కార్యకర్తలే కొండంత బలం

Wed,July 10, 2019 01:18 AM

బచ్చన్నపేట, జూలై 09: కార్యకర్తలే టీఆర్‌ఎస్‌కు కొండంత బలం. అరవై ఏళ్లు దోపిడీకి గురైన తెలంగాణ రాష్ర్టాన్ని సాధించాలన్న పట్టుదలతో అప్పటి ఉద్యమనేత, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క పిడికిలి బిగిస్తే.. తెలంగాణ యావత్ లక్షల పిడికిళ్లు జతకట్టడంతో రాష్ర్టాన్ని సాధించుకున్నామని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు జిల్లా ఇన్‌చార్జి మందుల సామ్యూల్ అన్నారు. మండలకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన సభ్యత్వ నమోదుపై టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, పార్టీ ముఖ్య నేతలతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా సామ్యూల్ మాట్లాడుతూ సీమాంధ్రులు అరవై ఏళ్లు తెలంగాణ ప్రజలను బానిసలుగా చూసి, అన్ని రంగాల్లో వివక్ష చూపారన్నారు. ఈ తరుణంలో ఆంధ్ర పెత్తందార్లపై ఉద్యమ పిడికిలి ఎత్తిన కేసీఆర్.. రాష్ట్రం సాధించే వరకూ నిద్రపోలేదన్నారు. 2001 ఏప్రిల్ 27న టీఆర్‌ఎస్‌ను స్థాపించి ప్రజలతో కలిసి ఉద్యమాలు చేసిన ఘనత ముఖ్యమంత్రికే దుక్కుతుందన్నారు.

పార్టీ బలోపేతంలో కార్యకర్తలే కీలకం..
పార్టీ సభ్యత్వాన్ని ప్రతీ రెండేళ్లకోసారి చేపట్టి గ్రామ, మండలం, జిల్లా, రాష్ట్రస్థాయిలో టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేయడంలో కార్యకర్తలే కీలకమని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు సామ్యూల్ తెలిపారు. ఎన్నో ఆటుపోట్లను అధిగమించి తెలంగాణ సాధకుడిగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. తెలంగాణ కోసం నాడు ఎన్ని ఉద్యమాలు చేపట్టినా చివరకు విజయం సాధించింది కేసీఆర్ సారేనన్నారు. తెలంగాణను ఆంధ్రాలో కలిపి ఆనాడే ఆన్యాయం చేశారన్నారు. నాడు తెలంగాణ కోసం 372 మంది బలి అయ్యారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆంధ్ర పాలకుల స్వార్థ విధానాలకు తెలంగాణ తల్లడిల్లిపోయిందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో తీరని అన్యాయం చేశారన్నారు. కృష్ణా, గోదావరి జలాల్లో తమ వాటా ఎంతో చెప్పాలని ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వలేక.. దాటవేత ధోరణి అవలంబించిన టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తెలంగాణలో నేడు పుట్టగతులు లేకుండా పోయాయని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది..
వందల ఏళ్ల చరిత్ర ఉందని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు తీరని ద్రోహం చేసిందని మందుల సామ్యూల్ విమర్శించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని అప్పటి నుంచి పోరాటాలు, ఉద్యమాలు, ప్రాణత్యాగాలు, బలిదానాలు చేసిన ఘనత తెలంగాణ ప్రాంతానికే దక్కిందన్నారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, ఆరుట్ల రామచంద్రారెడ్డి వంటి పోరాట యోధులు రజాకార్ల పాశవిక చర్యలపై పోరాటాలు చేసిన చరిత్ర ఓరుగల్లు జిల్లాకే ఉందన్నారు. అందులో జనగామ ప్రాంతానికి మరింత ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఎన్నో ఉద్యమాల ఫలితంగా కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధిస్తే.. కాంగ్రేసోళ్లు తెలంగాణ ఇచ్చింది తామేనని చెప్పుకోవడం సరికాదన్నారు. ఏ ఊల్లో కుంట, చెరువు, మత్తడి ఉందో తెలిసిన మహానుభావుడు కేసీఆర్ అని అన్నారు. అనంతరం గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ కోదండపాణికి టీఆర్‌ఎస్ సభ్యత్వం అందించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్‌పర్సన్ గిరబోయిన భాగ్యలక్ష్మి అంజయ్య, ఎంపీపీ బావండ్ల నాగజ్యోతి కృష్ణంరాజు, వైస్ ఎంపీపీ కల్లూరి అనిల్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ సంజీవరెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యుడు షబ్బీర్, పట్టణ అధ్యక్షుడు గంధమల్ల నరేందర్, సర్పంచ్ మల్లారెడ్డి, నాయకులు ఉపేందర్‌రెడ్డి, గుర్రపు బాలరాజు, పందిపెల్లి సిద్ధిరాంరెడ్డి, లక్ష్మణ్, సిద్ధిరాములు, అజీం, గోవర్ధన్‌రెడ్డి, ప్రసన్న, కిష్టయ్య, ఉప్పలయ్య, కరుణాకర్‌రెడ్డి, బాబుగౌడ్ పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌తో ప్రజల జీవితాలకు భరోసా
స్టేషన్‌ఘన్‌పూర్ నమస్తే తెలంగాణ, జూలై 09: ప్రజలు స్వచ్ఛందంగా టీఆర్‌ఎస్ సభ్యత్వాలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. మండలకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సభ్యత్య నమోదు ఆన్‌లైన్ ప్రక్రియను మంగళవారం ఆయన పరిశీలించారు. ఇప్పటి వరకు పూర్తయిన సభ్యత్వ నమోదు వివరాలను ఇన్‌చార్జి ఆకుల కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ఊపిరిగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావించిందన్నారు. ఇప్పటి వరకు స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో 60 శాతం సభ్యత్య నమోదు పూర్తయిందని చెప్పారు. ప్రతి ఒక్కరూ పార్టీ సభ్యత్యం తీసుకోవాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకోవడం వల్ల ప్రజల జీవితాలను మరింత భరోసా ఉంటుందన్నారు. గ్రామాల్లో సభ్యత్వాలు తీసుకునేందుకు క్యూ కడుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మిషన్ భగరీథ, మిషన్ కాకతీయ పథకాలు ఎంతో ప్రజాదరణ పొందినట్లు చెప్పారు.

లక్ష్యానికి మించి..
నియోజకవర్గంలో లక్ష్యానికి మించి సభ్యత్యాలు నమోదవుతున్నట్లు ఎమ్మెల్యే రాజయ్య చెప్పారు. రాజకీయంగా చైతన్యవంతమైన స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో అత్యధికంగా సభ్యత్యాలు స్వీకరించి.. రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపేలా కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. వాడవాడలా సభ్యత్యం స్వీకరణలో యువతీ యువకుల ఉత్సాహం బాగుందన్నారు. ఈ నెల చివరి వరకు ప్రతీ కార్యకర్త టీఆర్‌ఎస్ క్రియాశీల లేదంటే శాశ్వత సభ్యత్యాన్ని స్వీకరించాలని కోరారు.

వందశాతం పూర్తి చేస్తాం..
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో వందశాతం సభ్యత్య నమోదు పూర్తి చేస్తామని స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట నియోజకవర్గాల సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి ఏడవెల్లి కృష్ణారెడ్డి అన్నారు. సభ్యత్వాలు తీసుకున్న వారికి తప్పనిసరిగా రూ. 2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని చెప్పారు. సభ్యత్వాలు తీసుకున్న ప్రతీ ఒక్కరి పేరును కంప్యూటర్‌లో నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు రూ. 50కే క్రియాశీల సభ్యత్యం ఇస్తున్నట్లు చెప్పారు. ప్రక్రియ పూర్తయిన తర్వాత గుర్తింపు కార్డులు జారీ చేస్తామని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే రాజయ్య నియోజకవర్గ సభ్యత్వ నమోదు వివరాలను కృష్ణారెడ్డికి అందజేశారు. సమావేశంలో ఎంపీపీ కందుల రేఖ, జెడ్పీటీసీ మారపాక రవి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు సురేష్‌కుమార్, జిల్లా నాయకులు గాదేపాక అయోధ్య, పసునూరి మహేందర్‌రెడ్డి, ఇల్లందుల శ్రీనివాస్, రామక్క పాల్గొన్నారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles