పకడ్బందీగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణ

Fri,July 19, 2019 03:26 AM

జనగామ, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి మున్సిపల్ ఎన్నికలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. గురువారం జనగామలోని ఏకశిల బీఈడీ కాలేజీలో మున్సిపల్ ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలింగ్ అధికారులు, అసిస్టెంట్ పోలింగ్ అధికారులకు మాస్టర్ ట్రైనర్లు అప్జల్, రామరాజు, జయపాల్‌రెడ్డి, వెంకటేశ్వర్లు పోలింగ్ నిర్వహణపై ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో ఓటరు స్లిప్‌లు ఓటు వేసేందుకు గుర్తింపు కార్డుగా ప్రామాణికం కాదని, ఎన్నికల సంఘం నిర్దేశించిన మేరకు 18 రకాల ఫొటో గుర్తుంపు కార్డుల్లో ఏదైనా ఒకటి మాత్రమే పరిగణలోకి తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రానికి స్లిప్‌తోపాటు గుర్తింపుకార్డు చూపిస్తేనే ఓటేసేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఓటరు స్లిప్ గుర్తింపుకార్డు కాదన్న విషయాన్ని పట్టణంలోని 30వార్డుల్లో ఓటర్లకు తెలిసేలా ప్రచారం చేయాలని మున్సిపల్ కమిషనర్ రవీందర్‌ను ఆదేశించారు. పోలింగ్ స్టేషన్ పరిధిలో రాజకీయ పార్టీల ప్రచారం, జెండాలు, బ్యానర్లు, గుర్తులు కనిపించకుండా చూడాలన్నారు. మెటీరియల్, ఓటరు జాబితా, బ్యాలెట్ పేపర్ల పరిశీలన, తనిఖీ వంటి అంశాలపై అధికారులకు శిక్షణ, అవగాహన కల్పించారు. చాలెంజ్, టెండరు ఓటు వచ్చినప్పుడు ఎన్నికల నియమావళి మేరకు నడుచుకోవాలని, 30వార్డుల్లో 30 పోలింగ్ కేంద్రాలు, 60 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసి, ఒక ప్రిసైడింగ్ అధికారితోపాటు నలుగురు సిబ్బంది ఉంటారని చెప్పారు. పీవో పోలింగ్‌ను పర్యవేక్షించడంతోపాటు ప్రతీ రెండు గంటలకు ఓటింగ్ సరళిని ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఏపీవో ఓటరు జాబితాను గుర్తించే పనిలో ఉంటారని, రెండో ఆఫీసర్ ఓటు వేసేందుకు వచ్చిన ఓటరు ఎడమ చేయి చూపుడు వేలుకు సిరా గుర్తు వేస్తారని, మూడో అధికారి బ్యాలెట్ పేపర్‌లో ఓటరు సంతకం తీసుకుంటారని, నాలుగో అధికారి బ్యాలెట్ పేపర్ గుర్తుపై ఓటు వేసిన తర్వాత ఎలా మలిచి బ్యాక్స్‌లో వేయాలో తెలియ చేయాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జనగామ ఆర్డీవో మధుమోహన్, మున్సిపల్ కమిషనర్ నోముల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles