కలెక్టర్ చేతికి ఎంసీహెచ్ నివేదిక

Fri,July 19, 2019 03:25 AM

జనగామ టౌన్ : జనగామ మాతాశిశు ఆరోగ్య కేంద్రం నిధుల దుర్వినియోగం ఆరోపణలపై జరిగిన ఆడిట్ రిపోర్టును జిల్లా వైద్యాధికారి ఏ మహేందర్ గురువారం సాయంత్రం కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డికి అందించారు. ఎంసీహెచ్‌కు 2018-19వ సంవత్సరానికి ఎన్‌హెచ్‌ఎం నుంచి మంజూరైన రూ. 40 లక్షల నిధుల్లో అవకతవకలు జరిగాయని హైదరాబాద్ నుంచి వచ్చిన అధికారులు, జిల్లా అధికారులు గుర్తించి ఈ నెల 11వ తేదీన ప్రత్యేకంగా నిధుల వాడకంపై ఆడిట్ నిర్వహించారు. కాగా, ఆడిట్‌లో ఎంసీహెచ్ మాజీ పర్యవేక్షకుడు ప్రభుత్వం నుంచి వచ్చిన మందులు అందుబాటులో ఉన్నా.. ప్రైవేట్ ఏజెన్సీల నుంచి తెప్పించడంతోపాటు అవసరం లేకున్నా ఒకేరకమైన మెడిసిన్‌ను ప్రతీరోజు కొనుగోలు చేసినట్లు బిల్లులు ఉండటాన్ని గుర్తించారు.
ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన ఆడిట్ అధికారుల నివేదికతోపాటు జిల్లా ప్రధాన దవాఖాన, ప్రస్తుత ఎంసీహెచ్ పర్యవేక్షకుడు డాక్టర్ పీ రఘు, జిల్లా వైద్యాధికారి మహేందర్ కమిటీగా ఏర్పాటై నిధుల దుర్వినియోగంతోపాటు ఎంసీహెచ్‌లో జరుగుతున్న వైద్యసేవల నిర్లక్ష్యంపై పూర్తిస్థాయి నివేదికను జిల్లా హెల్త్ సొసైటీ చైర్మన్, కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డికి అందజేశారు.

చర్యలకు రేపోమాపో ఉత్తర్వులు..?
ఈ నివేదిక ప్రకారం నిధుల దుర్వినియోగానికి పాల్పడిన అధికారిపై శాఖాపరమైన చర్యలకు కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి నేడోరేపో ఉత్తర్వులను జారీ చేయనున్నట్లు సమాచారం. కాగా, రిపోర్టును పరిశీలించిన కలెక్టర్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు పంపించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా బాధితుడిపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles