కోట్ల ఆస్తులపై సీపీఎం సమాధానం చెప్పాలి

Wed,August 14, 2019 01:20 AM

జనగామ, నమస్తే తెలంగాణ, ఆగస్టు 13 : సైద్ధాంతిక పరమైన విధానాలతో పేద ప్రజలకు సేవ చేస్తున్నామని చెబుతూ కోట్ల విలువైన భూములు, ప్లాట్లు కూడబెట్టిన పార్టీ నాయకులకు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు సమాధానం చెప్పాలని టీఆర్‌ఎస్ పట్టణ నాయకులు సవాల్ చేశారు. మంగళవారం జనగామలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ కమిటీ అధ్యక్షుడు బండ యాదగిరిరెడ్డి, రెండో వార్డు మాజీ కౌన్సిలర్ గజ్జెల నర్సిరెడ్డి, పార్టీ నాయకులు మామిడాల రాజు, ఉడుగుల కిష్టయ్య, ఉల్లెంగుల దిలీప్ పాల్గొన్నారు. ఈసందర్భంగా మాజీ కౌన్సిలర్ నర్సిరెడ్డి మాట్లాడుతూ బతుకమ్మకుంటలో గజం స్థలం అన్యాక్రాంతం కాలేదని సీపీఎం పార్టీలో సీనియర్ నాయకుడైన ఎండీ దస్తగిరి గతంలో స్వయంగా పత్రికలు, మీడియాకు ప్రకటిస్తే అక్రమణలు జరిగాయని ఆ పార్టీలోని కొందరు ప్రజలను తప్పుదోవ పట్టేంచే ప్రయత్నం చేస్తున్నారని, బతుకమ్మకుంటను జనగామకు తలమానికంగా తీర్చిదిద్దినందుకే ప్రజలు సీపీఎంను తిరస్కరించి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని రెండోసారి బ్రహ్మాండమైన మెజార్టీతో ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించడం నిదర్శనంగా పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపైన, ఎమ్మెల్యేపై, కౌన్సిలర్లపై తప్పుడు చౌకబారు ఆరోపణలు చేస్తున్న సీపీఎం నాయకుడిగా చెలామణి అవుతున్న బూడిద గోపికి స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నష్కల్ సమీపంలోని సర్వేనంబర్ 96లో తన పేరిట జీపీఏ చేసుకున్న రూ.2కోట్ల విలువైన రెండు ఎకరాల భూమి, హైదరాబాద్ బైపాస్ రోడ్డులోని సర్వేనంబర్ 304లో 400 చదరపు గజాల స్థలం రిజిస్ట్రేషన్ చేసుకొని అందులోంచి 170గజాలు అమ్ముకొని మిగిలిన 230 గజాలు స్వంతంగా ఉందని ఈ ఆస్తులు ఎలా వచ్చాయో? సీపీఎం నేత గోపి ఏం వ్యాపారం చేసి అంత ఆస్తి సంపాదించారో రాష్ట్రపార్టీ విచారణ చేసి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా కొత్త కలెక్టరేట్ కోసం సీపీఎం ముఖ్యనేతలతో మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంప్రదింపులు జరిపిన తర్వాతనే ఏసిరెడ్డినగర్ స్థలాలను ఖాళీచేశారని, దీనికి స్థానిక కౌన్సిలర్‌గా తనను బద్‌నాం చేయడం ఆ పార్టీ నాయకులకు ఎంత వరకు సమంజసమని నర్సిరెడ్డి ప్రశ్నించారు. నిర్వాసితులకు బాణాపురం వద్ద నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల పేర్లలో సీపీఎం నేత గోపి సంబంధీకులైన ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి పేర్లు ఉన్నాయని, అంటే సీపీఎం నేత ఒక్క కుటుంబంలో ఏడుగురు నిరుపేదలు ఉన్నారా? పేదలు ఎవరూ లేరా? అని ప్రశ్నించారు. ఏసిరెడ్డినగర్‌లో తాను కౌన్సిలర్‌గా బోరుబావి తవ్వించి మోటరుతో కాలనీకి నీళ్లు సరఫరా చేయడంతోపాటు రూ.5.40 కరెంటు బిల్లు వస్తే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సహకారంతో పేదలపై భారం పడకుండా మున్సిపల్ నిధులతో చెల్లించామని, ఇందుకోసం తన ఇంటికి సీపీఎం నేతలు వచ్చిన లెటర్ ప్యాడ్ తీసుకెళ్లారని గుర్తుచేశారు. నెహ్రూపార్కు వద్ద ఆంధ్రాబ్యాంకు పక్కన రవూఫ్ అనే పాన్‌డబ్బా వ్యాపారికి చెందిన రూ.73 నుంచి రూ.80లక్షల విలువైన వాణిజ్య స్థలాన్ని సదరు సీపీఎం నాయకులు సెటిల్‌మెంట్ చేసి రూ.50లక్షలకు అమ్మించి రూ.23లక్షలు పంచుకున్నారని, అదేవిధంగా కరెంటు మీటర్ల పేరితో బూడిద గోపి ఏసిరెడ్డినగర్ వాసులు ఒక్కొక్కరి నుంచి రూ.2వేలు వసూలు చేశారని ఆరోపించారు.

పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులు నాసిరకంగా ఉన్నాయని ఆరోపిస్తున్న ఆ పార్టీ నాయకులకు పనులు ఆన్‌లైన్ ఈ-టెండర్ ద్వారా తీసుకున్న కాంట్రాక్టర్లు చేస్తున్నారనే విషయం తెలుసుకోవాలని అన్నారు. ఆ పనుల్లో టీఆర్‌ఎస్ నాయకులు ఎవరూ బినామీలుగా లేరని, వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. ఇప్పటికైనా సీపీఎం నాయకులు భూదందాలు, సెటిల్‌మెంట్లు చేయడం మానుకోవాలని, జిల్లా, పట్టణ వ్యాపారులు, ప్రజలు ఆపార్టీకి ఒక్క రూపాయి చందా ఇవ్వదని కోరారు. ప్రజలు, వ్యాపారులకు ఏమైన సమస్యలుంటే ఎన్నుకున్న ప్రజలకు సేవ చేసేందుకు నిత్యం అందుబాటులో ఉంటున్న స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వద్దకు వస్తే పరిష్కరిస్తారని చెప్పారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles