గడపగడపకూ టీఆర్‌ఎస్ సభ్యత్వం

Wed,July 10, 2019 01:18 AM

జనగామ నమస్తే తెలంగాణ, జూలై 09: జనగామ పట్టణంలో గులాబీ పార్టీ సభ్యత్వ నమోదు జోరుగా సాగుతున్నది. కొద్ది రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనుండగా, గడపగడపకూ పార్టీ సభ్యత్వం ఉండాలనే లక్ష్యాన్ని స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పార్టీ శ్రేణులకు నిర్దేశించారు. ఇప్పటికే సంక్షేమ, అభివృద్ధి పథకాల నినాదాలను పట్టణంలో గోడలపై రాయించారు. రెండు రోజుల క్రితం పట్టణ పార్టీ సమీక్ష నిర్వహించి, వార్డు అధ్యక్షులు, కార్యదర్శులకు సభ్యత్వ నమోదు అంశంతోపాటు మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో గులాబీ జెండా ఎగిరేలా శ్రేణులు కార్యోన్ముఖులను చేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పట్టణంలో ఇంటింటికీ తీసుకెళ్లి క్షేత్రస్థాయి విస్తృత ప్రచారం చేయాలని నిర్దేశించారు. కార్యకర్తలకు 5 వేల కండువాలు, వార్డుల్లోని అన్ని వీధుల్లో రెపరెపలాడేలా 12 వేలకు పైగా పార్టీ జెండాలతో గులాబీమయం చేస్తున్నారు. కాగా, మంగళవారం పట్టణంలోని పలు వార్డుల్లో మాజీ కౌన్సిలర్లు, వార్డు అధ్యక్షులు, కార్యదర్శులు, ముఖ్యనేతలు ముమ్మరంగా సభ్యత్వ నమోదు చేయించారు. పట్టణంలోని పాత 6వ వార్డులో మార్కెట్ కమిటీ మాజీ చైర్‌పర్సన్ బండ పద్మ యాదగిరిరెడ్డి వ్యాపార, వాణిజ్య సముదాయాలకు వెళ్లి సభ్యత్వాలు ఇచ్చారు. కాగా, 500 సభ్యత్వాలను పూర్తి చేసిన పుస్తకం, నగదును మాజీ కౌన్సిలర్ ఉల్లెంగుల నవ్యశ్రీ నర్సింగ్ స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో రాపర్తి ప్రశాంత్, శ్రీను, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

60
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles