వరలక్ష్మీ..నమోస్తుతే..!

Sat,August 10, 2019 03:57 AM

-భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం
-భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు
-అమ్మవారి దర్శనానికి బారులు
-ఆలయాల్లో సామూహిక వ్రతాలు, అభిషేకాలు

జనగామటౌన్ : శ్రావణమాసం శుక్రవారాన్ని పురస్కరించుకొని తమకు సకల సౌభాగ్యాలు కలిగి, అంతా శుభప్రదంగా జరగాలని కోరుతూ వరాలతల్లి లక్ష్మీదేవిని మహిళలు భక్తిశ్రద్ధలతో కొలిచారు. శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని జిల్లాలోని పలు ఆలయాల్లో మహిళలు అమ్మవారిని భక్తితో వేడుకున్నారు. పలువురు మహిళలు ఇళ్లలో అమ్మవారి వ్రతాలను నిర్వహించి మహిళలకు పసుపు, బొట్టును వాయినంగా ఇచ్చారు. పూజలకు తరలివచ్చిన భక్తులతో ఆలయాలన్నీ కిక్కిరిసిపోయాయి.

సంతోషిమాత ఆలయంలో..
సంతోషిమాత ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేయగా వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాసశర్మ శాస్త్రోక్తంగా పూజలు జరిపించారు.

సామూహిక వ్రతాలు..
జనగామ గీతాశ్రమంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వందలాది మంది మహిళలు సాముహిక వరలక్ష్మి వ్రతాలను వైభవోపేతంగా జరిపించారు. అలాగే సరస్వతి శిశు మందిర్, శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం, వెంకన్నకుంటలోని హనుమాన్‌దేవాలయం, గుండ్లగడ్డలోని ఉమామహేశ్వర ఆలయంతో పాటు భవానీ నగర్‌లోని శ్రీజ్ఞానసరస్వతి ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు మహిళలు సామూహిక వ్రతాలు చేశారు.

బాణాపురం హనుమాన్ ఆలయంలో..
64వ అఖండ హరేరామ నామస్మరణ పూర్వకనాథబ్రహ్మ యజ్ఞమహోత్సవంలో భాగంగా మహాలక్ష్మి యజ్ఞాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో పాల్గొని యజ్ఞమహోత్సవాన్ని తిలకించారు. అనంతరం జనగామ లయన్స్‌క్లబ్ ఆఫ్ జనగామ ఆధ్వర్యంలో వందలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ జనగామ అధ్యక్షుడు కృష్ణజీవన్‌బజాజ్, టీ కృష్ణారెడ్డి, గంగిశెట్టి ప్రమోద్‌కుమార్, మహంకాళి హరిశ్చంద్రగుప్త, శ్రీధర్, కందుకూరి శ్రీనివాస్, మారం ప్రవీణ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

ఆలయాల వద్ద పోలీసుల బందోబస్తు..
జిల్లావ్యాప్తంగా ఆలయాల్లో నెలకొన భక్తులసందడి దృష్ట్యా జనగామ డీసీపీ బీ శ్రీనివాసరెడ్డి, ఏసీపీ వినోద్‌కుమార్, సీఐ మల్లేశ్ యాదవ్ పర్యవేక్షణలో ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తుగా భారీ బందోబస్తును నిర్వహించారు.
పాలకుర్తి : శ్రావణమాసాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని పుణ్యక్షేత్రమైన స్వయంభూ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి, ఓంకారేశ్వరస్వామి ఆలయ సన్నిధిలో శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో అష్టోత్తర శతనామ పూజలతో ధూప, దీప, నైవేద్యం, తాంబూలాలను సమర్పించారు. కర్పూర నీరాజనాలతో కుంకుమార్చనలతో మహాలక్ష్మీదేవికి మంగళహారతిని సమర్పించారు. అర్చకుడు దేవగిరి లక్ష్మన్న, గంగు రఘు ఆధ్వర్యంలో మహిళలు పూజలు నిర్వహించారు. అలాగే లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో, సుబ్రహ్మణ్యస్వామి, ఆంజనేయస్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్యశర్మ, ఈవో ఎం వీరస్వామి, అర్చకుడు దేవగిరి రామన్న, డీవీఆర్ శర్మ, ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, ముంజ రాములు, శ్రీనివాస్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

బుగులు వెంకన్న సన్నిధిలో..
చిలుపూర్ : మండలంలోని చిలుపూర్ బుగులు వెంకటేశ్వరస్వామి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను శ్రావణ శుక్రవారం రోజున ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని కల్యాణ మంటపంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని భక్తితో కొలిచారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ కల్యాణ మంటపం కిక్కిరిసిపోయింది. పూజలో ఆలయ ఈవో శ్రీనివాస్, రంగాచారి, రవీంద్రశర్మ, రామచంద్రాచార్యులతో పాటు ఆలయ సిబ్బంది రమేశ్, వీరన్న, కృష్ణ, మల్లికార్జున్, సిబ్బంది పాల్గొన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles