నిద్రమత్తులో రవాణా శాఖ..!

Wed,June 19, 2019 01:27 AM

జనగామ టౌన్‌, జూన్‌ 18: నిబంధనలు పాటించని వాహనాలపై ఉక్కుపాదం మోపాల్సిన రవాణా, పోలీస్‌ శాఖలు నిద్రమత్తు వీడడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్డు భద్రతా నియమనిబంధనలు పాటించని వారిపై కఠినంగా వ్యవహరించాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మంగళవారం జిల్లాకేంద్రంలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని నెహ్రూపార్కు సెంటర్‌ నుంచి కలెక్టర్‌ టీ వినయ్‌కృష్ణారెడ్డి క్యాంప్‌ కార్యాలయానికి వాహనంలో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న ఓ ఆటోను గమనించారు. వెంటనే ఆటోను పట్టుకుని జిల్లా పోలీస్‌, రవాణా శాఖ అధికారులకు అప్పగించారు. ఆటో పరిమితి కేవలం నలుగురు ప్రయాణికుల సామర్థ్యం కాగా, డ్రైవర్‌ 12 మంది విద్యార్థులతోపాటు మరో ఇద్దరు ప్రయాణికులతో వెళ్తున్నారు. మొత్తంగా డ్రైవర్‌తో సహా అందులో 15 మంది ఉండడంతో అధికారులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ మేరకు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ఆటోను సీజ్‌ చేశారు. ఆటోకు కూడా పత్రాలు లేకపోవడం.. ఆటోను నడిపిన వ్యక్తి మైనర్‌ అని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. గతంలో రెండుసార్లు కలెక్టర్‌ స్వయంగా ఆటోలను పట్టుకుని అధికారులకు అప్పగించారు.
నిబంధనలు పాటించని వారిపై కఠినంగా వ్యవహరించాలని చెప్పినా అధికారులు ఇంకా నిద్రమత్తులోనే తూలుతున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. బుధవారం నుంచి జిల్లాలో నిబంధనలు పాటించని వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్‌, రవాణా శాఖ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఇప్పటికైనా రవాణా శాఖ అధికారులు నిద్రవీడి ప్రయాణికులకు భద్రత కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. కాగా, మరోసారి స్కూల్‌ పిల్లల భద్రతపై కలెక్టరే నేరుగా దృష్టి సారించడంపై జిల్లా ప్రజలు వినయ్‌కృష్ణారెడ్డిని అభినందించారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles