రేషన్ షాపుల్లో ఈ-సేవలు

Sun,August 11, 2019 04:35 AM

-టీ-వాలెట్ ద్వారా అందనున్న సదుపాయాలు
-అన్ని రకాల పన్నులు చెల్లించే వెసులుబాటు
-త్వరలో ప్రారంభించేందుకు సర్కార్ చర్యలు
-జిల్లావ్యాప్తంగా 355 రేషన్ దుకాణాలు..
-1,65,744 మంది కార్డుదారులు..
-నెలంతా తెరుచుకోనున్న రేషన్ షాపులు
-29, 30వ తేదీల్లో డీలర్లకు ప్రత్యేక శిక్షణ
-ఇక నుంచి గ్యాస్ కనెక్షన్ ఉంటే కిరోసిన్ కట్

-దీపం పథకం లబ్ధిదారులకు మినహాయింపుజనగామ, నమస్తే తెలంగాణ, ఆగస్టు 10: పట్టణాలకే పరిమితమైన డిజిటల్ విప్లవం ఇక పల్లెలకూ విస్తరించనుంది. ప్రస్తుత రోజుల్లో చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. బ్యాంకింగ్ సేవల నుంచి మొదలుకొని.. అన్ని చెల్లింపులూ చేయొచ్చు. అయితే, పల్లెల్లో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రజల్లో అక్షరాస్యతను పెంచి డిజిటల్ ఇండియాలో భాగస్వాములను చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే పౌరసరఫరాల శాఖ ద్వారా ఈ-పాస్ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా గ్రామాల్లోని రేషన్ దుకాణాల్లో వచ్చేనెల నుంచి డిజిటల్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టింది. నిత్యావసర సరుకుల పంపిణీలో పారదర్శకత కోసం ప్రభుత్వ రేషన్ దుకాణాల్లో ఈ-పాస్ విధానాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విధానం ద్వారా లబ్ధిదారుడి కుటుంబంలో ఎవరైనా స్వయంగా దుకాణానికి వచ్చి వేలిముద్రల ద్వారా బియ్యం, ఇతర వస్తువులు తీసుకోవాలి. దీంతోపాటు రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ దుకాణంలో సరుకులు తీసుకునే అవకాశం ఉంది. ఈ విధానంతో నిజమైన లబ్ధిదారులకు సరుకులు అందుతున్నాయి.

మరిన్ని సేవలు..
ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలకంగా ఉన్న రేషన్ దుకాణాల్లో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సెప్టెంబర్ నుంచి రేషన్ దుకాణాల్లో నిత్యావసర వస్తువుల పంపిణీతోపాటు ఈ-సేవ కేంద్రాల్లో లభించే అన్ని రకాల సేవలు గ్రామీణ ప్రజలకు టీ-వాలెట్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. జిల్లావ్యాప్తంగా ఉన్న 355 రేషన్ దుకాణాల ద్వారా బియ్యం, కిరోసిన్, చక్కెర వంటి నిత్యావసర వస్తువులను 1,65,744 మంది కార్డుదారులకు పంపిణీ చేసేందుకు ప్రతీనెల ఒకటి నుంచి 15వ తేదీ వరకు మాత్రమే తెరిచి ఉంచుతున్నారు. ఇకపై 30 రోజులపాటు(సెలవు దినాలు మినహా) వాటిని తెరిచి ఉంచి పట్టణానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా అదనపు సేవలు అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. రేషన్ షాపుల్లో ఈ-సేవలు అందుబాటులోకి వస్తే గ్రామీణ ప్రాంతాల ప్రజలు మరిన్ని ప్రయోజనాలు పొందనున్నారు. గత ఏడాది ఏర్పాటు చేసిన కామన్ సర్వీస్ సెంటర్లపై గ్రామీణులు ఆసక్తి చూపుతున్నారు. నగదు రహిత లావాదేవీలు, వివిధ రకాల పథకాలకు సంబంధించిన సేవలను ఈ-కేంద్రాల ద్వారా ప్రజలు, వినియోగదారులు సమర్థంగా వినియోగించుకుంటున్నారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ 2 నుంచి రేషన్ దుకాణాల్లో అందుబాటులోకి తేనున్న ఈ-సేవ కేంద్రాల ద్వారా గ్రామీణులకు బ్యాంకుల ద్వారా అందే సేవలతోపాటు ఆధార్, వివిధ రకాల పరీక్ష ఫీజులు, పన్నుల చెల్లింపుతోపాటు ఇతర అన్ని సేవలను అనుసంధానం చేయనున్నారు. వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సేవలు, నగదు రహిత సేవలను అందుబాటులోకి తేవడం ద్వారా వాటి కోసం పట్టణాలకు వెళ్లే బాధలు ప్రజలకు తప్పుతాయి. ప్రస్తుతం కామన్ సర్వీస్ కేంద్రాలు పని చేస్తుండగా వాటికి తోడు రేషన్ షాపుల్లోనూ టీ-వాలెట్ ద్వారా ఆన్‌లైన్ సేవలను అందిస్తారు.

వ్యవప్రయాసాలకు చెక్..!
ఇంతకాలం గ్రామీణులు ఏ బ్యాంకుకు వెళ్లాలన్నా, దరఖాస్తు చేయాలన్నా వ్యయప్రయాసలతో కిలో మీటర్ల కొద్దీ ప్రయాణించి పట్టణాలు.. లేదంటే సమీపంలోని మండలకేంద్రాలకు వెళ్లాల్సి వస్తుంది. డిజిటలైజేషన్ నగదు రహిత లావాదేవీల్లో భాగంగా కామన్ సర్వీస్ సెంటర్లకు తోడుగా ఇకపై రేషన్ షాపుల్లో టీ-వాలెట్ అందుబాటులోకి రానుండడంతో గ్రామీణులకు, ముఖ్యంగా సమాఖ్యలు, సెల్ప్‌హెల్ప్ గ్రూపులకు చెందిన మహిళా సంఘాల సభ్యులకు తిప్పలు తప్పనున్నాయి.

పెరగనున్న డీలర్ల ఆదాయం..
పౌరసరఫరాల శాఖ ప్రజాపంపిణీ ద్వారా అందించే సరుకులు తగ్గి ఆదాయం లేకుండా పోయిందని ఆందోళన పడుతున్న రేషన్ డీలర్లకు ప్రభుత్వం ఈ-సేవల నిర్వహణ అప్పగించి ఆదాయాన్ని రెట్టింపు చేయడంతోపాటు రోజంతా చేతినిండా పని కల్పించబోతున్నది. రేషన్ దుకాణాల్లో త్వరలో ప్రారంభం కానున్న ఈ-సేవల ద్వారా ప్రతీ సేవకు డీలర్లకు నిర్వహణ కోసం కమీషన్ రూపంలో చెల్లించబోతున్నది. దీంతో పట్టణ, గ్రామీణ ప్రాంత రేషన్ డీలర్లకు ఆదాయం పెరగడంతోపాటు ప్రజలకు వివిధ రకాల పన్నులు చెల్లించడం సులభతరం కానుంది.

గ్యాస్ ఉంటే కిరోసిన్ కట్..
ఆహార భద్రతకార్డుతోపాటు ఎల్‌పీజీ కనెక్షన్ ఉన్న వినియోగదారుడికి సెప్టెంబర్ నుంచి కిరోసిన్ సరఫరా నిలిచిపోనున్నది. దీపం పథకం లబ్ధిదారులకు మాత్రం మినహాయింపు ఉంది. వారికి ఎప్పటి మాదిరిగానే రేషన్ దుకాణాల ద్వారా ప్రతినెలా లీటరు కిరోసిన్ సరఫరా చేస్తారు. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నుంచి జిల్లా అధికారులకు ఉత్తర్వులు వెలువడ్డాయి. కిరోసిన్ బ్లాక్ మార్కెట్‌కు అడ్డుకట్ట వేసేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే గ్యాస్ వినియోగదారులకు కిరోసిన్ నిలుపుదల చేస్తున్నారు. ఆహార భద్రతకార్డు ఉంటే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయన్న భావనతో పేదలతోపాటు అనర్హులు చాలా మంది వాటిని పొందారు. రేషన్ దుకాణాల ద్వారా తీసుకుంటున్న దొడ్డు బియ్యంతోపాటు కిరోసిన్ కూడా పక్కదారి పడుతుంది. బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్న అక్రమార్కులు, అదేమాదిరిగా కిరోసిన్‌ను కూడా గుట్టుచప్పుడు కాకుండా నల్లబజార్‌కు తరలిస్తున్నారు. కట్టెల పొయ్యిపై వంట చేసే వారు తప్ప ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ ఉన్న వారంతా కిరోసిన్‌ను బయట అమ్ముకుంటున్నారు. డీజిల్ ధర ఎక్కువగా ఉండడంతో ఆటోలు, జీపులు, లారీలకు రేషన్ దుకాణాల్లో చౌకగా దొరుకుతున్న కిరోసిన్ వాడుతున్న ఫలితంగా మంచి డిమాండ్ ఉంది. రేషన్ షాపుల్లో లీటరు కిరోసిన్ రూ. 33కు లభిస్తుంటే బహిరంగ మార్కెట్‌లో రూ. 50కి అమ్ముతున్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles