తాను మరణించినా.. ఐదుగురికి కొత్త జీవితాన్నిచ్చాడు

Thu,July 18, 2019 03:44 AM

ఖైరతాబాద్, జూలై 17 : రోడ్డు ప్రమాదంలో మృత్యువు కబళించినా ఐదుగురికి అతడు కొత్త జీవితాన్నిచ్చాడు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన అనుముల శ్రీనివాస్ (40) తపాలా శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆయన భార్య మమత, కుమార్తె మనస్విని (13), కుమారుడు అక్షయ్ (17) ఉన్నారు. ఈ నెల 14న మధ్యాహ్నం విధులకు వెళ్లి, తన ఇంటికి బైకుపై వెళ్తున్నాడు. ఒక్కసారిగా బైకు అదుపుతప్పి కింద పడిపోయాడు. దీంతో తలకు తీవ్ర గాయం కాగా, స్థానిక దవాఖానలో చికిత్స చేయించినా ఫలితం లేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని యశోద దవాఖానకు తరలించారు. చికిత్స అందిస్తున్న వైద్యులు బ్రేయిన్ డెడ్‌గా నిర్ధారించారు. విషయాన్ని కుటుంబ సభ్యులకు వివరించారు. ఆస్పత్రిలోని జీవన్‌దాన్ కోఆర్డినేటర్లు కుటుం బ సభ్యులను కలిసి ఆయన మరణించినా, పలువురిలో జీవించే ఉంటారని, జీవన్‌దాన్ ప్రాముఖ్యత, అవయవదానం విశిష్టను వివరించారు. అందుకువారు అంగీకరించగా, శ్రీనివాస్ శరీరం నుంచి కాలేయం, రెండు మూత్రపిండాలు, కార్నియాలను సేకరించారు. ఈమేరకు అవయవదానానికి ముందుకొచ్చిన కుటుంబ సభ్యులను వైద్యులు అభినందించారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles