చట్ట ప్రకారమే పట్టా చేశాం..

Sun,August 11, 2019 04:23 AM

చిలుపూర్ : మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన ఇట్టెబోయిన శ్రవణ్‌కు చట్ట ప్రకారమే పట్టా చేసినట్లు స్టేషన్‌ఘన్‌పూర్ ఆర్డీవో ఎల్ రమేశ్ అన్నారు. చిలుపూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈసందర్భంగా ఆర్డీవో రమేశ్ మాట్లాడుతూ.. ఇట్టెబోయిన పోషయ్య కుమారుడు శ్రీనివాస్‌కు 2002లో మల్కాపూర్‌కు చెందిన స్వర్ణలతతో పెళ్లి జరిగింది. వారికి శ్రవణ్ అనే కుమారుడు ఉన్నాడు. ఇదిలా ఉండగా కుటుంబ కలహాలతో ఏడాది తర్వాత భార్యాభర్తలు విడిపోయినట్లు ఆయన తెలిపారు. కాగా పోషయ్య తన మనవడు శ్రవణ్ పేరిట 2-20 ఎకరాల భూమిని గ్రామ పెద్దల సమక్షంలో కాగితం రాసి ఇవ్వగా శ్రవణ్ అప్పుడు మైనర్ కావడంతో అతడి పేరిట మారలేదు. ప్రస్తుతం శ్రవణ్ మేజర్ కావడంతో ఇటీవల సాదాబైనామా కింద తన పేరిట పట్టా చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. వారు ఇచ్చిన దరఖాస్తును అన్నివిధాలుగా పరిశీలించి, మోకాపై ఎవరు ఉన్నారనే విషయాన్ని సర్వేచేసి, చుట్టుపక్క రైతులను విచారణ చేసి శ్రవణ్‌కు చట్ట ప్రకారం రికార్డుల్లోకి ఎక్కించినట్లు ఆర్డీవో తెలిపారు. అయితే పోషయ్య తన మనవడికి కాగితం రాసి ఇచ్చినప్పటికీ ఇవ్వలేదని బుకాయించడం సరికాదని, ప్రభుత్వ కార్యాలయం ఎదుట అనవసరంగా ఆందోళన చేసి రెవెన్యూ అధికారులపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని అన్నారు. అనవసరంగా రాద్ధాంతం చేస్తే ఎవరైనా సరే కేసులు నమోదు చేస్తామని ఆర్డీఓ రమేశ్ హెచ్చరించారు. సమావేశంలో తహసీల్దార్ సూర్యనాయక్, ఆర్‌ఐ సురేశ్, సీనియర్ అసిస్టెంట్ రాజుతో పాటు సిబ్బంది ఉన్నారు.

భూరికార్డుల ప్రక్షాళనలో వేగం పెంచాలి
భూరికార్డుల ప్రక్షాళన పనుల్లో వేగం పెంచి త్వరగా రైతులకు పాస్ బుక్కులను అందించాలని స్టేషన్ ఘన్‌పూర్ ఆర్డీవో రమేశ్ అన్నారు. చిలుపూర్ మండల పరిధిలో 12,253 రైతులకు చెందిన ఖాతాలు ఉండగా, ఇప్పటి వరకు 10,846 ఖాతాలకు డిజిటల్ సంతకాలు పూర్తి చేసినట్లు చెప్పారు. 1407 ఖాతాలు పలు కారణాల వల్ల ఆగిపోయినట్లు తెలిపారు. మండల పరిధిలో 85శాతం పాస్ బుక్కులను అందజేశామన్నారు. ప్రస్తుతం పల్లగుట్ట గ్రామంలో 220, కృష్ణాజిగూడెంలో 110, చిలుపూర్‌లో 180, నష్కల్‌లో 130, రాజవరంలో 120, కొండాపూర్‌లో 115, లింగంపల్లిలో 119 ఖాతాలు పూర్తి చేయాల్సి ఉందన్నారు. సెలవు దినాల్లో కూడా సిబ్బందితో పనులు చేయించి త్వరలో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో కూడా క్యాంపెయినింగ్ ఏర్పాటుతో కొంత ఫలితం వచ్చిందన్నారు. సమావేశంలో తహసీల్దార్ సూర్యకుమార్, ఆర్‌ఐలు సురేశ్, మంజుల, సీనియర్ అసిస్టెంట్ రాజు, వీఆర్‌వోలు రాజేశ్వర్‌రావు, పూర్ణిమ, సంపత్, మల్లేశ్, రాజశేఖర్‌తో పాటు పలువురు హాజరయ్యారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles