తహసీల్దార్ కార్యాలయంలో రైతు నిరసన

Sat,August 10, 2019 03:55 AM

-ఆర్డీవో హామీతో విరమణ
చిలుపూరు, ఆగస్టు 09 : వ్యవసాయ భూమిని తనను కాదని మనవడి పేర రికార్డుల్లోకి ఎక్కించారని, చిలుపూరు తహసీల్దార్ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన ఇట్టెబోయిన పోషయ్య అనే రైతు శుక్రవారం నిరసన తెలిపాడు. ఆయన కథనం ప్రకారం.. తనకున్న భూమిలో తన మనవడైన ఇట్టెబోయిన శ్రావణ్ పేర 2.20 ఎకరాల భూమిని అధికారులు రికార్డుల్లోకి ఎక్కించారని, ఈ క్రమంలో తన పేర చేయాలని రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేశానని తెలిపాడు. తన పేర ఉన్న భూమిని తన కుమారులకు ఇవ్వాల్సి ఉండగా మనవడికి ఇవ్వడం తనకు ఇష్టం లేదని బాధిత రైతు తెలిపాడు. సమాచారం తెలుసుకున్న ఆర్డీఓ రమేశ్ బాధిత రైతు పోషయ్యతో ఫోన్‌లో మాట్లాడి ఏదైనా సమస్య ఉన్నట్లయితే మంగళవారం అందుకు సంబంధించిన కాగితాలను పట్టుకుని వచ్చినట్లయితే పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో నిరసనను విరమించుకున్నాడు.

నిబంధనల మేరకు రికార్డుల్లో చేర్చాం : తహసీల్దార్
ఇట్టబోయిన పోషయ్య తన మనవడు ఇట్టబోయిన శ్రావణ్ పేర 2003లో సాదా కాగితంపై 2-20ఎకరాల భూమిని రాసి ఇచ్చాడని, సాదా కాగితం ద్వారా సాదాబైనామా కోసం శ్రావణ్ దరఖాస్తు చేసుకోగా పూర్తిస్థాయిలో విచారణ చేశామని తహసీల్దార్ సూర్యనాయక్ తెలిపాడు. అలాగే కాగితంలో ఉన్నట్లుగానే మోకా పైన వ్యవసాయం చేస్తున్నాడని, అంతేకాకుండా పంచాయతీ కార్యాలయంలో సాదాబైనామా చేస్తున్నట్లు నోటీసును కూడా ప్రకటించినట్లు తెలిపారు. గ్రామస్తులను విచారించగా వాస్తవాలను తెలిపారని అందువల్లే శ్రావణ్ పేర భూమిని రికార్డులకు ఎక్కించామని తహసీల్దార్ తెలిపారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles