కరువు నేలపై.. నీలి విప్లవం..!

Fri,July 12, 2019 02:38 AM

జనగామ, నమస్తే తెలంగాణ, జూలై 11: సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న టీఆర్‌ఎస్ సర్కార్.. కులవృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తోంది. అన్ని కులాలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో మత్స్య కార్మిక కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు చేపల సీడ్స్‌ను ఉచితంగా అందజేస్తోంది. ఈ మేరకు ప్రత్యేక కార్యాచరణతో జనగామ కరువు నేలపై నీలి విప్లవం తీసుకువచ్చి.. మత్స్యకారులకు ఉపాధి కల్పించి వారి కుటుంబాల్లో ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా జిల్లా మత్స్యశాఖ ప్రణాళిక రూపొందించింది. రెండేళ్లుగా జిల్లాలోని దేవాదుల రిజర్వాయర్లు, చెరువుల్లో నూరుశాతం సబ్సిడీపై చేప పిల్లలను పోసి మత్స్య కార్మికులకు చేతి నిండా పని కల్పిస్తున్నది. గత ఏడాది జిల్లాలోని 775 చెరువుల్లో 2.92 కోట్ల చేప పిల్లలను పోయగా, ఈ ఏడాది తొమ్మిది రిజర్వాయర్లు, 678 చెరువుల్లో 2.89 కోట్ల వివిధ రకాల చేపల సీడ్స్ పోసేందుకు సిద్ధమయ్యారు.

మత్స్య సంపద పెంచేందుకు మత్స్యశాఖ ఆధీనంలో 121 చెరువులు, గ్రామ పంచాయతీల ఆధీనంలో 444 చెరువులు, 104 సొసైటీ యేతర చెరువులను ఉపయోగిస్తున్నారు. జిల్లాలో 154 మత్స్య కార్మిక సహకార సంఘాలు ఉంటే.. వీటిలో 21 మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మొత్తం 11,500 మంది మత్స్య పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. గత ఏడాది జిల్లాలో మత్స్య సంపద ద్వారా ఆయా కుటుంబాలకు పెద్ద ఎత్తున ఆదాయం సమకూరింది. ప్రభుత్వం 1.03 కోట్ల విలువైన చేప పిల్లలను పంపిణీ చేయగా, రూ. 3.60 కోట్ల ఆదాయాన్ని మత్స్యకార్మిక కుటుంబాలు పొందాయి. జిల్లాలో నాలుగు విడతలుగా మిషన్ కాకతీయ ద్వారా పునరుద్ధరించిన చెరువులను ఇటు దేవాదుల నుంచి రిజర్వాయర్ల ద్వారా గోదావరి జలాలు నింపేందుకు.. మరికొన్ని చిన్నతరహా చెరువులు, నీటి వనరులు వచ్చే 15 రోజుల్లో 40 శాతం వర్షపునీటితో నిండిన వెంటనే చేప పిల్లలను విడిచేందుకు నిర్ణయించారు. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా తొమ్మిది రిజర్వాయర్లు, 678 చెరువుల్లో 2,89,39,500 చేప పిల్లల విత్తనాలు వేసేందుకు వీలుగా మత్స్యశాఖ టెండర్లను ఆహ్వానించగా, ఈ నెల 5న జేసీ సమక్షంలో కాంట్రాక్టర్ల నుంచి బిడ్‌లు స్వీకరించి, తొలిదశ ప్రక్రియను పూర్తి చేశారు. తొమ్మిది దేవాదుల రిజర్వాయర్లలో 80 నుంచి 100 మిల్లీ మీటర్ల సైజు ఉండే 43.16 లక్షల వివిధ రకాల చేప పిల్లల విత్తనాలు వేయనున్నారు. వాటిలో కట్ల రకం పిల్లలు 17,26,400 (40 శాతం), రాహు(రవ్వలు) 21,58000 (50 శాతం), మెరిగెలు (బంగారు తీగెలు) 4,31,600 (10 శాతం) నిష్పత్తిలో చేప పిల్లలను విడిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా జిల్లాలోని 678 చెరువుల్లో 35 నుంచి 40 మిల్లీ మీటర్ల సైజు ఉండే కట్ల రకం చేప పిల్లలు 86,18,125 కట్ల (35 శాతం), రాహు (రవ్వలు) 86,18, 125 (35 శాతం), సాధారణ రకం 73,87,050 చేప పిల్లలు 30 శాతం నిష్పత్తిలో విడిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మత్స్య కుటుంబాల్లో వెలుగులు..
మత్స్య పరిశ్రమ అభివృద్ధికి బాటలు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వ చర్యలతో గత పాలకుల హయాంలో నిరాదరణకు గురైన మత్స్యకార్మికుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నిండుతున్నాయి. టీఆర్‌ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మదిలో మెదిలిన ఆలోచన మేరకు రూపుదిద్దుకున్న వందశాతం సబ్సిడీ చేపపిల్లల పంపిణీ పథకంతో వలసబాట పట్టిన మత్స్యకారుల కుటుంబాలు స్వగ్రామాలకు తిరిగివచ్చి కులవృత్తిని కొనసాగిస్తూ తలెత్తుకొని జీవిస్తున్నారు. గ్రామీణ కుల వృత్తులకు పెద్దపీట వేస్తున్న సర్కార్ కార్యక్రమాలతో అనేక కుటుంబాలు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నాయి. ఒకప్పుడు ఆంధ్రా ప్రాంతం నుంచి చేపలను తెచ్చుకొని అమ్ముకునే దుస్థితి నుంచి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మన చెరువులు, మన నీటి వనరుల్లో చేపలు పెంచుతూ ఏటేటా మత్స్యసంపదను వృద్ధి చేసుకునే స్థాయికి ఎదిగింది. మత్స్యకార్మికులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వందశాతం సబ్సిడీపై చేప పిల్లలను ప్రతీ ఏడాది ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి మత్స్యశాఖ ద్వారా పంపిణీ చేస్తున్నది. ఫలితంగా జిల్లాలో మునుపెన్నడూ లేనివిధంగా మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకున్నాయి. ప్రభుత్వం గత ఏడాది జిల్లాలో రూ. 1.3 కోట్ల విలువైన చేపపిల్లలు చెరువులు, రిజర్వాయర్లలో జారవిడిస్తే మత్స్యకారులు రూ. 3.60 కోట్ల ఆదాయాన్ని పొందారు.

టెండర్ల ప్రక్రియ పూర్తి
ప్రభుత్వ ఆదేశాలతో ఇటీవలే ఆయా సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించి మొదటి దశ ప్రక్రియను పూర్తి చేశాం. వారం, పదిరోజుల్లో వర్షాలు పడి రిజర్వాయర్లు, చెరువుల్లోకి 40శాతం నీరు చేరిన వెంటనే టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్ల ద్వారా చేపపిల్లలు జారవిడిచేలా ప్రణాళిక రూపొందించాం. రిజర్వాయర్లలో రెండున్నర ఇంచుల పొడవు ఉండే చేప పిల్లలు, మిగతా చెరువుల్లో ఒకటిన్నర ఇంచుల చేప పిల్లలను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈసారి జిల్లాలో సంవృద్దిగా వర్షాలు కురిస్తే మత్స్య సంపద గణనీయంగా పెరుగుతుంది.
- పిల్లి శ్రీపతి, జిల్లా మత్స్యశాఖ అధికారి

65
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles