ప్రమాదకర స్థితిలో భూగర్బజలాలు

Tue,July 16, 2019 04:41 AM

జనగామ, నమస్తే తెలంగాణ, జూలై 15: ఎగువ ప్రాంతమైన జిల్లాలో భూగర్భ జలాలు ప్రమాదకర స్థితిలో అడుగంటుతున్నాయని, యుద్ధప్రాతిపదికన నీటి సంరక్షణపై దృష్టి సారించకుంటే భవిష్యత్‌లో నీటి కష్టాలు తప్పవని కేంద్ర మంత్రిత్వ శాఖ జలశక్తి అభియాన్ డైరెక్టర్, నోడల్ అధికారి ఆశిష్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. వన్‌డ్రాప్-మోర్‌క్రాప్ (ఒక్క నీటి చుక్కతో ఎక్కువ పంటలు పండించాలి) అనే నిదానంతో కేంద్ర ప్రభుత్వం నీటి వాడకంపై దేశవ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించే జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని కేత్రస్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర, రాష్ట్ర అధికారుల బృందం నాలుగు రోజుల పర్యటన చేపట్టింది. ఈ బృందం సభ్యులు సోమవారం జిల్లాకు వచ్చారు. కేంద్ర ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఆశీష్‌కుమార్ సహా కేంద్ర భూగర్భ నీటి వరునరుల సంస్థ డైరెక్టర్ సుబ్బారావు, టెక్నికల్ అధికారి పుష్పేంద్ర, రాష్ట్ర అధికారులు తొలిరోజు బచ్చన్నపేట మండలంలో పర్యటించారు. అనంతరం సాయంత్రం కలెక్టరేట్‌లో కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి అధ్యక్షతన ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆశిష్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో రోజురోజుకు భయంకరంగా పడిపోతున్న భూగర్భ జలాలను సంరక్షించుకోకుంటే భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

జనగామ ఎత్తైన ప్రాంతం
ఉమ్మడి వరంగల్‌లో భాగస్వామిగా ఉన్న జనగామ జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని, దక్కన్ పీఠభూమిలోనే అత్యంత ఎత్తైన ఎగువ ప్రాంతంగా ఉన్న జనగామలో వర్షాలు ఆలస్యంగా, అతి తక్కువగా కురుస్తున్నాయని, ఈ సమస్యను ఇలాగే వదిలేస్తే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆశిష్‌కుమార్ హెచ్చరించారు. వర్షాభావం నెలకొన్న జిల్లాలో భూమిపై పడుతున్న ప్రతీ నీటిచుక్కను ఒడిసి పట్టి భూగర్భంలోకి ఇంకేలా చేయాలన్నారు. నీటి కష్టాల్ని చవిచూస్తున్న రైతులు, ప్రజలు మేల్కొని నీటి సంరక్షణ చర్యలకు నడుం బిగించాలని, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసి పనులు పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు.

ప్రతీ రైతు ఫాంపాండ్ తవ్వుకోవాలి
ప్రతీ రైతు తన పంట పొలాల్లో నీటి కుంట(ఫాంపాండ్)ను తప్పనిసరిగా తవ్వుకొని జాలాన్ని సంరక్షించుకోవాలని ఆశిష్‌కుమార్ కోరారు. దేశవ్యాప్తంగా నీటి నిల్వలను పెంచేందుకు కేంద్రం ఐదు రకాల పనులను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్నట్లు వివరించారు. జల సంరక్షణ-నీటి నిల్వ, బోర్‌వెల్ పాయింట్ వద్ద రీచార్జి స్ట్రక్చర్, పురాతన చెరువులు, కుంటల మరమ్మతులు, వాటర్‌షెడ్, చెక్‌డ్యాంల నిర్మాణం, మొక్కలు నాటే కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నదని వివరించారు. నీటి లభ్యత కోసం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో జిల్లా 109వ స్థానంలో ఉందని, ప్రగతి ఆధారంగా నిత్యం ర్యాంకింగ్ మారుతున్నదని చెప్పారు. నీటి సంరక్షణ కోసం చేపట్టే ప్రతీ కార్యక్రమంలో ప్రజలు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలన్నారు. ఇందుకోసం నీటిపారుదల, భూగర్భజల, డీఆర్‌డీఏ శాఖలు సంయుక్తంగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకొని ఇక్కడ చేపట్టే పనుల ప్రతిపాదనలు కేంద్రానికి పంపించాలని సూచించారు.

ఐక్యంగా పని చేయాలి
భూగర్భ జలాల పెంపులో వెనకబడిన జనగామ జిల్లాను ప్రగతి పథంలోకి తీసుకువచ్చేలా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఐక్యంగా పని చేయాల్సి ఉందని ఆశిష్‌కుమార్ అభిప్రాయపడ్డారు. నాటిన ప్రతీ మొక్కను చిన్న పిల్లవాడిలా కాపాడుకోవాలని సూచించారు. దేశంలో భూగర్భ జలాల పరిరక్షణకు 245 జిల్లాలను ఎంపిక చేయగా, అందులో జనగామ జిల్లాలోని ఎనిమిది మండలాలను కేంద్రం గుర్తించిందని చెప్పారు. ఈ నెల 18 వరకు జిల్లాలోని లింగాలఘనపురం, దేవరుప్పుల, జనగామ, తరిగొప్పుల, రఘునాథపల్లి, పాలకుర్తి, జఫర్‌ఘడ్ మండలాల్లో క్షేత్రస్థాయి పర్యటన ద్వారా గ్రామసభలు ఏర్పాటు చేసి రైతులు, ఉపాధి కూలీలు, అధికారులతో ముఖాముఖీ సమావేశం ఉంటుందని వెల్లడించారు. ఆయా మండలాల పరిధిలో ఉపాధిహామీ పనులు, హరితహారం, ఉద్యాన, నీటి లభ్యతను పెంచుకున్న దిశగా చేపడుతున్న నీటి రీచార్జి పిల్, ఫాంపాం డ్, ఇంకుడు గుంతలు, నర్సరీలు, చెక్‌డ్యాంలు, మామిడి తోటలు, హరితహారం, రాక్‌ఫీల్ డ్యాం, స్టోరేజ్ ట్రెంచెస్ వంటి నిర్మాణాలను ప్రత్యక్షంగా పరిశీలిస్తామని స్పష్టం చేశారు.
22 వందల పనులు జరుగుతున్నాయి..
జిల్లాలో భూగర్భ జలాలను పెంచుకునేందుకు ఉపాధిహామీ కింద ప్రస్తుతం 2755 పనులు చేపడితే.. ఢిల్లీ బృందం పర్యటించే ఎనిమిది మండలాల పరిధిలో 2200 పనులు జరుగుతున్నాయని కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి చెప్పారు. జలశక్తి అభియాన్ పథకం ద్వారా 100 రోజుల్లో ఈ పనులు పూర్తి చేసి, నీటి ఎద్దడి నుంచి జిల్లాను రక్షించుకోవాల్సి ఉంటుందని, నివాస గృహాలపై పడిన వర్షపు నీటిని అక్కడే భూమిలోకి ఇంకిపోయేలా ఈ పథకం కింద కార్యాచరణ ఉన్నదని తెలిపారు.

మరో మూడు రోజుల పర్యటన..
రెండో రోజు పర్యటనలో భాగంగా మంగళవారం లింగాలఘనపురం, దేవరుప్పుల మండలాల్లో బృందం సభ్యులు పర్యటిస్తారు. నెల్లుట్ల, లింగాలఘపురం, రామరాజుపల్లి పెద్దచెరవు, ఫాంపాండ్, నర్సరీ, మలబార్ నీమ్ ప్లాంటేషన్, సింగరాజుపల్లి, సీతారాంపూర్‌లో మామిడి తోటలు, చెక్‌డ్యాం, ఫాంపాండ్, కమ్యూనిటీ ప్లాంటేషన్‌ను పరిశీలిస్తారు. లింగాలఘనపురం మండలంలోని జీడికల్‌లో ఫాంపాండ్, ఆలయ పరిసర ప్రాంతాల్లో కమ్యూనిటీ ప్లాంటేషన్‌ను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎంపీడీవోలు, సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులతో సమావేశమవుతారు. మూడో రోజు పర్యటనలో భాగంగా 17న పాలకుర్తి, జఫర్‌ఘడ్ మండలాల్లోని రాగడితండా గుట్టపై కందకాలు, ఫాంపాండ్స్, హరితవనాలు, సీసీటీ, ఎస్‌జీటీ పనులను పరిశీలించి కోనాయచలంలోని నర్సరీ, హార్టికల్చర్, ఫాంపాండ్, నీటిపారుదల శాఖ పరిధిలోని మల్లకుంట, మ్యాజిక్ సోక్‌పిట్‌ను పరిశీలిస్తారు.

అనంతరం గ్రామసభ నిర్వహించి ప్రజలను భాగస్వామ్యం చేస్తారు. పాలకుర్తి మండలం బొమ్మెరలోని ఎంజీవీఎన్ ప్లాంటేషన్, గుట్టలపై కందకాలు, మ్యాజిక్ సోక్‌పిట్, చెరువు, ఫాంపాండ్, రాఘవపూర్‌లోని రీఫ్యూజ్ రీచార్జి పిట్, అవెన్యూ ప్లాంటేషన్, ఫాంపాండ్స్‌ను సందర్శించి గ్రామసభ నిర్వహిస్తారు. చివరి రోజు 18న జనగామ, తరిగొప్పుల, రఘునాథపల్లిలో పర్యటిస్తారు. అబ్దుల్‌నగారంలో నర్సిరీ, ఫాంపాండ్, చెరువు, ప్లాంటేషన్, మ్యాజిక్ సోక్‌పిట్‌ను పరిశీలిస్తారు. తరిగొప్పులలో ట్రెంచర్స్, అవెన్యూ ప్లాంటేషన్, ఫాంపాండ్స్, కోడిచెరువు, ఎంఐపీ ప్లాంటేషన్‌ను పరిశీలించారు. అలాగే, జనగామ మండలం వడ్లకొండలో సోక్‌పిట్, నర్సరీ, హార్టికల్చర్, రాక్‌ఫిల్ డ్యాం, ట్రెంచ్‌బౌండ్‌ను పరిశీలించిన అనంతరం రఘునాథపల్లి మండలంలోని మేకలగట్టు, మండెలగూడెం, ఖిలాషాపురంలో పర్యటిస్తారు. తర్వాత వివిధ అంశాలపై చర్చించనున్నట్లు కలెక్టర్ వివరించారు.

94
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles