మున్సిపోల్స్‌లో సత్తా చాటాలి

Mon,July 15, 2019 02:00 AM

- రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు
- కేసీఆర్ పక్షాన నిలబడిన ప్రజలు
- జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
- కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరికలు
- తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సైతం..


జనగామ, నమస్తే తెలంగాణ : జనగామ పట్టణంలో మరోసారి మినీ అసెంబ్లీ మాదిరిగా జరిగే మున్సిపల్ ఎన్నికల్లో 30 వార్డులను కైవసం చేసుకొని గులాబీ పార్టీ సత్తా చాటాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం జనగామలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ నాయకుడు కర్రె శ్రీనివాస్ ఆధ్వర్యంలో కర్రె నర్సింహులు, మాజీ కౌన్సిలర్ బాల్దె సోమయ్య, నమిలె శంకర్‌తోపాటు దాదాపు 100 మంది యువకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. కాగా వారికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. అదేవిధంగా తెలంగాణ జాగృతి జిల్లా నాయకులు పొత్కనూరి మంజుల, కొలగాని కావ్య ఆధ్వర్యంలో 200 మంది మహిళలు గులాబీ కండువా కప్పుకున్నారు. వీరితోపాటు తరిగొప్పుల మండలం బొంతగట్టునాగారం సర్పంచ్ రాజయ్య, పలువురు వార్డుసభ్యులు సైతం టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సంక్షేమ పాలనలో తెలంగాణ సమాజం యావత్ ఒక్కటై టీఆర్‌ఎస్‌లో చేరేందుకు పెద్దఎత్తున ఆసక్తి చూపుతున్నారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు మొదలు, సర్పంచ్, ఎంపీటీసీ, లోక్‌సభ ఎన్నికల వరకు అన్ని వర్గాలకు చెందిన మెజార్టీ ప్రజలు టీఆర్‌ఎస్ వైపు నిలిచారని, ఇప్పుడు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కూడా పట్టణ ప్రాంత ప్రజలు కేసీఆర్‌కు అండగా నిలిచేందుకు సిద్ధపడుతున్నారని చెప్పారు. అందులో భాగంగానే జనగామ పట్టణంలో బలమైన సామాజికవర్గానికి చెందిన కర్రె శ్రీనివాస్, కర్రె నర్సింహులు సహా కుర్మవాడ సహా పలు వార్డుల నుంచి పెద్దఎత్తున గులాబీ పార్టీలో చేరి సీఎం కేసీఆర్ పక్షాన నిలబడ్డారని అన్నారు. అదేవిధంగా కల్వకుంట్ల కవిత నాయకత్వలో పనిచేసి జనగామ ప్రాంతంలో తెలంగాణ జాగృతి కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషించిన మంజుల, కావ్య తదితరులు అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వలో పూర్తి సమయం పనిచేసేందుకు ముందుకు వచ్చారన్నారు. పట్టణానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీల నుంచి పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆసక్తితో ఉన్నారని, ఎన్నికల నోటిఫికేషన్ వరకు ప్రతిపక్ష పార్టీలన్నీ దాదాపు ఖాళీ అవుతాయని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పేర్కొన్నారు. దిగువ భాగానికి పారుతున్న నదీ ప్రవాహానికి అడ్డుకట్టు వేసి 500 మీటర్ల ఎత్తుకు నీటి ప్రవాహాన్ని ఎదురు ప్రవహించేలా సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారన్నారు.

30 వార్డులను కైవసం చేసుకుందాం..
దేశానికి దిక్సూచిగా నిలిచిన సీఎం కేసీఆర్ నేతృత్వంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పట్టణంలో విస్తృత ప్రచారం ద్వారా 30 వార్డులను కైవసం చేసుకోవాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పిలుపునిచ్చారు. వార్డుల వారీగా పార్టీకి బలమైన క్యాడర్‌ను తయారు చేసుకునేందుకు సభ్యత్వ నమోదు చేసుకున్నామని, ఇప్పటి నుంచే పెద్దఎత్తున ప్రచారం చేసి పట్టణంలో టీఆర్‌ఎస్‌ను తిరుగులేని పార్టీగా మార్చాలన్నారు. ఇటీవల జిల్లాలో 12 జెడ్పీటీసీలను కైవసం చేసుకొని జిల్లా పరిషత్‌పై జెండా ఎగురవేసిన స్ఫూర్తితో మున్సిపల్‌ను కైవసం చేసుకోవాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కోరారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కొంత ఏమరుపాటుతో ఉండి ఒకటి, రెండు సీట్లు కాంగ్రెస్, బీజేపీలను గెలిపించిన ప్రజలు మళ్లీ మేల్కొని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తిరిగి కేసీఆర్ వైపు నిలబడ్డారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అన్నారు.

కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు బండ యాదగిరిరెడ్డి, మాజీ మార్కెట్ చైర్‌పర్సన్ బండ పద్మ యాదగిరిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు గజ్జెల నర్సిరెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు పసుల ఏబేల్, పోకల లింగయ్య, చిన్నం నర్సింహులు, చెంచారపు పల్లవి సోమిరెడ్డి, ఉల్లెంగుల నర్సింగ్, మామిడాల రాజు, చింతల మల్లికార్జున్, ఉల్లెంగుల కృష్ణ, బక్క లక్ష్మణ్, ఉడుగుల నర్సింహులు, కిష్టయ్య, గుర్రం నాగరాజు, సోమేశ్వర్, ఆకునూరి వెంకన్న, లెనిన్, షాహిస్తా షబ్నం, గంగా తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles