మరింత పకడ్బందీగా

Mon,August 12, 2019 04:08 AM

-మధ్యాహ్న భోజన పథకానికి ఈ-పాస్
-బియ్యం సరఫరాలో పారదర్శకతకు కొత్త విధానం
-జిల్లావ్యాప్తంగా 508 పాఠశాలలు, 91 సంక్షేమ హాస్టళ్లు
-47,468 మంది విద్యార్థులకు లబ్ధి
-ప్రతీ నెల 198.32 టన్నుల బియ్యం పంపిణీ
-ప్రత్యేక సంచుల్లో సన్నబియ్యం సరఫరా
-లావాదేవీలన్నీ ఆధార్‌తో అనుసంధానం

జనగామ, నమస్తే తెలంగాణ, ఆగస్టు 11: ఇక నుంచి ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలకు మరింత పకడ్బందీగా బియ్యం సరఫరా చేయనున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కొత్తవిధానాన్ని పారదర్శకంగా అమల్లోకి తేనున్నారు. ఇప్పటికే రైతులకు ఎరువులు, రేషన్‌కార్డుదారులకు బియ్యం, కిరోసిన్, చక్కెర పంపిణీలో అమలు చేస్తున్న ఈ-పాస్ విధానం సత్ఫలితాలు ఇస్తున్న విషయం తెలిసిందే. జిల్లాలోని ప్రతీ పాఠశాల, హాస్టల్, అంగన్‌వాడీ కేంద్రాలకు ఆగస్టు 1న అమల్లోకి వచ్చిన ఈ-పాస్ నూతన విధానం ద్వారా గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకూ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, అంగన్‌వాడీల్లో అందుబాటులో ఉన్న బియ్యం నిల్వలు, పంపిణీ చేసినవి, వినియోగం, అవసరం, మిగులు వంటి అన్ని రకాల సమగ్ర వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు.

అంతేకాకుండా సన్న బియ్యం కోటా కేటాయింపులో ఈ-పాస్ యంత్రం వినియోగంతో నిల్వల కొరత సమస్య పరిష్కారం కావడంతోపాటు సమయం ఆదా, సత్వర సేవలు, పథకం పారదర్శకంగా అమలుకు అవకాశం ఉంది. ఇప్పటి వరకు విద్యార్థుల సంఖ్యకనుగుణంగా జిల్లా విద్యాశాఖాధికారి ఆమోదంతో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులకు అవసరమైన సన్నబియ్యం కోటా వివరాలను నివేదిస్తే.. దానికనుగుణంగా మండల స్థాయిలో తహసీల్దార్లు, ఆర్వోలు మంజూరు చేసేవారు. వాటి ద్వారా ఎంఎల్‌ఎస్ పాయింట్(గోదాం) నుంచి బియ్యం సరఫరా చేసే వారు. సంబంధిత పత్రాలకు ఇండెంట్ పంపించే క్రమంలో సంబంధిత పాఠశాలల హెడ్మాస్టర్లు, బాధ్యులు విధులు పక్కకుబెట్టి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. దీనికి చెక్ పెట్టేందుకు కాగిత రహిత పాలనలో భాగంగానే సరికొత్త విధానం అమలులోకి తెచ్చారు. ఇంటర్నెట్, మొబైల్ యాప్ నుంచి పాఠశాలల వివరాలు నివేదించేందుకు అవకాశం కల్పించారు. మధ్యాహ్న భోజన నిర్వహణ అధికారి, హెచ్‌ఎం ఫైల్ పట్టుకొని బియ్యం కోటా కోసం ఇకపై డీసీఎస్‌వో, తహసీల్దార్, ఎంఈవో, డీఈవో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సరికొత్త విధానం ద్వారా ప్రతి నెలా విద్యార్థుల హాజరుకనుగుణంగా బియ్యం కోటా కేటాయిస్తారు.

ఇంటర్నెట్‌లో సమస్త సమాచారం
గతంలో మిగులు బియ్యం ఉంటే దానికి అనుగుణంగా బియ్యం విడుదల చేసేవారు. ఇకనుంచి కోటా కేటాయింపు, మిగులు, విద్యార్థుల సంఖ్య వంటి సమస్త వివరాలు ఎప్పటికప్పుడు ఇంటర్నెట్‌లో అధికారులకు సమాచారం అందుతుంది. ఈ-పాస్ నుంచి బియ్యం పంపిణీ అవుతుండడంతో ఎవరు, ఎప్పుడు బియ్యం కోటాను పొందారనేది ఆన్‌లైన్‌లో కంప్యూటీకరణ జరిగి తూకంలో మోసాలు, అక్రమాలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా సన్నబియ్యం అర్హులకు మాత్రమే అందుతాయి. జిల్లాలోని 12 మండలాల్లో మొత్తం 508 పాఠశాలల్లో 32,153 మంది విద్యార్థులు చదువుతుండగా, వీటిలో 341 ప్రాథమిక పాఠశాలల్లో 12,285 మంది, 64 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 3,867 మంది, 103 జిల్లా పరిషత్ పాఠశాలల్లో 16,001 మంది విద్యార్థులకు 90.92 టన్నుల బియ్యం అవసరం. అలాగే, 91 సంక్షేమ హాస్టళ్లలో వసతి పొందుతున్న 15,315 మంది విద్యార్థులకు ప్రతినెలా 107.40 టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు.

పక్కా లెక్కలతో భోజనం
ప్రత్యేక సంచుల్లో సన్న బియాన్ని సరఫరా చేస్తున్న రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ ప్రతీ బియ్యపు గింజను లెక్క ప్రకారం చేర్చడం, వాటిని సమక్రమంగా అమలు చేయడం ద్వారా పక్కా లెక్కలతో మధ్యాహ్న భోజన పథకాన్ని పూర్తి పారదర్శకంగా అమలుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే కాగిత రహిత సేవలు అందించేందుకు ప్రభుత్వం 2015 జనవరి నుంచి పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి వసతి గృహాల విద్యార్థులు, అంగన్‌వాడీ కేంద్రాలకు బయోమెట్రిక్ విధానంతో సన్నరకం బియ్యం అందజేస్తుంది. గతంలో ఎంఎల్‌ఎస్ కేంద్రాల నుంచి స్కూళ్లు, హాస్టళ్లకు అందజేయాల్సిన సన్నబియ్యం సైతం చౌకధరల దుకాణదారులకు పంపించి అక్కడి నుంచి అందరికీ ఒకేరీతిలో బియ్యం సంచులు అందజేసే వారు. సన్న బియ్యం పంపిణీపై గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి.

కొన్నిచోట్ల పాఠశాలలకు దొడ్డురకం బియ్యం వస్తున్నాయని, సన్నబియ్యం అందడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సన్నబియ్యం పంపిణీ, వినియోగాన్ని పక్కాగా చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం క్షేత్రస్థాయిలో వాస్తవాలను సేకరించింది. గతంలో తెల్లరేషన్‌కార్డుదారులకు అందే బియ్యంతోపాటు పాఠశాలలు, వసతి గృహాలకు అందజేసే బియ్యం ఒకేరకమైన 50 కిలోల సంచుల్లో అందజేసేవారు. రెండు రకాల బియ్యం ఒకే రకమైన గోనె సంచుల్లో ఉండడం వల్ల అందులో దొడ్డురకం, సన్నరకం బియ్యం తేడా తేలియకపోవడం వల్ల సన్నబియ్యానికి బదులు దొడ్డుబియ్యం, దొడ్డుబియ్యం స్థానంలో సన్నబియ్యం సరఫరా అయినట్లు విచారణలో తేలింది. దీన్ని అవకాశంగా చేసుకొని కొందరు కావాలనే అక్రమాలు, అవకతవకలకు పాల్పడిన వైనం కూడా వెలుగుచూసింది. దీన్ని సీరియస్‌గా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు బియ్యం సరఫరా చేసే సంచులపై సన్నరకం బియ్యం అని ముద్రించి 50 కిలోల ప్రత్యేక సంచుల్లో సరఫరా చేస్తున్నారు. దీనివల్ల మధ్యాహ్న భోజనం పథకంలో ఎలాంటి అక్రమాలు, అవకతవకలకు తావుండదు.

పారదర్శకంగా మిడ్డేమీల్స్..
పేద, మధ్య తరగతి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో అందజేస్తున్న మధ్యాహ్న భోజనంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర పౌరసరఫరాల, విద్యాశాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఒకపక్క బియ్యం సరఫరాకు తెల్లసంచులను ఉపయోగిస్తూ విద్యార్థులు, వంట ఏజెన్సీల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. మధ్యాహ్న భోజన వివరాలు ఏరోజుకారోజు విద్యాశాఖకు చేరే విధానం అందుబాటులోకి వచ్చింది. ఆన్‌లైన్, ఈ-పాస్ బయోమెట్రిక్ విధానంతో ప్రతీరోజు విద్యార్థుల సంఖ్య, ఖర్చు చేసిన బియ్యం, మిగులు బియ్యం లెక్కలను పక్కాగా ఉండేలా చూస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలోని చాలా పాఠశాలల్లో తక్కువ మంది విద్యార్థులు భోజనం చేస్తున్నా.. రికార్డుల్లో చూపుతున్న హాజరు శాతం ఆధారంగానే బియ్యం లెక్కలు నమోదు చేస్తుండేవారు. దీంతోపాటు భోజనం చేసిన విద్యార్థుల వివరాలు నెలకోసారి ఆయా మండలాల ఎమ్మార్సీ కార్యాలయంలో నమోదు చేయడం వల్ల కొన్ని ఏజెన్సీలు, కొందరు హెడ్మాస్టర్లు మధ్యాహ్న భోజనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉండేవి.

నాణ్యతపై కమిటీల పర్యవేక్షణ..
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని మోనూ ప్రకారం అందేలా ఇక పర్యవేక్షణ కమిటీలు వేయనున్నారు. ప్రతీవారం భోజనం పరీక్షించేందుకు ప్రత్యేకంగా గ్రామస్థాయిలో సర్పంచ్, ఎస్‌ఎంసీ చైర్మన్, విద్యావేత్తలతో కలిపి కమిటీలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా తహసీల్దార్లు, ఎంపీడీవో, ఎంఈవోలతో త్రీమెన్ కమిటీలు మధ్యాహ్న భోజనం నాణ్యత, మోనూ పరిశీలించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మధ్యాహ్న భోజనం విషయంలో వంట ఏజెన్సీల నిర్వాహకులు స్థానికులు కావడం, గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధులు, నాయకుల అండదండలు ఉండడంతో ఎస్‌ఎంసీ చైర్మన్లు గట్టిగా అడిగే పరిస్థితి లేదు. అధికారులు సందర్శనకు వస్తున్నారనే ముందస్తు సమాచారంతో ఆ రోజు ఏజెన్సీలు నాణ్యమైన భోజనం వండి మోనూ పాటిస్తుండగా, మిగిలిన రోజుల్లో భోజనం మామూలుగానే ఉంటుందనే ఆరోపణలు ఉన్నాయి. వారానికి మూడు కోడిగుడ్లు పెట్టాలన్న నిబంధన ఉన్నా.. ఒకటి, రెండు గుడ్లతో ఏజెన్సీలు సరిపెట్టి చేతులు దులుపుకుంటున్నాయి.n

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles