సంక్షేమ సర్కార్‌కు ప్రజల ఆశీర్వాదం

Mon,July 15, 2019 01:55 AM

- గోదావరి నీళ్లతో ఆడబిడ్డల కాళ్లు కడుగుతాం
- జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
- 43 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
- పాల్గొన్న జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి


జనగామ, నమస్తే తెలంగాణ, జూలై 13: సబ్బండ వర్గాలకు చేయూతనందిస్తున్న సంక్షేమ సర్కార్‌ను ప్రజలు ఆశీర్వదిస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. జనగామలోని డీఆర్‌డీఏ కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద మంజూరైన రూ. 41,5,872 విలువైన చెక్కులను 43 మంది లబ్ధిదారులకు జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ముత్తిరెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ సర్కారు అందరినీ సమానంగా చూస్తున్నదన్నారు. లబ్ధిదారులు అన్ని పార్టీలకు చెందిన వారిని, రాజకీయాలకతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నట్లు చెప్పారు. టీఆర్‌ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లో గులాబీ పార్టీకి ప్రజలు అఖండ మెజార్టీని కట్టబెట్టారన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారంతో రాష్ర్టాన్ని దేశానికి రోల్‌మోడల్ తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు సాగుతున్నారన్నారు. ప్రపంచ దేశాలు అబ్బురపడేలా, మేధావులు, జ్ఞానులు, ఇంజినీర్లు ఆశ్వర్య పడేలా గోదావరి వరదను ఎదురు పారించి ఆడబిడ్డల కాళ్లు కడిగి ఎగువ ప్రాంతాలు సస్యశామలం చేయబోతున్నట్లు స్పష్టం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి వచ్చే ఏడాది చివరి నాటికి జనగామ ప్రాంతంలోని అన్ని గ్రామాల్లో చెరువులు, కుంటలు గోదావరి జలాలతో నిండుతాయన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో జనగామలోని 30 వార్డులను గెలుచుకొని గులాబీ జెండా ఎగిరేలా పార్టీ శ్రేణులు సిద్ధపడుతున్నారని వివరించారు. రానున్న 50 ఏళ్ల వరకు తెలంగాణ జిల్లాల్లో సాగు, తాగునీటి కొరత ఉండద్దనే సంకల్పంతో బృహత్తర పథకాలకు సీఎం కేసీఆర్ రూపకల్పన చేస్తున్నట్లు వెల్లడించారు. జనగామ పట్టణాన్ని సుందరీకరించడంతోపాటు రూ. 100 కోట్లతో అండర్ డ్రైనేజీ నిర్మాణం, అన్ని వార్డుల్లో సీసీరోడ్డు, డ్రైనేజీలు నిర్మిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు నిమ్మతి దీపిక మహేందర్‌రెడ్డి, ఎంపీపీ మేకల కళింగరాజు, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ ప్రమోద్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షురాలు శారద స్వామి, తహసీల్దార్ రవీందర్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles