ఆన్‌లైన్ మోసగాడు అరెస్ట్

Tue,July 16, 2019 04:39 AM

స్టేషన్‌ఘన్‌పూర్, నమస్తే తెలంగాణ జూలై15: ఇటీవల కలకలం రేపిన ఆధార్‌కార్డు వేలిముద్రలతో ప్రజలను మోసం చేసి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు డ్రా చేసిన ఆన్‌లైన్ కేటుగాడిని ఎట్టకేలకు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఏసీపీ వెంకటేశ్వరబాబు విలేకరుల సమావేశం ఏర్పాటుచేసిన వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఇటీవల స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నమిలిగొండ గ్రామంలో ఆధార్ కార్డు నంబర్లతో బ్యాంకు ద్వారా డబ్బులు డ్రా చేసిన ఆన్‌లైన్ హ్యకర్ ఆల్వాల వినయ్‌కుమార్‌ను అరెస్టు చేసి సోమవారం రిమాండుకు తరలించినట్లు తెలిపారు. నెక్కొండ మండలం సీతారాంపూరం గ్రామానికి చెందిన ఆల్వాల వినయ్‌కుమార్ నర్సంపేటలోని జయముఖి కాలేజీలో ఫిబ్రవరి 2019లో బీటెక్ ఫేయిలయ్యాడు తర్వాత తన గ్రామానికి చెందిన ఓ యువతిని చిలుపూరు వేంకటేశ్వరస్వామి దేవాలయంలో కులాంతర వివాహం చేసుకున్నాడు. ఈక్రమంలో చిన్నపెండ్యాలలో ఒక గదిని అద్దెకు తీసుకున్నాడు. పైవైటు ఉద్యోగం కోసం వెతుకుతూ పీఎంజీడీఐఎస్‌లో భాగంగా గ్రామాల్లోని ప్రజలకు కంప్యూటర్‌పై అవగాహన, శిక్షణ ఇప్పించేలా గ్రామీణ స్థాయిలో కల్పించేలా, నెక్కొండ మండలంలోనే డ్యూటీ చేయుటకు csc.gov.inలో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఆ తర్వాత జిల్లా కోఆర్డినేటర్ ద్వారా అప్రోచ్ అయి ఉద్యోగంలో చేరాడు. ఈ కార్యక్రమంలో భాగంగానే గత రెండునెలల క్రితం వరకు చిలుపూర్ మండలంలోని నష్కల్ గ్రామంలో పనిచేశాడు. తర్వాత ఆ కార్యక్రమాన్ని ఆసరా చేసుకుని తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని పన్నాగం పన్నాడు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌ను ఉపయోగించి మోసం చేయాలనే ఆలోచనతో అందరి ఆధార్ కార్డులలో వివరాలు మార్పిడి చేస్తామని ప్రజలను నమ్మించాడు. ముందుగా నమిలిగొండ గ్రామ సర్పంచ్‌ని కలిసి వారిని నమ్మించి ఈ నెల 1 నుంచి 4వ తేదీ వరకు గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో ల్యాప్‌ట్యాప్‌లో బయోమెట్రిక్ ద్వారా ప్రజల ఆధార్ కార్డుల వివరాలు, వారి వేలి ముద్రలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో డీజీపే యాప్ ద్వారా ఒక్కొక్కరి బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.600 చొప్పున వారికి తెలియకుండా మొత్తం రూ.2 59, 500 కామన్ సర్వీస్ సెంటర్ నుంచి తన అకౌంట్‌లోకి మార్చుకున్నాడు. తర్వాత డబ్బులు కట్ అయిన విషయం గ్రామస్తుల సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు వచ్చాయి. మెసేజ్‌లను చూసి సర్పంచ్‌ని గ్రామస్తులు సంప్రదించారని, దీంతో సర్పంచ్ నేరస్తుడికి ఫోన్ చేసి వివరాలు అడుగగా 9న వస్తానని చెప్పిన వినయ్‌కుమార్ రాకపోడంతో అసలు విషయం బయటపడింది. దీంతో సర్పంచ్ సహా గ్రామస్తులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టి నేరస్తుడు వినయ్‌కుమార్‌ను సోమవారం ఉదయం స్టేషన్‌ఘన్‌పూర్‌లో పట్టుకున్నట్లు ఏసీపీ వెంకటేశ్వరబాబు తెలిపారు. ఈ మేరకు విచారణ చేయగా వినయ్‌కుమార్ నేరాలను ఒప్పుకున్నాడని ఆయన తెలిపారు. దీంతో వినయ్‌కుమార్ ఆన్‌లైన్ ద్వారా బ్యాంకు ఖాతాల నుంచి డ్రా చేసిన డబ్బు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. కాగా ఎంతో చాకచక్యంగా కేసును ఛేదించిన ఎస్సై రవి, కానిస్టేబుల్ అనిల్, నవీన్‌ను వరంగల్ సీపీ విశ్వనాథరవీందర్, జనగామ డీసీపీ శ్రీనివాసరెడ్డి, ఏసీసీ వెంకటేశ్వరబాబు అభినందించారు. సమావేశంలో సీఐ, ఎస్సై, సిబ్బంది పాల్గొన్నారు.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles