చైల్డ్‌లైన్‌కు బాలుడి అప్పగింత

Wed,August 14, 2019 01:19 AM

వరంగల్ చౌరస్తా/జనగామ రూరల్ ఆగస్టు13: వరంగల్ బస్టాండ్ ఆవరణలో ఓ మహిళ బాలుడిని అమ్మకానికి ఉంచినట్లు వదంతులు రావడంతో ఇంతేజార్‌గంజ్ పోలీసులు అప్రమత్తమై ఆ మహిళతో పాటు ఏడునెలల బాలుడిని అదుపులోకి తీసుకొని విచారించి, వరంగల్ రైల్వేసేషన్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన చైల్డ్ హెల్ప్ సెంటర్ అధికారులకు అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా పెంబర్తి గ్రామానికి చెందిన పిన్నింటి సుజాత కుటుంబ కలహాల కారణంగా భర్త లింగంతో గొడవపడి ఇంట్లో నుంచి ఎవరికి తెలియకుండా ఏడునెలల తన కుమారుడిని వెంటబెట్టుకొని వరంగల్‌కెళ్లింది. తన కుమారుడి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వైద్య పరీక్షలు చేయించడానికి వరంగల్ ఎంజీఎంకు తీసుకొచ్చి వైద్య పరీక్షల అనంతరం వరంగల్ బస్టాండ్‌కు చేరుకుంది. బస్సు కోసం ఎదురుచూస్తున్న సమయంలో బాబును పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బస్టాండ్ ఆవరణలోని పలువురుకి బాబును అమ్మడానికి ప్రయత్నిస్తున్నట్లు అనుమానం కలిగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వరంగల్ బస్టాండ్‌లోవున్న మహిళ మద్యం మత్తులో ఉందని గుర్తించి ఆమె నుంచి వివరాలు సేకరించారు. వివరాల ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారం చేరవేసి వరంగల్ రైల్వే స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన చైల్డ్ హెల్ప్ సెంటర్ అధికారులకు అప్పగించినట్లు ఇంతెజార్‌గంజ్ సీఐ శ్రీధర్ తెలిపారు. కుటుంబసభ్యులు వచ్చేంత వరకు స్వదార్‌గృహానికి తరలించినట్లు శిశు సంరక్షణ శాఖ సిబ్బంది తెలిపారు. తనతో పాటు కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం తల్లిని, బాబును కుటుంబసభ్యులకు అప్పగించనున్నట్లు శిశు సంరక్షణ అధికారులు తెలిపారు.

26
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles