జంపన్నవాగులో జనగామ వాసి మృతి

Mon,August 12, 2019 04:04 AM

తాడ్వాయి, ఆగస్టు 11: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క-సారక్కల దర్శనానికి వెళ్లిన జనగామ జిల్లా కేంద్రానికి చెందిన ఆవుల పవిత్రన్ (33) జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తుండగా మృతిచెందిన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. మృతుడి కుటుంబ సభ్యులు, స్నేహితుల కథనం ప్రకారం.. జనగాం జిల్లా కేంద్రానికి చెందిన పవిత్రన్ కొన్నేళ్లు హైద్రాబాద్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్త్తూ అక్కడే నివసిస్తున్నాడు.

ఈ క్రమంలో మూడు రోజలుపాటు సెలవులు రావడంతో జనగామలోని మిత్రులతో కలిసి ఆదివారం ఉదయం వాజేడు మండలంలోని బొగత వాటర్ ఫాల్‌ను సందర్శించాడు. తిరుగు ప్రయాణంలో మేడారంలోని వనదేవతల దర్శనానికి వెళ్లి అమ్మవార్ల దర్శనం చేసుకునే ముందు పుణ్యస్నానం ఆచరించేందుకు రెడ్డిగూడెం సమీపంలోని కొంగలమడుగు ప్రాంతంలోని లోలెవల్ కాజ్‌వే వద్దకు మిత్రులంతా వెళ్లారు. అక్కడ జంపన్నవాగు ప్రవాహం ఎక్కువగా ఉండడంతో పవిత్రన్ వాగు ప్రవాహంలో మునిగిపోయాడు. ఈ క్రమంలో వాగులో పవిత్రన్ కోసం స్నేహితులు గాలించగా, చివరికి అతడిని బయటకు తీసి గోవిందరావుపేట మండలంలోని పస్రా పీహెచ్‌సికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం పరిస్థితి విషమించడంతో ములుగు దవాఖానకు తరలించగా అప్పటికే పవిత్రన్ మృతిచెందినట్లు వైద్యులు చెప్పారని మృతుడి స్నేహితులు, కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా మృతుడికి భార్య, కూతురు ఉన్నారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles