ్రైవింగ్‌కు అనర్హులమని తెలిసి వాహనం నడిపితే రూ. 10 వేలు, రవాణా శాఖ ఆదేశాలు ఉల్లంఘిస్తే రూ. 2 వేలు, సీటుబెల్టు ధరించకుంటే రూ. 1000, ఓవర్‌లోడ్ చేస్తే రూ. 20 వేలతోపాటు అదనంగా ప్రతీ టన్నుకు రూ. 2 వేలు, రేసింగ్‌లకు పాల్పడితే రూ. 5 వేలు, బ్యాడ్జి లైసెన్సు లేకుండా క్యాబ్ సర్వీసులు నడిపితే రూ. లక్ష వరకు జరిమానా విధించనున్నారు.

ఏజెంట్ల మోసాలకు చెక్..
చట్టసవరణలో భాగంగా రవాణేతర వాహనాల రిజిస్ట్రేషన్లపై పలు మార్పులు తీసుకొచ్చారు. వాహనాల రిజిస్ట్రేషన్లు షోరూంల్లోనే నిర్వహించనున్నారు. డీలర్లకు పూర్తి అధికారాలను అప్పగించకుండా మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లను సైతం బాధ్యులను చేశారు. రవాణా శాఖ కార్యాలయాల వద్ద ఏజెంట్ల మోసాలు, అవినీతిని తగ్గించేందుకు, వినియోగదారులు కొత్తగా వాహనాలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను డీలర్లకు అప్పగించాలని ఇప్పటికే రాష్ట్రాల రవాణా శాఖ మంత్రుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ నుంచి వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లను డీలర్ల వద్దే ముగించి నంబర్ ప్లేట్ జారీ చేయాలని, అంతకుముందు ఎంవీఐలు ధ్రువీకరణ చేయాలని ఆదేశాలను జారీ చేసింది. కొత్త వాహనాల హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్‌ను డీలర్లే అమర్చాలని కొత్తచట్టంలో పేర్కొంది. నిబంధనలను అతిక్రమిస్తే జరిమానాలు విధించనున్నట్లు చట్టంలో హెచ్చరించింది. హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్‌లు లేకుండా వాహనాలు బయటకు వస్తే వాహన జీవితకాల పన్నును 200 శాతం, త్రైమాసిక పన్నును లెక్కించి ఏది ఎక్కువగా ఉంటే ఆ మొత్తాన్ని జరిమానా, నెలరోజులపాటు రిజిస్ట్రేషన్లు చేయకుండా నిషేధం విధించనున్నారు. ఈ తరహా తప్పు రెండోసారి చేస్తే డీలర్ల లైసెన్సును మూడు నెలలపాటు సస్పెన్షన్‌తోపాటు రూ. 5 లక్షల జరిమానా విధిస్తారు. తప్పు అలాగే కొనసాగితే రిజిస్ట్రేషన్ లైసెన్స్ రద్దు చేసి డీలర్లపై కేసులు నమోదు చేసేలా చట్టాన్ని రూపొందించారు. ఇక రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కన్నా ఎక్కువ వసూలు చేస్తే రూ. 2 లక్షల జరిమానాతోపాటు 2 నెలల డీలర్‌షిప్ రద్దు చేయనున్నారు. రెండోసారి రూ. ఐదు లక్షల జరిమానా, మూడు నెలల డీలర్‌షిప్ రద్దు చేస్తారు. ఆ తర్వాత ఫిర్యాదు వస్తే విచారించి, రిజిస్ట్రేషన్ అవకాశాలను పూర్తిగా రద్దు చేయనున్నారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles