డబుల్ భరోసా

Fri,July 19, 2019 03:29 AM

జనగామ జిల్లాప్రతినిధి, నమస్తే తెలంగాణ: లబ్ధిదారులకు ఆసరా పథకం మరింత భరోసా ఇవ్వనుంది. ఇప్పుడు అందజేస్తున్న పింఛన్లను రెట్టింపు చేయడంతో ఆయా కుటుంబాల్లో వెలుగులు నిండనున్నాయి. మొదటిసారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ సర్కార్ రూ. 200 పింఛన్‌ను ఐదు రెట్లు పెంచి వృద్ధులు, వితంతువులకు రూ. 1000 చొప్పున, దివ్యాంగులకు రూ. 1500 చొప్పున అందజేసింది. రెండో దఫా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పింఛన్లను డబుల్ చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే దిశగా చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఆసరా పింఛన్లు పెంచుతూ జీవో జారీ చేసిన సీఎం కేసీఆర్.. ఈ నెల నుంచి పెరిగిన పింఛన్లు అందజేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం జిల్లాలో 78,054 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇదిలా ఉండగా వృద్ధాప్య పింఛన్ల వయస్సును 65 నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తానని సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చారు. జిల్లాలో ఆ వయస్సు కలిగిన వారి సంఖ్య 12,704 ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వారికి సైతం ఈ నెల నుంచే పింఛన్లు ఇచ్చేలా ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది. ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయగానే వారికి సైతం పింఛన్లు అందజేస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో 90,758 మందికి లబ్ధి..!
జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 78,054 వేల మందికి ఆసరా పింఛన్లు అందుతున్నాయి. వీరిలో దివ్యాంగులకు రూ. 1500, మిగతా వారికి రూ. 1000 ఇస్తున్నారు. ప్రతినెలా లబ్ధిదారుల బ్యాంకు ఖాతా లేదా పోస్టాఫీస్ అకౌంట్‌లో డబ్బులు జమవుతున్నాయి. ఇటీవల శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే వృద్ధాప్య పింఛన్లు రెట్టింపు చేస్తామని ప్రకటించారు. దివ్యాంగులకు అందజేస్తున్న 1500 రూపాయలను రూ. 3016గా, మిగతా వర్గాలకు ఇస్తున్న వెయ్యి రూపాయలను రూ. 2016కు పెంచుతామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచారు. టీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలో వచ్చిన దృష్ట్యా.. ఇచ్చిన మాట నిలుపుకునేందుకు ఆసరా పింఛన్లు పెంచుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవో విడుదల చేశారు. ప్రస్తుతం జిల్లాలో ఆసరా పథకం కింద పింఛన్లు తీసుకుంటున్న వాళ్లందరికీ ఈ మాసం నుంచి రెట్టింపు పింఛన్లు అందనున్నాయి. సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వృద్ధాప్య పింఛన్ల వయస్సును 65 నుంచి 57కు తగ్గిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆ మధ్య వయస్సు కలిగిన లబ్ధిదారుల సంఖ్యను గుర్తించాలని ఆదేశాలిచ్చారు. డీఆర్‌డీఏ అధికారులు కొద్దిరోజులుగా ఇదే పనిలో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన ఓటరు జాబితా ఆధారంగా 57 నుంచి 64 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారిని గుర్తించారు. జిల్లావ్యాప్తంగా 12,704 మంది అర్హులు ఉన్నట్లు తేల్చారు.

రూ. 25 కోట్లకు చేరే అవకాశం
ఈ నెల నుంచి లబ్ధిదారులకు కొత్త పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆసరా పింఛన్లు రెట్టింపు చేయడంతో సర్కార్‌పై మరింత భారం పడనుంది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 78,054 మందికి ప్రతినెలా రూ. 10 కోట్లు పింఛన్ రూపంలో అందుతున్నాయి. 65 ఏళ్ల నుంచి 57కు తగ్గించడంతో 12,704 అదనంగా చేరనున్నారు. దీంతో ప్రభుత్వంపై అదనపు భారం పడనుంది. ఈ మేరకు బడ్జెట్ రూ. 25 కోట్లకు పైగా చేరే అవకాశమున్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయినా ప్రజా సంక్షేమం కోసం ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన మాటకు టీఆర్‌ఎస్ సర్కార్ కట్టుబడిందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు హర్షం వెలిబుచ్చుతున్నారు.

103
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles