రక్ష.. బంధన్

Wed,August 14, 2019 01:21 AM

జనగామ టౌన్ : సోదర బంధానికి ప్రతీక.. అనురాగం, ఆప్యాయతలకు చిరునామా.. అన్నాచెల్లెళ్ల ప్రేమానురాగానికి చిహ్నం.. అక్కాతమ్ముళ్ల అనురాగ ఆత్మీయ కవచం.. నేనున్నానంటూ భరోసా ఇచ్చే రక్షా కంకణం.. అదే రాఖీ. ఈపండుగను గురువారం శ్రావణ పౌర్ణమి నాడు జిల్లా వ్యాప్తంగా ఆనందోత్సాహాలతో జరుపుకోనున్నారు. స్థితికారుడైన విష్ణుమూర్తి జన్మనక్షత్రం శ్రవణం. ఈ నక్షత్రం పూర్ణిమ నాటి చంద్రుడితో కూడిన మాసం కనుక శ్రావణమని శాస్త్రవచనం. ఈ పవిత్ర నక్షత్రంలో పౌర్ణమిరోజు జరుపుకునే పండుగే రాఖీపండుగ. ఈపండుగను శ్రావణపూర్ణిమ, రక్షకా పూర్ణిమ, జంధ్యాల పున్నమి అనే పేర్లతో పిలుస్తారు. శ్రావణపూర్ణిమ నాడులక్ష్మీనారాయణుల ఆరాధన విశేష ఫలితాలు ఇస్తుంది. అమ్మలోని అ నాన్న లోని న్న కలిస్తే అన్న. అమ్మ కురిపించే ఆప్యాయత, నాన్న కల్పించే భద్రత రెండింటినీ అన్నయ్యలు తమ చెల్లెళ్లకు కల్పిస్తారని నమ్మకం. ఆత్మీయ బంధాలకు ప్రతిబింబంగా జరుపుకునే ఈ వేడుక వచ్చిందంటే ఎనలేని సంబురం.

దుకాణాల వద్ద సందడి..
రాఖీల క్రయవిక్రయాలతో జిల్లా ఆనందాల హరివిల్లయింది. రాఖీ దుకాణాలు, స్వీట్ షాపులు కొనుగోలు దారులతో సందడి వాతావరణం నెలకొంది. రెండు రూపాలయాల నుంచి రూ.వెయ్యి విలువగల రాఖీలు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. రంగు నూలుదారం నుంచి వెండి, బంగారు పూత రాఖీలు మార్కెట్లో వచ్చాయి. అంతేకాకుండా టెక్నాలజీకి అనుగుణంగా ఫొటో విత్ రాఖీలు కూడా మార్కెట్‌లోకి రావడంతో ఈసంవత్సరం మహిళలు ఈ రాఖీలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. జిల్లా కేంద్రంలో వాడవాడలా రాఖీ దుకాణాలు వెలిశాయి. దీంతో పట్టణమంతా రాఖీలతో సందడిగా మారిపోయింది.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles